బోర్‌వెల్ నీరు సేఫేనా? హైదరాబాద్‌లో నైట్రేట్, ఫ్లోరైడ్ ముప్పు
x

బోర్‌వెల్ నీరు సేఫేనా? హైదరాబాద్‌లో నైట్రేట్, ఫ్లోరైడ్ ముప్పు

హైదరాబాద్ భూగర్భ జలాలు ఎంత సురక్షితం?


ర‌చ్చ‌ - రాజ‌కీయం @ 5 పి.ఎం.

1) బోర్‌వెల్ నీరు సేఫేనా? హైదరాబాద్‌లో నైట్రేట్, ఫ్లోరైడ్ ముప్పు

2) తెలంగాణ థర్మల్ ప్లాంట్లకు బొగ్గు కొరత.. విదేశీ బొగ్గు ప్రతిపాదన వెనుక లెక్కేంటి?

1) బోర్‌వెల్ నీరు సేఫేనా? హైదరాబాద్‌లో నైట్రేట్, ఫ్లోరైడ్ ముప్పు

హైదరాబాద్‌ నీటి అవసరాల్లో భూగర్భ జలాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఈ భూగర్భ జలాలు ఎంత సురక్షితం? నగరంలో భూగర్భ జలాలపై జరిగిన తాజా అధ్యయనం ఆందోళన కలిగించే వివరాలను బయటపెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సేకరించిన 44 groundwater samples‌ను పరిశీలిస్తే, నైట్రేట్, ఫ్లోరైడ్ స్థాయులు అనేక ప్రాంతాల్లో అనుమతించిన పరిమితులను మించాయి. అంతేకాదు. కొన్ని samplesలో నైట్రేట్ స్థాయి 797 milligrams per litre వరకు నమోదైంది.

ఈ కాలుష్యానికి కారణం ఏంటి?

హైదరాబాద్ భూగర్భ జలాలపై ఈ అధ్యయనాన్ని ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన అచిరాజు పల్లవి, అల్లం ఎడుకొండల్, JNTU హైదరాబాద్‌కు చెందిన లక్ష్మణ్ కుమార్ దువ్వ, CSIR-NGRIకి చెందిన రత్నాకర్ ధకాటే నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని domestic, industrial, irrigation sources నుంచి 44 groundwater samples సేకరించారు. వాటిని Pre-Monsoon, Post-Monsoon అనే రెండు దశల్లో పరీక్షించారు. లక్ష్యం.. భూగర్భ జలాల్లో nitrate, fluoride ఎంత ఉన్నాయి? ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి? అవి నీటిలోకి ఎలా చేరుతున్నాయి? అనే విషయాలను తెలుసుకోవడం. అదే సమయంలో.. ఈ స్థాయులు మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందో కూడా పరిశోధకులు అంచనా వేశారు.

ముందుగా నైట్రేట్ విషయానికి వస్తే.. ఈ అధ్యయనం 45 mg/Lని నైట్రేట్‌కు పరిమితిగా తీసుకుంది. కానీ హైదరాబాద్‌లో సేకరించిన samplesలో.. Pre-Monsoon సమయంలో 36 శాతం, Post-Monsoonలో 40 శాతం samplesలో ఈ పరిమితి దాటిన నైట్రేట్ నమోదైంది. ఇక అత్యధికంగా 797 mg/L వరకు నమోదైంది. అంటే 45 mg/L పరిమితితో పోలిస్తే.. దాదాపు 18 రెట్లు ఎక్కువ. అయితే ఈ స్థాయులు నగరమంతా ఒకేలా లేవు. అధ్యయనం ప్రకారం.. South-Western, Northern, Central Hyderabad ప్రాంతాల్లో నైట్రేట్ స్థాయులు ఎక్కువగా కనిపించాయి. అంటే.. హైదరాబాద్ groundwaterలో నైట్రేట్ సమస్యకు ప్రాంతాల వారీగా కూడా తేడాలు ఉన్నాయి.

అసలు ప్రశ్న.. ఈ నైట్రేట్ ఎక్కడి నుంచి వస్తోంది?

అధ్యయనం ప్రకారం దీనికి ఒక్క కారణం లేదు. నగరాల్లోని మురుగునీరు, సీవేజ్ లీకేజీలు, సెప్టిక్ ట్యాంకుల నుంచి వచ్చే వ్యర్థాలు, ఎరువుల వాడకం వంటి కారణాలు నైట్రేట్ పెరగడానికి కారణమవుతున్నాయి.

సింపుల్‌గా చెప్పాలంటే.. మనం సరిగ్గా నిర్వహించని మురుగునీరు, వ్యర్థాలు భూమిలోకి ఇంకి.. చివరికి భూగర్భ జలాల్లోకి చేరే అవకాశం ఉంది.

ఇక రెండో ముఖ్యమైన అంశం...ఫ్లోరైడ్ విషయానికి వస్తే.. పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది.

