
రేవంత్ జీ, మాతో కలవండి... మీరనుకున్నది సాధిస్తారు: ప్రధాని మోదీ
నిండు సభలో రేవంత్ మీదకు రాజకీయ వల విసిరిన ప్రధాని మోదీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీదకు ప్రధాని వల విసిరారు. నేడు హైదరాబాద్ పర్యటనలో ఉండగా, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించే కార్యక్రమంలో మోదీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వేదిక మీద ఉన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణకు సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. వేదిక మీద కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా సభలో ఉన్నవారికి కనిపిస్తున్నారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి మీద ఆయన దృష్టి మళ్లించారు.
అసలేం జరిగిందంటే...
ఉపన్యాసం మధ్యలో వేదిక మీద ఉన్న ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి మీదకు మోదీ ఒక చమత్కార బాణం విసిరారు. దానికి చాల అర్థాలున్నాయి, రాజకీయార్థం చాలా స్పష్టంగా ఉండటంతో ప్రధాని కామెంట్ గాని సభలో నవ్వుల పువ్వులు వికసించాయి. ప్రధాని ఏమన్నారంటే... “నేను రేవంత్ రెడ్డికి చెప్పేదేమిటంటే, భారత ప్రభుత్వం తన పదేళ్ల పాలనలో గుజరాత్‌కు ఏమి ఇచ్చిందో, అదంతా మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నాకున్న పరిజ్ఞానం ప్రకారం, నేను అలా చేయకపోతే, మీరు ప్రస్తుతం పొందుతున్నది సగానికి తగ్గిపోతుంది. మీరు వెళ్లాలనుకుంటున్న చోటికి చేరుకోలేరు. కాబట్టి మీరు నాతోనే పొత్తు పెట్టుకోవడం మంచిది.”
దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల మధ్య రేవంత్ ని కావాలనే ప్రధానిమోదీ కవ్వించారా? మొత్తానికి నిండు సభలో ప్రధాని విసిరిన చమత్కార బాణం పెద్ద చర్చకు దారి తీసే అవకాశం ఉంది.
రేవంత్ సమయస్ఫూర్తి
అయితే, ప్రధానికి రేవంత్ రెడ్డి సూచన కూడా చాలా సమయస్ఫూర్తితో కూడి ఉంది. మీరు గుజరాత్ ను అభివృద్ది చేయడం వెనన అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సహకారం ఉంది. ఇపుడు తెలంగాణ ప్రజలు మన్మోహన్ మీకు అందించిన సహకారమే మీరు తెలంగాణకు ఇవ్వాలని కోరుతున్నారు అని రేవంత్ చెప్పారు. వచ్చే పదేళ్లలో తెలంగాణ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారేందుకు మీరు సహకారం అందించండని రేవంత్ కోరారు.
#WATCH | Hyderabad, Telangana: Chief Minister Revanth Reddy says, "When Manmohan Singh was the PM, Narendra Modi was the CM of Gujarat, he developed the Gujarat model in 10 years for the nation. Today, the people of Telangana also have the same hope. When he is the PM, the people… pic.twitter.com/mdWFm0XVXn
— ANI (@ANI) May 10, 2026
సభలో ప్రధాని మోదీ ప్రసంగం
సైబరాబాద్ సామర్థ్యం జాతీయ స్థాయిలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా ఉందని మోదీ అన్నారు. తెలంగాణ దేశ వేగవంతమైన అభివృద్ధికి కీలక కేంద్రంగా మారుతోందని చెప్పారు. అందుకే హైదరాబాద్ పరిసర ప్రాంతాలను పెద్ద మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కేంద్రం భారీ ప్రాజెక్టులను ప్రారంభించిందన్నారు.
ఈ ప్రాజెక్టులతో వేలాది ఉద్యోగాలు వస్తాయని, తెలంగాణ కనెక్టివిటీ మరింత బలపడుతుందని తెలిపారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాను ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధిలో భాగంగా రూపొందిస్తున్నామని చెప్పారు. ఇది భవిష్యత్తులో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా మారుతుందని పేర్కొన్నారు. ఇక్కడ ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, నాణ్యమైన విద్యుత్ సరఫరా, ఆధునిక ఐసీటీ నెట్‌వర్క్ అందుబాటులో ఉంటాయని చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.
