
హైడ్రా హద్దుమీరి హైదరాబాద్ కు హాని చేస్తున్నదా?
చెరువుల సంరక్షణ పట్టని తెలంగాణ అధికారులు
హైడ్రా ((Hyderabad Disaster Response and Asset Protection Agency) తన పరిధి దాటి వ్యవహరిస్తూ చెరువుల సంరక్షణ కాకుండా వాటికి హాని చేస్తోంది. బం రుక్న్ ఉద్ దౌలా చెరువును కాపాడే పేరుతో దాని పరిధి 18 ఎకరాల నుంచి 10 ఎకరాలకు తగ్గించి దాని పై కేసు కోర్టులో ఉండగా మిగిలిన ఎనిమిది ఎకరాలలో పిల్లల పార్కు హైడ్రా కడుతోంది అలాగే మీర్ ఆలం చెరువు మధ్యలో నుండి బ్రిడ్జ్ కడుతున్నారు. ఇది చెరువుల పరిరక్షణా. ఆ సంస్థ పై అధికారిక పర్యవేక్షణకు అవకాశం వుండాలని నిపుణులు అంటున్నారు.
హైదరాబాద్ మహానగరంలో గుర్తించబడిన 185 చెరువులలో నీటి నాణ్యత నిర్ణీత ప్రమాణాల కంటే అధ్వాన్నంగా వుందని తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు (Telangana Pollution Control Board) వెల్లడించింది. ఈ నీటి వనరులలో ఆక్సిజన్ ((Dissolved Oxygen) శాతం తక్కువగా వుందని, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (BOD) విషపూరిత లోహాలు (Heavy metals) అధికంగా వున్నాయని, ఇది జీవావరణ ఆరోగ్యానికి హానికరమని బోర్డు సేకరించిన తాజా డాటా స్పష్టం చేస్తోంది. నీటిలో కరిగిన ఆక్సిజన్ శాతం , విషపూరిత లోహాల శాతం అనేవి నీటి ప్రామాణికత బేరీజు వేయటానికి వాడే ముఖ్యమైన సూచికలు. 185 చెరువులలో యిప్పటికే 23 ఎండిపోయాయి.
హైదరాబాద్ అంటేనే లేక్ సిటి. అయితే, ఈ సరస్సులను కాపాడుకోవడంలో తొలి నుంచి ప్రభుత్వాలన్నీ విఫలమవుతూ వచ్చాయి. దీని ఫలితమే ఇపుడు జలజీవాలు బతికేందుకు వీలులేనంతగా ఈ సరస్సులు పాడయ్యాయి. ఉదాహరణకు నగరంతలో బాగా పేరున్న మీర్ అలం ట్యాంక్ (Mir Alam Tank), అల్వాల్ లోని కొత్త చెరువు (Kotha Cheruvu of Alwal) ఖాజాగూడులోని పెద్ద చెరువు (Pedda Cheruvu of Khajaguda), కాముని చెరువు (Kamuni Cheruvu), బంజారా చెరువు (Banjara Cheruvu) లలో ఆక్సిజన్ శాతం పూర్తి గా పడిపోయింది. నగరానికి వన్నెతెచ్చే హుసేన్ సాగర్ (Hussain Sagar), దుర్గం చెరువు (Durgam Cheruvu) లో ఆక్సిజన్ (DO) స్థాయి లీటర్ కు 1.1 నుంచి 2.7 మిల్లీ గ్రాముల స్థాయికి పడిపోయింది.
వీటిలో కాడ్మియం, ఇనుము, పాదరసం, జింక్, రాగి, సీసం, నికెల్, క్రోమియం లాంటి భార లోహాలు వున్నాయని రిపోర్ట్ తెలిపింది. వీటి వలన దీర్ఘకాలంలో ప్రజల ఆరోగ్యానికి, భూగర్భ జలాల నాణ్యతకు హానికరమని హెచ్చరించింది.
దీనికి కారణమేమిటి?
