
రామమందిరమే ఇప్పుడు బీజేపీని భయపెడుతుందా?
‘చందా చోర్’ అంటూ ఆరోపణలు చేస్తున్న ఎస్పీ, యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పట్టు కోసం ప్రయత్నం
ఉత్తరప్రదేశ్‌లో ఒకప్పుడు బీజేపీకి ఓట్ల వర్షం కురిపించిన రామమందిరం అంశమే ఇప్పుడు ఆ పార్టీకి రాజకీయ ఇబ్బందిగా మారుతోందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పండితులు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో అంటే 2027 లో దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇంతకుముందు ఎన్నికలలో బీజేపీ ప్రధానంగా రామ మందిర నిర్మాణంపైనే ప్రధానంగా దృష్టి పెట్టి ప్రచారం చేసుకునేది. కానీ ఇప్పుడు కమలదళం ఆ అంశాన్ని ప్రచారం చేసుకునేందుకు జంకుతోంది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్య ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో ఓటమి, తాజాగా రామమందిర విరాళాల చోరీ ఆరోపణలు పార్టీకి సవాలుగా మారాయి. ప్రతిపక్షం ముఖ్యమంత్రిగా చందా చోరీ అంటూ బీజేపీపై ఆరోపణలు గుప్పిస్తోంది. ఇప్పటికే సీఎం యోగీ ఆదిత్యనాథ్ సహ ఇతర కీలక నాయకుల ప్రసంగాల నుంచి రామమందిర నిర్మాణ అంశం మాయమైంది.
ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు సమాజ్‌వాదీ పార్టీ ప్రయత్నిస్తోంది. బీజేపీ రాజకీయ ప్రస్థానంలో రామమందిరం 1980లలో రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నిస్తున్న బీజేపీకి రామమందిర ఉద్యమం కీలక మలుపుగా మారింది.
1989లో పాలంపూర్ తీర్మానం ద్వారా అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మద్దతు ప్రకటించిన పార్టీ, అదే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో 85 స్థానాలు గెలుచుకుంది. 1990లో ఎల్కే అద్వానీ సోమనాథ్ నుంచి అయోధ్య వరకూ చేపట్టిన రథయాత్రతో ఈ ఉద్యమం మరింత విస్తరించింది. అప్పటి వరకూ కేవలం రెండు సీట్లకు పరిమితమైన బీజేపీ తన ప్రభావాన్ని క్రమంగా విస్తరించుకుంది. హిందుత్వ రాజకీయాలు బీజేపీ ఎన్నికల వ్యూహంలో కీలకంగా మారాయి.
2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలో రామమందిర నిర్మాణ హామీకి అభివృద్ధి నినాదాన్ని జోడించి పార్టీ ప్రచారం నిర్వహించింది. 2019 ఎన్నికల్లోనూ జాతీయవాదం, దేశభక్తితో పాటు ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. దీంతో 2014లో 282గా ఉన్న బీజేపీ లోక్‌సభ స్థానాలు 2019లో 303కు పెరిగాయి.
2024 ఎన్నికల్లో ఎదురుదెబ్బ
2024 జనవరిలో అయోధ్య రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 400కు పైగా స్థానాలు సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఆశించిన ఫలితాలు దక్కకపోగా, ఉత్తరప్రదేశ్‌లో రెండో స్థానానికి పరిమితమైంది. రామమందిరం ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలోనూ ఓటమి ఎదురైంది.
అయోధ్యలో భారీ నిర్మాణ పనులు, రహదారుల విస్తరణ, దుకాణాల తొలగింపు, భూసేకరణ వంటి పరిణామాలతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పర్యాటకులు, బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వారి సంఖ్య పెరగడంతో స్థానిక మౌలిక సదుపాయాలపై ఒత్తిడి పెరిగిందని పేర్కొంటున్నారు.
అభివృద్ధి పనుల వల్ల స్థానికులు తమ భూములను కోల్పోవడం, జీవన పరిస్థితులు మారడం వంటి అంశాలు అసంతృప్తికి కారణమయ్యాయని విశ్లేషిస్తున్నారు. విరాళాల చోరీ ఆరోపణలతో మరింత ఇబ్బంది
రామమందిరం విరాళాల పెట్టెల నుంచి డబ్బు చోరీ జరిగినట్లు వచ్చిన ఆరోపణలు బీజేపీకి మరో సమస్యగా మారాయి. ఈ వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో పలు చోరీ ఘటనలు, పర్యవేక్షణలో లోపాలు వెలుగులోకి వచ్చినట్లు కథనం పేర్కొంది.
2020లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రామమందిర ట్రస్టుపైనా ఈ వివాదం ప్రభావం చూపింది. ట్రస్టులోని పలువురు ప్రముఖులు ప్రధాని మోదీకి సన్నిహితులుగా గుర్తింపు పొందిన నేపథ్యంలో, ఈ వ్యవహారంపై ఆయన మౌనం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది.
ఈ పరిణామాలు హిందూ విశ్వాసాలకు భంగం కలిగించాయని ఉత్తరప్రదేశ్‌లోని కొందరు బ్రాహ్మణ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు కథనం తెలిపింది. ముఖ్యంగా బ్రాహ్మణ ఓటర్లు బీజేపీపై ఆగ్రహంతో ఉన్నారనే అభిప్రాయాలు పార్టీకి ఆందోళన కలిగిస్తున్నాయి.
ఇతర మతపరమైన అంశాలపై బీజేపీ దృష్టి?
రామమందిరం అంశంపై విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో, మథురలో కృష్ణ జన్మభూమి వివాదం, వారణాసిలో జ్ఞానవాపి వివాదం, సంభాల్‌లో షాహీ ఈద్గా మసీదు వివాదం వంటి అంశాలను బీజేపీ ముందుకు తెచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ అంశాలను ప్రస్తావించడం వల్ల రామమందిర విరాళాల వ్యవహారం మళ్లీ చర్చకు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
మరోవైపు, 2027 ఎన్నికల్లో బీజేపీ పాలన, అభివృద్ధి అంశాలతో పాటు మతపరమైన రాజకీయాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉందని విశ్లేషణలు సూచిస్తున్నాయి. ప్రతిపక్షాలు మాత్రం రామమందిర వివాదానికే పరిమితం కాకుండా, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత వంటి అంశాలపైనా దృష్టి పెట్టాలని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
మొత్తంగా, బీజేపీ రాజకీయ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన రామమందిరం అంశం ఇప్పుడు ఆ పార్టీకి కొత్త సవాళ్లు సృష్టిస్తోంది. 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పరిణామాలు ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
Next Story

