
సుప్రీంకోర్టు వరకూ పాదయాత్రగా ఇండి కూటమి
అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేస్తామని వెల్లడించిన గాంధీ
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఆందోళన చేస్తున్న ఇండి కూటమి నాయకులు.. తమ పోరాటాన్ని సుప్రీంకోర్టు వరకూ తీసుకెళ్తున్నారు. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇతర ప్రతిపక్ష నాయకులతో కలిసి ఒక పాదయాత్ర నిర్వహించారు. వీరు సీఈసీకి వ్యతిరేకంగా ఒక పిటిషన్ సమర్పించడానికి త్వరలో సుప్రీంకోర్టు ప్రాంగణానికి చేరుకోనున్నారు.
‘‘ఓట్ చోరీ’’ అంటూ రాహుల్ గాంధీ హంగామా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సుప్రీంకోర్టును కూడా ఈ వివాదంలోకి లాగడానికి చేస్తున్న ప్రయత్నాలను సీజేఐ తిరస్కరించారు. ఇప్పటికే ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నాయని, అవి అలా ఉండగానే తాను ప్రతిపక్ష నేతలను కలవడం న్యాయసూత్రాలకు విరుద్దమని అన్నారు.
అంతకుముందు ఓట్ చోరీ ని అంతం చేయాలని, ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, సర్ ను నిలిపివేయాలని, బ్యాలెట్ విధానంలో తిరిగి ఎన్నికలు జరపాలని వీరు డిమాండ్ చేస్తూ సీజేఐకి లేఖ రాశారు.
తాము కేవలం న్యాయపరమైన విధులు మాత్రమే నిర్వహించగలమని , పరిపాలనాపరంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని సీజేఐ సూర్యకాంత్ ఆదివారం తెలిపారు. న్యాయపరంగా పిటిషన్ దాఖలు చేయాలని దానిని మంగళవారం విచారణకు స్వీకరిస్తామని తెలిపారు. సుప్రీంకోర్టు అందరికి 24 గంటలు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. పరిపాలనాపరంగా, కార్యానిర్వాహకపరంగా సుప్రీంకోర్టు ఈ విధుల్లో జోక్యం చేసుకోమని పేర్కొంది.
ప్రజాస్వామ్య యాత్ర..
దేశం తరఫున సీజేఐకి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రతిపక్ష పార్టీలు, పౌర సమాజం, యువత సుప్రీంకోర్టుకు పాదయాత్ర చేస్తారని ఆయన అంతకుముందు చెప్పారు. దీని కోసం నాయకులు మధ్యాహ్నం 1.30 కి కన్నాట్ ప్లేస్ బారాఖంబా రోడ్ కూడలికి రావాలని ఎక్స్ లో ట్వీట్ చేశారు.
‘‘మోదీ, అమిత్ షా, అజిత్ దోవల్, మోహన్ భాగవత్ భారత్ గొంతు నొక్కలేరు. ఈ పిరికివాళ్లు మిమ్మల్ని భయపెట్టలేరు... వారు తప్పుకోవాల్సిందే.. మనం ప్రేమ, సోదరభావం, దేశభక్తితో కలిసి నడుస్తాం.. భయపడొద్దు’’ అని ఆయన అన్నారు.
Next Story

