కోహెడలో అంతర్జాతీయ సమీకృత ఫ్రూట్ మార్కెట్
x
కోహెడ మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

కోహెడలో అంతర్జాతీయ సమీకృత ఫ్రూట్ మార్కెట్

డిసెంబరు నాటికి మార్కెట్ కార్యకలాపాలు ప్రారంభం


హైదరాబాద్ నగర శివార్లలోని కోహెడ లో అంతర్జాతీయ సమీకృత ఫ్రూట్ మార్కెట్ నిర్మాణానికి,ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ ఆఫీస్ కాంప్లెక్స్ కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో అంతర్జాతీయ సమీకృత ఫ్రూట్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడంతో పాటు రైతులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

గతంలో రైతులు పండించిన పండ్లు, కూరగాయలు, పాలు హైదరాబాద్ నగర ప్రజల అవసరాలను తీర్చేవని, అయితే పట్టణీకరణ, రియల్ ఎస్టేట్ విస్తరణ కారణంగా వ్యవసాయ భూముల విస్తీర్ణం తగ్గిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం కోటి ముప్పై లక్షలకు పైగా జనాభా కలిగిన హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆహార అవసరాలను తీర్చేందుకు ఆధునిక వ్యవసాయ మౌలిక వసతులు అవసరమన్నారు. రైతులకు భద్రతతో కూడిన అంతర్జాతీయ ప్రమాణాల మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామన్న హామీ మేరకు 240 ఎకరాల్లో ఆధునిక ఫ్రూట్ మార్కెట్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత కోహెడ ఫ్రూట్ మార్కెట్ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో పండ్లు, కూరగాయల ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని, కందుకూరు ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే టమోటా ఆధారంగా సాస్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రైతులకు మార్కెటింగ్, నిల్వ, ప్రాసెసింగ్ సదుపాయాలు కల్పించడం ద్వారా వ్యవసాయాన్ని లాభదాయకంగా మారుస్తామని తెలిపారు.ఫ్రూట్ మార్కెట్ నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా అవసరమైన నిధులను గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేస్తామని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి మార్కెట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Read More
Next Story