అధ్యయనం ప్రకారం ఫ్లోరైడ్‌కు 1 mg/L స్థాయిని ప్రమాణంగా తీసుకున్నారు. ప్రీ-మాన్సూన్‌లో 64 శాతం, పోస్ట్-మాన్సూన్‌లో 59 శాతం శాంపిల్స్‌లో ఈ స్థాయికి మించి ఫ్లోరైడ్ నమోదైంది. అంటే.. నైట్రేట్‌తో పోలిస్తే, ఫ్లోరైడ్ సమస్య ఎక్కువ శాంపిల్స్‌లో కనిపించింది. ఫ్లోరైడ్ concentration విషయానికి వస్తే.. పోస్ట్-మాన్సూన్‌లో ఫ్లోరైడ్ గరిష్ఠంగా 5.94 mg/L వరకు నమోదైంది. అధ్యయనం ప్రకారం North, South, South-West Hyderabad ప్రాంతాల్లో ఫ్లోరైడ్ స్థాయులు ఎక్కువగా కనిపించాయి.

నైట్రేట్ పెరగడంలో మానవ కార్యకలాపాల ప్రభావం ఎక్కువగా ఉంటే, ఫ్లోరైడ్ విషయంలో భూగర్భ శిలల ప్రభావం కూడా కీలకంగా ఉంది. హైదరాబాద్‌లోని గ్రానైట్ శిలలు, వాటిలోని ఖనిజాలు భూగర్భ జలాలతో కలిసినప్పుడు, కొన్ని ఖనిజాలు కరిగి ఫ్లోరైడ్ నీటిలోకి చేరే అవకాశం ఉంది. అంటే.. ఫ్లోరైడ్ సమస్యకు మనుషుల కార్యకలాపాలతో పాటు, హైదరాబాద్ భూగర్భ నిర్మాణం కూడా ఒక కారణం.భూగర్భంలో నీరు ఖాళీ ప్రదేశంలో ఊరికే నిల్వ ఉండదు. అది చుట్టూ ఉన్న రాళ్లు, ఖనిజాలతో నిరంతరం కలుస్తూ ఉంటుంది.

ఈ ప్రక్రియలో కొన్ని ఖనిజాల్లోని పదార్థాలు నీటిలోకి చేరుతాయి. హైదరాబాద్‌లో ఫ్లోరైడ్ పెరగడానికి ఈ రాళ్లు–నీటి మధ్య జరిగే పరస్పర చర్య కూడా ఒక ముఖ్యమైన కారణమని అధ్యయనం చెబుతోంది. అలాగే రాళ్లు క్రమంగా క్షీణించడం, ఖనిజాల మార్పిడి, నీరు ఆవిరైపోవడం వంటి సహజ ప్రక్రియలు కూడా groundwaterలో ఫ్లోరైడ్ స్థాయులను ప్రభావితం చేస్తున్నాయి.

ఈ అధ్యయనంలో మరో కీలకమైన అంశం. పరిశోధకులు Health Risk Assessment కూడా చేశారు.నైట్రేట్, ఫ్లోరైడ్ రెండింటికీ కొన్ని సందర్భాల్లో Hazard Quotient HQ ఒకటి కంటే ఎక్కువగా నమోదైంది.

ముఖ్యంగా, పెద్దలతో పోలిస్తే పిల్లల్లో అంచనా వేసిన ఆరోగ్య ప్రమాదం ఎక్కువగా కనిపించింది. పిల్లల తక్కువ శరీర బరువుతో పోలిస్తే నీటి ద్వారా జరిగే exposure ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణంగా పరిశోధకులు పేర్కొన్నారు. ఈ అధ్యయనం హైదరాబాద్ పిల్లలకు వ్యాధులు వస్తున్నాయని నిరూపించలేదు. నీటిలో ఉన్న నైట్రేట్, ఫ్లోరైడ్ స్థాయులు, వాటికి మనుషులు గురయ్యే అవకాశం వంటి అంశాల ఆధారంగా ఆరోగ్య ప్రమాదాన్ని అంచనా వేసింది. అందుకే దీన్ని వ్యాధుల నిర్ధారణగా కాకుండా.. భవిష్యత్తులో ఉండే ఆరోగ్య ప్రమాదానికి సంబంధించిన అంచనాగా చూడాలి.

ఒక్క విషయం స్పష్టంగా తెలుస్తోంది.. హైదరాబాద్ భూగర్భ జలాల సమస్యకు ఒకే కారణం లేదు. ఒకవైపు సీవేజ్, సెప్టిక్ ట్యాంకులు, మురుగునీరు, వేగంగా పెరుగుతున్న నగరీకరణ ప్రభావం ఉంది.

మరోవైపు రాళ్లు, ఖనిజాలు, భూగర్భ జలాలు–శిలల మధ్య జరిగే సహజ ప్రక్రియలు కూడా ప్రభావం చూపుతున్నాయి. అంటే.. హైదరాబాద్ భూగర్భ జలాల నాణ్యతను మన చర్యలతో పాటు.. ఈ ప్రాంత సహజ భౌగోళిక పరిస్థితులు కూడా నిర్ణయిస్తున్నాయి.

