అన్నమే విషంగా మారుతోందా ?
మనం తింటున్న అన్నంలో ఆర్సెనిక్ అనే ప్రమాదకర రశాయనం మోతాదుకు మించి ఉంటోందని డబ్ల్యూహెచ్వో జాయింట్ ఎక్స్ పర్ట్ కమిటి అధ్యయనంలో తేలింది
నమ్మటానికి కష్టంగానే ఉన్నా నిజమని అంగీకరించక తప్పదు. ఎందుకంటే ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్యం సంస్ధ స్వయంగా ప్రకటించింది కాబట్టి. విషయం ఏమిటంటే ప్రతిరోజు మనం తింటున్న అన్నంలో ఆర్సెనిక్ అనే ప్రమాదకర రశాయనం మోతాదుకు మించి ఉంటోందని డబ్ల్యూహెచ్వో జాయింట్ ఎక్స్ పర్ట్ కమిటి అధ్యయనంలో తేలింది. అన్నంలో ఆర్సెనిక్ ఎలా చేరుతోంది ? ఎలాగంటే బియ్యం ద్వారా.
మనం తింటున్న బియ్యం, కూరగాయలు, పండ్లలో మొతాదుకు మించి పెస్టిసైడ్లు ఉంటున్నాయని చాలాకాలంగా వింటున్నదే. అందుకనే ఆర్గానిక్ ఫుడ్ అనే కాన్సెప్ట్ పెరుగుతోంది. ఈ నేపధ్యంలోనే మనదగ్గర పండుతున్న బియ్యంలో ఆర్సెనిక్ రశాయనం మోతాదుకు మించి ఉందని డబ్వ్యూహెచ్వో పరిశోధనలో తేలింది. ప్రపంచంలోని కొన్ని ప్రముఖ నగరాల్లో ఆరోగ్యం సంస్ధ తరపున జాయింట్ ఎక్స్ పర్ట్ కమిటి పరిశోధన చేసింది.
మనదేశంలోని కలకత్తాను తన పరిశోధనకు కేంద్రంగా ఎంచుకున్నది. ఆ పరిశోధనలోనే దేశంలోని వివిధ ప్రాంతాల్లో పండుతున్న బియ్యం, కూరగాయలు, చేపలతో పాటు మరికొన్ని ఆహారా ధాన్యాలను కూడా పరిశోధన బృందం సేకరించింది. ఆ అధ్యయనంలో బియ్యంలో ఆర్సనిక్ మోతాదు పరిమితికి మంచి ఉన్నట్లు తేలింది. మనిషి శరీరంలో 0.3 మైక్రోగ్రాములు ఆర్సెనిక్ ఉంటుంది. నిజానికి ఇది కూడా అనారోగ్యానికి దారితీస్తుంది.
మనంతినే చాలా ఆహారాల్లో కెమికల్స్ ఉంటున్నాయి కాబట్టి మనశరీరంలో 0.3 మైక్రోగ్రాములు తప్పదు. అయితే తాజా అధ్యయనంలో బియ్యంలో ఆర్సెనిక్ 1.12 మైక్రోగ్రాములున్నట్లు తేలింది. అంటే అదే బియ్యాన్ని మనం తింటున్నాము కాబట్టి అంతే స్ధాయిలో ఆర్సెనిక్ రశాయనం మన శరీరంలోకి ప్రవేశిస్తోంది. ఈ ఆర్సెనిక్ గుండె, ఊపితిత్తులు, కిడ్నీల దీర్ఘకాలిక అనారోగ్యాలకు కారణమవుతోందని పరిశోధన బృందం అధ్యయనంలో బయటపడింది.
ఇదే విషయమై వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ జీవీ రామాంజనేయులు తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘ భూములో నిల్వ వున్న నీటి కారణంగా పంటల్లో ఆర్సెనిక్ రశాయనాలు ఎక్కువ అవుతున్నాయి’’ అని చెప్పారు. ‘‘భూమిలో సహజనంగానే నిల్వ ఉన్న నీటిలో అనేక రశాయనాలు ఉంటాయి’’ అని తెలిపారు. ‘‘వందలు, వేలాది అడుగుల్లోతులోకి బోర్లను తవ్వేయటం వల్ల నీరు కలుషితమైపోయి ఆర్సెనిక్ రశాయనాలు కలిసిన నీరు బయటకు వచ్చేస్తోంది’’ అని వివరించారు. ‘‘ఆర్సెనిక్ రశాయనాలు కలిసిన నీటితో పండిన పంటల్లో ముఖ్యంగా వరిలో తప్పనిసరిగా విషపూరితమైన రశాయనం ఉంటుంది అనటంలో సందేహంలేదు’’ అని స్పష్టంచేశారు.
‘‘ఆర్సెనిక్ రశాయనంతో పంటలు పండించటానికారణం నీటి కాలుష్యం, పారిశ్రామిక వ్యర్ధాలు ఎక్కువగా బయటకు వచ్చేయటం, చెరువులు, కుంటలు కూడా కలుషితం అయిపోవటమే ప్రధాన కారణం’’ అని చెప్పారు. ‘‘విషతుల్యమైన రశాయనాన్ని అన్నం, ఇతర వంటల రూపంలో తీసుకోవటం వల్ల గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీల మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది’’ అని ఆందోళన వ్యక్తంచేశారు.

