
రూ.6 లక్షలకే... జనావాసాల మధ్యే ఇందిరమ్మ ఇళ్లు!
నగరానికి దూరంగా కాదు.. జనావాసాల మధ్యే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ క్యూర్ (CORE) పరిధిలో నిర్మించే ఇళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారంనాడు జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పేదలకు ఇళ్లు ఇవ్వడమే కాదు.. వారి జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా, ఉద్యోగ అవకాశాలకు దగ్గరగా ఉండేలా కాలనీలు నిర్మించాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్లు నగరానికి దూరంగా నిర్మిస్తే.. పేదలు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అందుకే పని ప్రాంతాలకు సమీపంలో, రవాణా సౌకర్యాలు ఉన్న ప్రాంతాల్లోనే ఇళ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న వివిధ ప్రభుత్వ శాఖల నిరుపయోగ భూములను గుర్తించి.. వాటిని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వినియోగించాలని సూచించారు. అవసరమైతే ఆయా శాఖలకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించాలని కూడా ఆదేశించారు.
హైదరాబాద్ క్యూర్ పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఫ్లాట్లు 528 చదరపు అడుగుల విస్తీర్ణం, 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో ఉంటాయి. ఒక్కో ఫ్లాట్ నిర్మాణ వ్యయం సుమారు రూ.11 లక్షలు. ఇందులో రూ.5 లక్షలను ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తుంది. మిగిలిన రూ.6 లక్షలను లబ్ధిదారుడు చెల్లించాలి. భూమి ఖర్చు మాత్రం పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. తొలి దశలో 17 నియోజకవర్గాల్లో 7,680 ఫ్లాట్లు నిర్మించనున్నారు.
ఇల్లు లేని పేద కుటుంబాలకు సొంత ఇల్లు కల్పించడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యం. ఈ పథకాన్ని ప్రభుత్వం మూడు విధాలుగా అమలు చేస్తోంది.
1) గ్రామీణ ఇందిరమ్మ ఇళ్లు – సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం.
2) పట్టణ ఇందిరమ్మ ఇళ్లు – పట్టణ ప్రాంతాల్లో అర్హులకు గృహ నిర్మాణానికి రూ.5 లక్షల సాయం.
3) హైదరాబాద్ CURE – LIG ఫ్లాట్లు – నగరంలోని పేదలకు అపార్ట్‌మెంట్ ఫ్లాట్లు.
హైదరాబాద్‌లో మాత్రమే ఒక లక్ష LIG ఫ్లాట్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తోంది. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 లక్షల ఇళ్లకు ఆమోదం లభించింది. ప్రస్తుతం రెండో విడత అమలుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కనీసం 2 వేల ఇళ్లు, మొత్తం సుమారు 2.5 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం కోసం 2026-27 బడ్జెట్‌లో రూ.5,500 కోట్లు కేటాయించారు. ఇక హైదరాబాద్‌లోని CURE ప్రాజెక్టుతో పట్టణ పేదలకు కూడా సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