పరిశోధకుల సూచనల ప్రకారం.. గ్రౌండ్‌వాటర్‌ను క్రమం తప్పకుండా పరీక్షించడం, ప్రాంతాల వారీగా నాణ్యతను పర్యవేక్షించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక బోర్‌వెల్ నీరు సురక్షితంగా ఉందని.. అదే ప్రాంతంలోని మరో బోర్‌వెల్ నీరు కూడా సురక్షితమే అని చెప్పలేం. అందుకే రెగ్యులర్ వాటర్ టెస్టింగ్, సీవేజ్ లీకేజీల నియంత్రణ, సెప్టిక్ ట్యాంకుల పర్యవేక్షణ, భూగర్భ జలాల సమర్థవంతమైన నిర్వహణపై దృష్టి పెట్టాలి.

భూగర్భ జలం.. కంటికి కనిపించదు. కానీ నగరానికి కనిపించని మరో నీటి వ్యవస్థ అది. ఇళ్లలోని బోర్‌వెల్స్ నుంచి.. అపార్ట్‌మెంట్ల వరకు.. చిన్న పరిశ్రమల నుంచి వ్యవసాయ అవసరాల వరకు.. ఎంతోమంది ఈ నీటిపైనే ఆధారపడుతున్నారు. అందుకే తాజా అధ్యయనం చెబుతున్న సందేశం ఒక్కటే. నీరు కనిపించకపోయినా.. దాని నాణ్యతను మాత్రం ఎప్పటికప్పుడు పరీక్షించాలి. ఎందుకంటే.. భూగర్భంలో ఉన్న నీటి భవిష్యత్తు.. భూమిపై మనం చేసే పనులపైనే ఆధారపడి ఉండొచ్చు.


2) తెలంగాణ థర్మల్ ప్లాంట్లకు బొగ్గు కొరత.. విదేశీ బొగ్గు ప్రతిపాదన వెనుక లెక్కేంటి?

జెన్‌కో ప్లాంట్లకు రోజుకు సుమారు 80 వేల టన్నుల బొగ్గు అవసరం. నిబంధనల ప్రకారం కనీసం 21 రోజులకు సరిపడా నిల్వలు ఉండాలి. అంటే 16 లక్షల టన్నులకు పైగా బొగ్గు అందుబాటులో ఉండాలి. కానీ ప్రస్తుతం కొన్ని ప్లాంట్లలో కొన్ని రోజులకే సరిపడా నిల్వలు ఉన్నాయని జెన్‌కో వర్గాలు చెబుతున్నాయి. దీంతో బొగ్గు సరఫరాపై ఆందోళన పెరిగింది.

సింగరేణి నుంచి సరఫరా అవుతున్న బొగ్గు విషయంలో భారీ బకాయిలు సమస్యగా మారాయి. మరోవైపు.. నైనీ కోల్ బ్లాక్, కోల్ ఇండియా పరిధిలోని మహానది కోల్‌ఫీల్డ్స్ నుంచి బొగ్గు తీసుకురావడంపై మరింత దృష్టి పెట్టాల్సి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో అవసరమైతే ఆస్ట్రేలియా, ఇండోనేసియా నుంచి 50 లక్షల టన్నుల విదేశీ బొగ్గు తెప్పించే ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు జెన్‌కో వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఇక్కడే ఖర్చు అంశం కీలకంగా మారింది. సింగరేణి బొగ్గు టన్నుకు సుమారు రూ.3,800, మహానది నుంచి తీసుకున్నా రూ.4,200 లోపే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అదే విదేశీ బొగ్గు టన్నుకు రూ.10 వేలకుపైగా ఖర్చయ్యే అవకాశం ఉందని జెన్‌కో వర్గాలు అంటున్నాయి.

50 లక్షల టన్నులు దిగుమతి చేస్తే.. బొగ్గు ధరలోనే దాదాపు రూ.3 వేల కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉందన్నది వారి వాదన. రవాణా ఖర్చులు దీనికి అదనం.

ఇక విదేశీ బొగ్గు నాణ్యత, వినియోగంపై కూడా జెన్‌కో ఇంజనీర్లలో అభ్యంతరాలు ఉన్నట్లు సమాచారం. గతంలో విదేశీ బొగ్గు వినియోగంపై సంస్థలో కొన్ని సమస్యలు గుర్తించినట్లు వర్గాలు చెబుతున్నాయి.

అయితే ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం విదేశీ బొగ్గు కొనుగోలుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతోంది. నైనీ కోల్ బ్లాక్ నుంచి సరఫరా పెంచడంతో పాటు.. కోల్ ఇండియాతో సంప్రదింపులు జరుపుతున్నామని స్పష్టం చేసింది.అంటే.. అసలు ప్రశ్న ఇప్పుడు ఒక్కటే. బొగ్గు కొరతను స్వదేశీ వనరులతో అధిగమిస్తారా? లేక విదేశీ బొగ్గు వైపు వెళ్తారా?

Read More
Next Story