చెరువు భూములను పూర్తిగా ఆక్రమించి నిర్మాణాలను చేపట్టడం, పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధి చేయకుండా చెరువుల్లోకి వదలడం, నగరం మురికినంతా వీటిలోకి మళ్లించడం దీనికి ప్రధాన కారణమని పర్యావరణ వేత్తలు, పట్టణ జలవనరుల నిర్వహణ (Urban Hydrology) నిపుణులు చెబుతున్నారు. మరొక ప్రధానమైన కారణం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ లో హైడ్రాలజీ నిపుణులు లేదా లైఫ్ సైన్సెస్ నిపుణులు (Limnologists) లేకపోవడం.
పర్యావరణవేత్త, విధాన విశ్లేషకులు దొంతి నర్సింహారెడ్డి మట్లాడుతూ ప్రస్తుత అర్బన్ ప్లానింగ్ మురుగు నీటి వ్యవస్థకు అంత ప్రాముఖ్యం లేదని అన్నారు. "బిల్డింగ్ లకు, లేఔట్ లకు అనుమతులు జారీ చేస్తున్నపుడే మురుగు నీటి వ్యవస్థను గురించి ఆలోచించి ప్రణాళికలు రచించి అమలు చేయాలి. మురుగునీరు శుద్ధి చేయటానికి ప్లాంట్లు వెంటనే ఏర్పాటు చేయాలి. అయితే వాటి నిర్మాణానికి స్థలం లేక చెరువు లలో కట్టే ప్రయత్నం చేశారు. మురుగునీరు పోయే వ్యవస్థ లేదు కాబట్టి ఆ నీరు చెరువులలోకి మళ్లిస్తున్నారని. దీనితో సరస్సులలోని నీరు కలుషితం అవుతున్నది,” అని ఆయన అన్నారు.
ఈ మురుగునీరు శుద్ధి ప్లాంట్లు నిర్మాణంలో వున్న ఇళ్ళకు తగినట్టు వుండాలని వాటి నిర్మాణం కోసం ప్రభుత్వం భూమిని కేటాయించాలని ఆయన చెప్పారు. నీటిని శుద్ధి చేసిన తర్వాత చెరువుల్లోకి నదుల్లోకి వదలాలని అందుకు ఆ ప్రాంతానికి తగిన ప్రణాళికను నిర్మాణలకు అనుమతి ఇస్తున్నపుడే అధికారులు సిద్ధం చేసుకోవాలని ప్రొ. నరసింహారెడ్డి అన్నారు.
చెరువులో ఆక్సిజన్ శాతం ఒక లీటర్ నీటిలో 5 మి.గ్రా వుండాలని పర్యావరణ, అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నిర్దేశిస్తుంది. అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డాటా ప్రకారం ప్రాణ వాయువు కేవలం 0.3 మీ. గా మాత్రమే వుంది. ఫలితంగా జీవజాల మనుగడకు ఏ మాత్రం హైదరాబాద్ సరస్సులు అనుకూలంగా లేవు.
కాంగ్రెస్ నాయకురాలు, పర్యవారణ యాక్టివిస్టు డాక్టర్ లుబ్నా సర్వత్ మాట్లాడుతూ చెరువులను నగరంలో కుదించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీని వల్ల నగరంలో వరదలు వస్తున్నాయని అంటూ ఏ ప్రాతిపదిక మీద చెరువులను కుదిస్తారని ఆమె ప్రశ్నించారు.
" నాగార్జున సర్కిల్ లో వున్న జలగం వెంగళ రావు పార్క్ ఒక పెద్ద చెరువు. కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ (కెబిఆర్) పార్కులో కూడా చెరువుంది. దాని పరిధి కుదించటంతో వర్షాలు పడినపుడల్లా నీరు చెరువుల్లోకి వెళ్ల లేక పంజగుట్ట, రాజ్ భవన్ ప్రాంతాలను వరదలతో ముంచెత్తుతూ ఉంది. పబ్లిక్ గార్డెన్స్ లో ఉండిన ఒక పెద్ద చెరువు హుస్సేన్ సాగర్ కు అనుసంధానంగా వుండేది. గచ్చిబౌలి హైవే మీద వుండే బ్రహ్మం కుంట ఒక పెద్ద చెరువు అందులో హోండా కంపెనీ షోరూం వెలసింది. ఇది ఎలా సాధ్యం. ఇపుడిది కోర్టులో వుంది. యిలాంటివి చెరువుల లెక్కల లోనుండి తీసివేశారు," అని డాక్టర్ లూబ్నా అన్నారు. హైదరాబాద్ లో 185 చెరువులనే ఉన్నాయనడం తప్పు, చాలా చెరువులను లెక్కల నుంచి తీసేశారని ఆమె చెప్పారు.
