అమ్రాబాద్ పులుల సంరక్షణకు అంతర్జాతీయ గుర్తింపు
x
అమ్రాబాద్ టైగర్ రిజర్వులో పులి సంచారం (ఫొటో కర్టసీ : అమ్రాబాద్ అభయారణ్యం)

అమ్రాబాద్ పులుల సంరక్షణకు అంతర్జాతీయ గుర్తింపు

తెలంగాణ వేదికగా పులులు, చిరుతల సంరక్షణపై ఆరు దేశాల ప్రతినిధుల సమావేశం


తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరం మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది. పెద్ద పిల్లి జాతుల సంరక్షణపై తెలంగాణ అటవీ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయెన్స్ ఆథ్వర్యంలో భారత విదేశాంగ శాఖతో కలిసి ఈ నెల 11, 12 తేదీల్లో రెండు రోజుల వర్క్‌షాప్‌ను తెలంగాణ అటవీశాఖ నిర్వహించనుంది.పులి, సింహం, జాగ్వార్, చిరుత, స్నో లియోపార్డ్, చీతా, ప్యూమా వంటి పెద్ద పిల్లి జాతుల సంరక్షణలో అంతర్జాతీయ సహకారం, వన్యప్రాణి ఆవాసాల పరిరక్షణ, జీవ వైవిధ్య రక్షణ వంటి అంశాలపై ఈ సదస్సులో చర్చలు జరగనున్నాయని తెలంగాణ అటవీ దళాల అధిపతి డాక్టర్ సీ.సువర్ణ తెలిపారు. ప్రకృతి సంరక్షణ ఆధారిత అభివృద్ధి, జీవ వైవిధ్య పరిరక్షణ పట్ల తెలంగాణ ప్రభుత్వ కట్టుబాటును ఈ కార్యక్రమం ప్రతిబింబించనుందని ఆమె పేర్కొన్నారు.

అమ్రాబాద్ అడవిలో విదేశీ ప్రతినిధుల పర్యటన

పులులు, చిరుతపులుల సంరక్షణ చర్యలపై ప్రధానంగా ఈ కార్యక్రమంలో చర్చించనున్నారు. తెలంగాణలో నిర్వహించనున్న ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ (IBCA)వర్క్‌షాప్ కు ఆరు దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా, అటవీశాఖ మంత్రి కొండా సురేఖలు పాల్గొననున్నారు. ఈ సదస్సు తర్వాత విదేశీ ప్రతినిధులు పులులకు నిలయమైన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పర్యటించనున్నారు.

వన్యప్రాణులపై ఫొటోల ప్రదర్శన

ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ (IBCA)వర్క్‌షాప్ మొదటి రోజు హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర్నర్, మంత్రి కొండా సురేఖ హాజరు కానున్నారు.మొదటగా ఫోటో ప్రదర్శన నిర్వహించి,
తెలంగాణ అటవీ శాఖ చేపడుతున్న వన్యప్రాణి సంరక్షణ చర్యలు,వన్యప్రాణుల వేట నిషేధిత కార్యక్రమాలు, అడవుల పునరుద్ధరణ, వాటి సంరక్షణ వంటి కార్యక్రమాలను ఫోటోల రూపంలో ప్రదర్శించనున్నారు.

వన్యప్రాణుల సంరక్షణపై చర్చ

రెండో రోజు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌కు ఫీల్డ్ విజిట్ నిర్వహించనున్నారు. దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్‌లలో ఒకటైన అమ్రాబాద్‌లో అమలు చేస్తున్న పులుల సంరక్షణ చర్యలు, ఆవాసాల నిర్వహణ విధానాలను విదేశీ ప్రతినిధులు పరిశీలించనున్నారు.ఈ వర్క్‌షాప్‌కు ఫ్రాన్స్, మలేషియా, రష్యా, శ్రీలంక, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, టర్కీ దేశాల ప్రతినిధులతో పాటు హైదరాబాద్‌లోని కాన్సుల్ జనరల్స్, దౌత్యవేత్తలను ఆహ్వానించినట్లు అటవీశాఖ అధికారి ఎ శంకరన్ తెలిపారు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ (IBCA) కార్యక్రమంపై అవగాహన పెంపుతో పాటు వన్యప్రాణి సంరక్షణలో ఉత్తమ విధానాల పరస్పర మార్పిడికి ఈ కార్యక్రమం వేదిక కానుందని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు

ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ (IBCA)వర్క్‌షాప్ వర్క్‌షాప్ ద్వారా వన్యప్రాణి సంరక్షణలో తెలంగాణ చేపడుతున్న చర్యలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించనుంది. ప్రకృతి ఆధారిత అభివృద్ధి, జీవ వైవిధ్య పరిరక్షణ పట్ల రాష్ట్ర ప్రభుత్వ కట్టుబాటును ఈ సదస్సు ప్రతిబింబిస్తుందని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు.
Read More
Next Story