
జూ పార్కులో జరిగిన సదస్సులో మాట్లాడుతున్న గవర్నర్ శివప్రతాప్ శుక్లా
బిగ్ క్యాట్స్ సంరక్షణలో భారత్ ప్రపంచానికి మార్గదర్శి: గవర్నర్
బిగ్ క్యాట్స్ సంరక్షణకు హైదరాబాద్‌లో అంతర్జాతీయ వేదిక
భారతీయ సంస్కృతిలో వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక స్థానం ఉందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా చెప్పారు.హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో బిగ్ క్యాట్స్ సంరక్షణపై అంతర్జాతీయ వర్క్‌షాప్ లో ఆయన మాట్లాడారు. పులులు, చిరుతలు, సింహాలు, చీతాల సంరక్షణలో భారత్ సాధించిన విజయాలను గవర్నర్ గుర్తుచేశారు.ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ చీతా వంటి కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని ఆయన పేర్కొన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్‌ను గవర్నర్ అభినందించారు.
బిగ్ క్యాట్స్ సంరక్షణపై చర్చ
తెలంగాణ అటవీ శాఖ, భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో బిగ్ క్యాట్స్ సంరక్షణపై చర్చా కార్యక్రమం జరిగింది. అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ (IBCA) పరిధిలో పెద్ద పులుల సంరక్షణకు సంబంధించి ప్రపంచ దేశాల మధ్య సహకారం పెంపొందించడంపై ఈ వేదికపై చర్చలు జరిగాయి.ఈ సందర్భంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మలేషియా, రష్యా, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. మలేషియా తరఫున చెన్నై కాన్సుల్ జనరల్ సరవణ కుమార్ కుమారవాసం, రష్యా తరఫున చెన్నై కాన్సుల్ జనరల్ వాలెరి ఖొడ్జాయేవ్, శ్రీలంక తరఫున డిప్యూటీ హై కమిషనర్ గణేశనాథన్ గీతేశ్వరన్, థాయ్‌లాండ్ తరఫున రాయల్ థాయ్ కాన్సులేట్ డిప్యూటీ కాన్సుల్ జనరల్ పోర్న్‌పున్ పుపియాంగ్‌జై పాల్గొన్నారు.
వన్యప్రాణులను పరిరక్షణకు చర్యలు
ఈ కార్యక్రమంలో ప్రసంగించిన అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అంతర్జాతీయ ప్రతినిధులకు స్వాగతం పలికారు. తెలంగాణ ప్రభుత్వం అడవులు, వన్యప్రాణులు, జీవ వైవిధ్య పరిరక్షణకు కట్టుబడి ఉందని మంత్రి కొండా సురేఖ చెప్పారు. అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వుల ప్రాధాన్యతను మంత్రి వివరించారు. గిరిజన సమాజాల పాత్రను ఆమె కొనియాడారు. ఆవాసాల అభివృద్ధి, వేట నిరోధక చర్యలు, వన్యప్రాణి సంరక్షణ వల్ల రాష్ట్రంలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు.
పెద్ద పులుల పరిరక్షణకు...
వివిధ దేశాల ప్రతినిధులు తమ దేశాల్లో వన్యప్రాణుల సంరక్షణ, పెద్ద పులుల పరిరక్షణకు చేపడుతున్న చర్యలను వివరించారు. థాయ్‌లాండ్ ప్రతినిధి మాట్లాడుతూ నిరంతర ఆవాసాల సంరక్షణ, శాస్త్రీయ పర్యవేక్షణ, వేట నిరోధక చర్యల వల్ల తమ దేశంలో పులుల సంఖ్య దాదాపు 100 నుంచి 200కు పెరిగిందన్నారు.రష్యా ప్రతినిధి అమూర్ టైగర్ సంరక్షణకు సంబంధించి మంచు ప్రాంతాల్లో ఎదురయ్యే సవాళ్లను వివరించారు. శ్రీలంక ప్రతినిధి చిరుతల సంరక్షణ చర్యలపై మాట్లాడారు. మలేషియా ప్రతినిధి అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ లక్ష్యాలను అభినందిస్తూ, ఈ వేదిక ద్వారా సాంకేతిక పరిజ్ఞానం, అనుభవాల మార్పిడి, అంతర్జాతీయ సహకారం మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రజల భాగస్వామ్యంతోనే వన్యప్రాణుల పరిరక్షణ
వన్యప్రాణుల పరిశోధన, శాస్త్రీయ నిర్వహణ, సంరక్షణ పెంపకం, ఆవాసాల పునరుద్ధరణ, సిబ్బంది శిక్షణ, బిగ్ క్యాట్స్ ట్రాన్స్‌లోకేషన్ వంటి అంశాలపై కూడా చర్చలు జరిగాయి. అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ ప్రపంచ స్థాయి సమన్వయ వేదికగా ఎదగాలని ప్రతినిధులు ఆకాంక్షించారు.పీసీసీఎఫ్ (సీడబ్ల్యూఎల్డబ్ల్యూ) వినయ్ కుమార్ మాట్లాడుతూ పులుల సంరక్షణ, ఆవాసాల అభివృద్ధి, శాస్త్రీయ పర్యవేక్షణలో భారత్, తెలంగాణ సాధించిన విజయాలను వివరించారు. పీసీసీఎఫ్ డాక్టర్ సి.సువర్ణ మాట్లాడుతూ మానవ-వన్యప్రాణి ఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో శాస్త్రీయ నిర్వహణ, సాంకేతిక పరిజ్ఞానం, ఆవాసాల అనుసంధానం, ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు.అమెరికా తరఫున హైదరాబాద్ యూఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ పాల్గొని ఇటీవల కజిరంగా నేషనల్ పార్క్ సందర్శించిన అనుభవాన్ని పంచుకున్నారు. భారతదేశ జీవ వైవిధ్యం, వన్యప్రాణుల సంరక్షణ చర్యలను ఆమె అభినందించారు.
పులిపిల్లలను దత్తత తీసుకున్న గవర్నర్
నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా రెండు పులి పిల్లలను దత్తత తీసుకున్నారు.9 నెలల వయసు కలిగిన “ఇషాన్” అనే మగ పులి పిల్లతో పాటు “వన్యా” అనే ఆడ పులి పిల్లను గవర్నర్ దత్తత తీసుకున్నారు. ఈ రెండు పులి పిల్లలు 30 జూలై 2025న జన్మించాయి.వన్యప్రాణుల సంరక్షణపై ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో గవర్నర్ ఈ దత్తత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూ అధికారులు గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story