ఈ ప్రాజెక్టుల కోసం కేంద్రం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. దీంతో హైదరాబాద్, తెలంగాణ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. వాహనాలు, యంత్రాలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు తెలంగాణ రైతులు, కార్మికులకు కూడా ఉపయోగపడతాయని తెలిపారు. వరంగల్‌లో ఏర్పాటు చేసిన పీఎం మిత్ర టెక్స్‌టైల్ పార్క్ దేశ టెక్స్‌టైల్ రంగానికి కొత్త ఊపు తీసుకువస్తుందని మోదీ అన్నారు.
ఈ పార్క్‌లో ఏర్పడే యూనిట్లకు కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, పీఎల్ఐ పథకం సహాయం అందుతాయని చెప్పారు. ముఖ్యంగా మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు. గత 12 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఆధునిక కనెక్టివిటీపై భారీగా పెట్టుబడులు పెడుతోందన్నారు. రోడ్లు, రైల్వేలు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. జాతీయ రహదారులపైనే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు.
ఈ పెట్టుబడుల వల్ల తెలంగాణకు కూడా పెద్ద ప్రయోజనం కలిగిందన్నారు. గత 11 ఏళ్లలో రాష్ట్రంలో జాతీయ రహదారుల నెట్‌వర్క్ రెట్టింపు అయిందని చెప్పారు. తెలంగాణ-కర్ణాటకను కలిపే జాతీయ రహదారి విస్తరణతో ప్రయాణ సమయం తగ్గడంతో పాటు రవాణా ఖర్చులు కూడా తగ్గుతాయని పేర్కొన్నారు. 2014కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వెయ్యి కోట్ల రూపాయల కంటే తక్కువ రైల్వే బడ్జెట్ ఉండేదని గుర్తు చేశారు. ప్రస్తుతం తెలంగాణకే దాదాపు రూ.5,500 కోట్ల రైల్వే బడ్జెట్ వస్తోందన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం రూ.50 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని తెలిపారు. తెలంగాణలో ఐదు వందే భారత్, ఆరు అమృత్ భారత్ రైళ్లు నడుస్తున్నాయని చెప్పారు. కాజీపేట-విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు ప్రారంభించామని తెలిపారు. కాజీపేట రైల్ అండర్ బైపాస్ లైన్‌ను కూడా దేశానికి అంకితం చేసినట్లు చెప్పారు. దీంతో ప్రయాణం సులభమవడంతో పాటు రవాణా వేగం పెరుగుతుందని పేర్కొన్నారు.
ఎనర్జీ భద్రతపై కూడా కేంద్రం భారీ పెట్టుబడులు పెడుతోందని మోదీ తెలిపారు. మల్కాపూర్‌లో ఇండియన్ ఆయిల్ కొత్త టెర్మినల్ ప్రారంభం తెలంగాణ పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చడంలో కీలకంగా మారుతుందని చెప్పారు. సరఫరా వ్యవస్థ కూడా బలపడుతుందని పేర్కొన్నారు. సౌర విద్యుత్ రంగంలో భారత్ అగ్రదేశాల్లో ఒకటిగా ఎదిగిందన్నారు. పెట్రోల్‌లో ఎథనాల్ మిశ్రమం పెంచడంలో కూడా మంచి పురోగతి సాధించామని తెలిపారు.
ఇప్పుడు పైప్ గ్యాస్, సీఎన్‌జీ వ్యవస్థలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. తెలంగాణ యువత కొత్త కలలతో ముందుకు సాగుతోందని మోదీ అన్నారు. రైతులు, పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లు అభివృద్ధి చెందిన తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాయని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని మరోసారి స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రజల కలలు నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరింత వేగంగా పనిచేస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రాల అభివృద్ధి లేకుండా దేశాభివృద్ధి సాధ్యం కాదని మోదీ పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని అందరం కలిసి సాధించాలని పిలుపునిచ్చారు.