హైడ్రా తన పరిమితులను అతిక్రమించడం వల్ల కూడా చెరువులకు హాని జరుగుతూ ఉందని డాక్టర్ లూబ్నా ఆరోపించారు.
"బం రుక్న్ ఉద్ దౌలా చెరువు విస్తీర్ణం 18 ఎకరాలు అయితే దాన్ని 10 ఎకరాలకు పరిమితం చేసి మిగిలిన ప్రాంతంలో హైడ్రా పిల్లల పార్కు కడుతోంది. చెరువు కట్టను తొలగించి రోడ్డు వేశారు. ఈ చెరువు పక్కన వున్న పార్కులు ఆక్రమణకు గురి అయ్యి కంప్లయింట్ ఒక సంవత్సరం కాలంగా ఉన్నా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. హైడ్రా పెట్టింది వారసత్వ సంపద అయిన చెరువులను కాపాడటానికి. చెరువులు ఆక్రమించి పార్కులు కట్టడానికి కాదు. దుర్గం చెరువు ను ఆక్రమించారని బిఆర్ఎస్ ఎంఎల్ఏ పైన కేసు పెట్టారు. హైడ్రా ఈ చెరువులో పార్క్ నిర్మించినందుకు ఎవరి పైన కేసు పెట్టాలి," అని ఆమె ప్రశ్నించారు. ఈ పనికి హైడ్రా చీఫ్ రంగనాథ్ ను ఆ భాద్యత నుండి తొలగించాలని ఆమె అన్నారు.
తన పరిధి మించి హైడ్రా ఎలా పని చేస్తున్నదో లూబ్నా వివరించారు.
"మీర్ ఆలం చెరువు ను పూడ్చి బ్రిడ్జ్ కడుతున్నారు. యిది ఆ చెరువును నాశనం చేస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ, ఇరిగేషన్, రెవెన్యూ వ్యవస్థలు చెరువులను పరిరక్షించలేకపోతున్నాయని ‘హైడ్రా’ ని ఏర్పాటు చేశారు. ఇపుడేమో ఈ సంస్థ తన యిష్టాను సారం వ్యవహరిస్తోంది. దాని చర్యలపైన ఎటువంటి పర్యవేక్షక వ్యవస్థ లేదు," అని వాఖ్యానించారు. చెరువులు పర్యావరణ వైవిధ్యం కాపాడటానికి, పక్షులు, మనుషులు ఆహ్లాదంగా కాసేపు గడపటానికి ఉపయోగపడాలి.కాని ప్రభుత్వ లెక్కల ప్రకారమే హైదరాబాద్ చెరువులు మనుషులకే కాదు, పక్షలకు, జలచరాలకు కూడా ఉపయోగపడేలా లేవని ఆమె అన్నారు.
మునిసిపాలిటీలలోని ఇంజనీర్లకు అర్బన్ హైడ్రాలజీ మీద ఆవగాహన లేనందునే చెరువుల సంరక్షణ విఫలమవుతున్నదని పర్యావరణ నిపుణుడు, అర్బన్ హైడ్రాలజీ నిపుణుడు, సరస్సుల నిఫుణుడు ప్రొఫెసర్ బివి సుబ్బారావు అన్నారు.
హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ లో సరస్సు అంటే ఏమిటి, దానిని ఎలా నిర్వహించాలి అనే విషయాలు తెలిసిన వాళ్లెవరూ లేకపోవడం అసలు సమస్య అని అయన అన్నారు. సరస్సు అంటే అదొక నీటి గుంట అనే అభిప్రాయం తప్ప పర్యావరణ, జీవావరణ వ్యవస్థ అనే స్పృహ ఎవ్వరిలో లేకపోవడం శోచనీయమని ప్రొ. సుబ్బారావు అన్నారు. ఈ కారణంగా గత 50 సంవత్సరాలుగా స్వేచ్చగా మురుగునీటిని, ఇండస్ట్రియల్ వేస్టుని చెరువుల్లో నింపారు. ఆక్రమణలను అనుమతించారు. చెరువుల్లోకి నీళ్లను తెచ్చే వ్యవస్థలన్నింటిని పూడ్చేశారు. ఇపుడేమో చెరువు నీళ్లలో ఆక్సిజన్ తగ్గింది, విషలోహాలు పెరిగాయి, బయోకమికల్ డిమాండ్ పెరిగిందని గగ్గోలు పెడితే ప్రయోజనం ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు.
ముంబై, రూర్కీ ఐఐటి లలో అర్బన్ హైడ్రాలజీ కోర్సులలో మునిసిపాలిటీ ఇంజనీర్లకు శిక్షణ ఇప్పించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. "రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రెటరీ ఆధ్వర్యంలో ఒక సంస్థను ఏర్పాటు చేసి చెరువులను కాపాడాలి," అని సుబ్బారావు అభిప్రాయాన్నిపడ్డారు.
చెరువును కాపాడం హైడ్రా కు ఎందుకు సాధ్యం కాదో ప్రొ. సుబ్బారావు వివరించారు. “హెచ్ఎండీఏ ప్రణాళికలను తయారు చేసి దశ దిశ యిచ్చే వ్యవస్థ. జీహెచ్ఎంసీ వాటిని అమలు చేయాలి. అయితే జీహెచ్ఎంసీ ఆదాయం సమకూర్చే వ్యవస్థ కావటంతో దానికి నేతృత్వం వహించే అధికారి కంటే హెచ్ఎండీఏ అధికారి చిన్న స్థాయి వారు వుంటున్నారు. చెరువుల పైన రెవెన్యూ డిపార్ట్మెంట్ దే పెత్తనం. డాక్యుమెంట్లు ఇరిగేషన్ వాళ్ళ దగ్గర వుంటాయి. చెరువుల హద్దులు నిర్ణయం కాకుండా వాటిని ఎలా కాపాడగలుగుతారు. చెరువు స్థలాన్ని కబ్జా చేసినా అది సివిల్ వివాదం అయ్యి కోర్టుకు పోతుంది. వీటి మద్దతు లేకుండా హైడ్రా ఎలా పనిచేయగలదు,” అని ప్రొ. సుబ్బారావు అన్నారు.
నిజాం కాలంలోనే చెరువులకు సంబంధించిన వివరాలను మొత్తం రాసి వుంచిన విషయాన్ని గుర్తు చేస్తూ వాటిని ఇంగ్షీషు లోకి కూడా తర్జుమా చేశారని. ఆ రికార్డు లో ముఖ్యమైన భాగం యిటీవల రికార్డులో నుండి దొంగలించబడ్డాయని సుబ్బారావు చెప్పారు. “దొంగలించిన వాడికి పర్షియన్ భాష తెలిసి వాటిగురించి పూర్తి అవగాహన వుండాలి. వాటి దొంగతనంపై పరిశోధన ఎంతవరకు వచ్చిందో ఎవరికి తెలీదు,” అని ఆయన అన్నారు.
1970 ల వరకు వర్షం నీరు కోసం పైప్ లైన్ లు వేశారు. అయితే హై టెక్ సిటీ, గచ్చిబౌలి, గోపనపల్లి, నానకరామ్ గూడ, జూబ్లీ హీల్స్, మాధాపూర్ లాంటి కొత్తగా అభివృద్ది అయిన ప్రాంతాల్లో వేయటం ఆపేశారని ఆయన అన్నారు.


