
వాంగ్‌చుక్ ఆరోగ్యం విషమం.. జూలై 20 పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు
జంతర్‌మంతర్‌లో 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్.. పెరుగుతోన్న రాజకీయ మద్దతు
విద్యావేత్త, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష శుక్రవారానికి 20వ రోజుకు చేరుకుంది. ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ.. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై 20 వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. జూలై 20న పార్లమెంట్‌కు చేపట్టనున్న శాంతియుత పాదయాత్రను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఆరోగ్యం క్షీణిస్తున్నా.. దీక్ష కొనసాగింపు..
జంతర్‌మంతర్‌లో మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడిన వాంగ్‌చుక్.. బయటకు బలహీనంగా కనిపిస్తున్నా, మానసికంగా ఎంతో ధైర్యంగా ఉన్నానని చెప్పారు. "జూలై 20 వరకు ఎలాగైనా బ్రతికే ఉంటాను. అందరం కలిసి పార్లమెంట్‌కు వెళ్లి మన డిమాండ్లను వినిపిద్దాం" అని అన్నారు. తన వ్యాఖ్యలతో అక్కడున్న వారిలో ఉత్సాహం నింపారు.
వైద్యుల హెచ్చరిక..
వైద్యుల ప్రకారం గత 24 గంటల్లో వాంగ్‌చుక్ మరో 350 గ్రాముల బరువు తగ్గారు. మొత్తం 9.5 కిలోల బరువు కోల్పోయి ప్రస్తుతం ఆయన బరువు 56.55 కిలోలకు చేరింది. స్వల్ప నిర్జలీకరణ లక్షణాలు ఉన్నాయని, దీక్ష కొనసాగితే శరీర అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించే వరకు దీక్ష విరమించబోనని వాంగ్‌చుక్ స్పష్టం చేశారు.
ఇతర నిరసనకారుల పరిస్థితి కూడా ఆందోళనకరం..
వాంగ్‌చుక్‌కు మద్దతుగా దీక్ష చేస్తున్న నేహా, మనీష్, అమీన్‌ల ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉందని ఏఐఎస్ఏ తెలిపింది. ఒకరికి డీహైడ్రేషన్ తీవ్రంగా ఉండగా, మరొకరి రక్తంలో చక్కెర స్థాయి ప్రమాదకరంగా పడిపోయింది. అయినా వారు దీక్ష కొనసాగిస్తామని ప్రకటించారు.
పెరుగుతోన్న రాజకీయ మద్దతు..
జంతర్‌మంతర్‌లోని నిరసన శిబిరాన్ని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా సందర్శించి వాంగ్‌చుక్‌కు సంఘీభావం తెలిపారు. అంతకుముందు సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ కూడా నిరసనకారులను కలిశారు. అలాగే అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేష్ యాదవ్ తదితర ప్రతిపక్ష నేతలు వాంగ్‌చుక్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. నటుడు ప్రకాశ్ రాజ్, రచయిత్రి అరుంధతి రాయ్, నటులు నసీరుద్దీన్ షా, రత్న పాఠక్ షా తదితర ప్రముఖులు కూడా ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.
ప్రధాన డిమాండ్లేమిటి?
NEET ప్రవేశ పరీక్షల్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. పరీక్షల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం ఇవ్వాలని కోరుతోంది. జూన్ 20న ప్రారంభమైన ఈ ఆందోళనలో వాంగ్‌చుక్ జూన్ 28న చేరి అప్పటి నుంచి నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. జూలై 20న పార్లమెంట్‌కు శాంతియుత పాదయాత్ర నిర్వహించనున్నట్లు నిరసనకారులు ప్రకటించారు.

