
క్యూర్‌లో ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం
పట్టణ పేదల కోసం క్యూర్ పరిధిలో ఎల్‌ఐజీ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కానుంది. త్వరలో అర్హతలు, దరఖాస్తు విధానం, టెండర్ల మార్గదర్శకాలు విడుదల కానున్నాయి.
పట్టణ పేదలకు సొంతింటి కల నెరవేర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు వేయనుంది. క్యూర్ (CURE) పరిధిలో ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇళ్ల నిర్మాణానికి ఈ నెల 20న శ్రీకారం చుట్టనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. ఈ అంశంపై మంగళవారం సచివాలయంలో హౌసింగ్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సమావేశం అనంతరం పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, హైదరాబాద్ జిల్లా మంత్రి మహ్మద్ అజారుద్దీన్‌తో కలిసి అర్హతలు, దరఖాస్తు విధానం, టెండర్ల ప్రక్రియ, అమలు విధానాన్ని ప్రకటించనున్నట్లు వివరించారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో క్యూర్ పరిధిలో దశలవారీగా లక్ష ఎల్‌ఐజీ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. తొలి దశలో పైలట్ ప్రాజెక్టుగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 500 ఇళ్లు నిర్మిస్తామని, అవసరం ఎక్కువగా ఉన్న చోట ఆ సంఖ్యను వెయ్యి వరకు పెంచుతామని చెప్పారు.
గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇందుకు అవసరమైన ప్రభుత్వ భూములను ఇప్పటికే గుర్తించినట్లు వెల్లడించారు. హౌసింగ్ శాఖ వాటిని స్వాధీనం చేసుకుందని, భవనాల నమూనాలు, అంతస్తుల సంఖ్య, ప్లాట్ల విస్తీర్ణంపై తుది నిర్ణయం మరో రెండు నుంచి మూడు రోజుల్లో తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై కూడా మంత్రి విమర్శలు చేశారు.
హైదరాబాద్‌కు 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఇళ్లు నిర్మించడం వల్ల ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోతామనే భయంతో చాలామంది లబ్ధిదారులు అక్కడ నివసించలేదని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ప్రజలు ఇప్పటికే నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇళ్లు నిర్మించే విధంగా ప్రణాళిక రూపొందించిందని మంత్రి తెలిపారు. దీంతో ఉపాధి, పిల్లల చదువు, వైద్యం, రవాణా వంటి అవసరాలకు ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పారు.
అలాగే ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లతో పాటు యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా కుటుంబాలకు దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. పథకం ప్రారంభంతో పాటు పూర్తి మార్గదర్శకాలు విడుదలైన తర్వాత దరఖాస్తుల ప్రక్రియ, అర్హతలు, అమలు విధానంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

