
అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు.. : పొంగులేటి
కలెక్టర్లకు కొత్త అధికారాలు, భూ సర్వే ద్వారా వివాదాల పరిష్కారం, హౌసింగ్‌పై కీలక నిర్ణయాలు.
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని తాజా సమీక్షలో వెల్లడించారు. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో హౌసింగ్, రెవెన్యూ అంశాలపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా సమస్యలను పరిశీలించి వెంటనే సూచనలు ఇచ్చారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని వేగవంతం చేయడానికి జిల్లా కలెక్టర్లకు మరిన్ని అధికారాలు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి వారం హౌసింగ్ పురోగతిపై సమీక్ష చేయాలని ఆదేశించారు. సమస్యలు రాకుండా ఉండేందుకు ప్రతి ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక అధికారిని నియమించనున్నట్లు చెప్పారు. గతంలో దరఖాస్తు చేయని వారు ఇప్పుడు దరఖాస్తు చేసినా అర్హత ఉంటే ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి వివరించారు. ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు కేటాయించినట్లు తెలిపారు.
ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తి కావడానికి ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని సూచించారు. ఇళ్లు నిర్మించలేని వారు అవసరం లేదని తెలపగానే ఇతర అర్హులకు కేటాయించాలని ఆదేశించారు. బేస్‌మెంట్ పూర్తయ్యాక మంజూరు చేసే నిధులు ఆలస్యం కాకుండా వెంటనే విడుదల చేయాలని చెప్పారు. అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలని సూచించారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లను పూర్తి చేయాలని, అవసరమైన నీరు, విద్యుత్, డ్రైనేజి సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.
పట్టణాల్లో స్థలాల కొరతను దృష్టిలో ఉంచుకుని జి ప్లస్ వన్ విధానంలో ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. భూవివాదాల పరిష్కారంపై కూడా మంత్రి కీలక నిర్ణయాలు తెలిపారు. సర్వేతోనే శాశ్వత పరిష్కారం సాధ్యమని పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని మండలాల్లో సర్వే మ్యాప్‌తో రిజిస్ట్రేషన్ ప్రారంభించినట్లు వివరించారు. సాదా బైనామాల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ బాధ్యతలను ఆర్డీవోలకే అప్పగించినట్లు చెప్పారు.
తహశీల్దార్ కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మించనున్నట్లు, ప్రతి జిల్లా కేంద్రంలో ఆధునిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రెవెన్యూ, ఫారెస్ట్, ఎండోమెంట్, వక్ఫ్ భూముల మధ్య ఉన్న సరిహద్దు సమస్యలను ఉమ్మడి సర్వేతో పరిష్కరించాలన్నారు.

