
చెత్త డంపింగ్ యార్డ్స్ ని ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
మీథేన్ వాయువు విడుదలలో ప్రపంచంలో నాలుగవ స్థానాన్ని ఆక్రమించిన యార్డు
రాష్ట్రంలో డంపింగ్ యార్డుల ఏర్పాటు వివాదాస్పదం అవుతున్నాయి. హుజురాబాద్ నియోజకవర్గం సిరసపల్లిలో డంపింగ్ యార్డు పై వ్యక్తం అయిన నిరసన నేపధ్యంలో వీటి ఏర్పాటు నిర్వహణ వీటిపై మరోసారి చర్చకు దారి తీసింది. డంపింగ్ యార్డ్ లను తమ ప్రాంతాలలో ఏర్పాటుచేసేందుకు ప్రజలు అంగీకరించడం లేదు. గ్రేటర్ హైదరాబాద్ కోసం ఏర్పాటు చేసిన జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వల్ల అక్కడి ప్రజలు రెండు దశాబ్దాలు నానాయాతన పడ్డారు. ఈ ప్రాంతమంతా కలుషితమయింది. జవహర్ నగర్ మునిసిపాలిటీ ఒక పర్యావరణ విపత్తుగా మారింది. ఇది జాతీయ వార్త అయిపోయింది. చివరకు ఈ డంపింగ్ యార్డులను ఇక్కడి నుంచి తరలించాలని ప్రజలు ఆందోళనచేశారు. చివరకు వివాదం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) దాకా వెళ్లింది. యార్డు ను తరలించాలని NGT ఆదేశించింది. మునిసిపాలిటీల నుంచి వచ్చే వ్యర్థాల సమస్యను పరిష్కరించాలో తెలియక జవహర్ నగర్ పడేసి జిహెచ్ ఎంసి చేతులు దులిపేసుకుంది. చివరకు ఈ వర్థాలు జవహర్ నగర్ చుట్టూ విషపుకొండల్లా చుట్టుముట్టాయి.
సర్వత్రా నిరసన
ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు హుజురాబాద్, జమ్మికుంట, కేశపట్నం, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, సైదాపూర్ వంటి 9 మండలాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆందోళన వ్యక్తం అయ్యింది. ఈ యార్డు కోసం 500 ఎకరాలు సేకరించడం పై ప్రజల నుండి వ్యతిరేకత వచ్చింది. దాని ఏర్పాటు వలన రైతులు భూములు కోల్పోవడమే కాక పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు పడిపోతాయనే ఆందోళన వ్యక్తం అయ్యింది. దాని ఏర్పాటును అడ్డుకుంటామని రాజకీయ పార్టీలు జేఏసీ ఏర్పాటు చేసి నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. జవహర్ అనుభవం కళ్ల ముందు ఉండటంతో తమ ప్రాంతంలో డంప్ యార్డ్ లను ఏర్పాటుచేసేందుకు హుజురాబాద్, జమ్మికుంట, కేశపట్నం, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, సైదాపూర్ ‘మా దగ్గర వద్దు ’ అంటున్నారు.
ఆమధ్య వరంగల్ లోని మడికొండ లో నిర్మాణం చేయాలనుకుంటే అక్కడి ప్రజలు ఉద్యమం చేయడం తో అక్కడి నుంచి బయటకు తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తారు. కరీంనగర్ డంపింగ్ యార్డు నిర్మాణానికి ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీనిని పోగొట్టేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్,వరంగల్ జిల్లాల సరిహద్దు మధ్యలో హుజూరాబాద్ వద్ద నిర్మాణం చేపడతామని స్పష్టంగా వారికి హామీ ఇచ్చాడు. ఇపుడు దీనికి వ్యతిరేకత వస్తున్నది. ఇక్కడ వ్యతిరేకంగా లేచింది. ఈ ప్రతిపాదనను నిరసిస్తూ హుజూరాబాద్ పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు సోమవారం జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు.
కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి వచ్చే చెత్త ను పడేసేందుకు హుజూరాబాద్ లోని సిరసపల్లి శివారులో డంపింగ్ యార్డు నిర్మించాలనుకుంటున్నారని, దీని వల్ల నష్టం లేదని చెప్పేందుకు విద్యుత్ ఉత్పత్తికి ప్రతిపాదనలు చేశారని ప్రజలు అనుమానిస్తున్నారు.
జవహర్ నగర్ యార్డు సమస్యలు:
హైదరాబాద్ లోని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ దేశంలోని ఇతర యార్డుల అనుభవాల నేపథ్యంలోనే ఈ వ్యతిరేకత వ్యక్తం అవుతోంది అనటంలో సందేహం లేదు. ఈ యార్డు విడుదల చేస్తున్న కాలుష్య ప్రభావం ఇటీవల కాలిఫోర్నియా యూనివర్సిటీ విడుదల చేసిన రిపోర్ట్ దిగ్బ్రాంతి కలిగించే విషయాలను బయట పెట్టింది.
ప్రపంచంలోనే అతి యెక్కువ మీథేన్ విడుదల చేసే యార్డులలో ఈ యార్డు నాలుగవ స్థానాన్ని ఆక్రమించింది. అది ప్రతి గంటకు 5.9 టన్నుల మీథేన్ వాయువును విడుదల చేస్తోంది. దేశంలో ఇలాంటి అపప్రధ మూటగట్టుకున్న మరో యార్డు ముంబై లో ఉంది. దీనికి ప్రపంచంలో 12వ స్థానం దక్కింది. బుయనోస్ ఎయిర్స, జకార్తా, కౌలాలంపూర్ లోని యార్డులు మాత్రమే మన జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కంటే ముందు వరసలో ఉన్నాయి. 2025 లో ఫిబ్రవరి 14 నుండి డిసెంబర్ 26 మధ్యన 14 సార్లు ఈ యార్డు వద్ద సమాచారం సేకరించారు. ఈ యార్డు నుండి అత్యంత ఎక్కువగా గంటకు 11.1 టన్నుల మీథేన్ వాయువు విడుదల అయినట్టు ఈ అధ్యయనం బయటపెట్టింది.
గంటకు ఐదు టన్నుల మీథేన్ విడుదల వలన జరిగే కాలుష్యం పది లక్షల ఎస్‌యూవీ లు లేదా 500 మెగా వాట్ ల థర్మల్ ప్లాంట్ విడుదల చేసే వాయువులకు సమానం అని ఈ అధ్యయనం చెబుతోంది. ఈ కాలుష్యం పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు దాఖలు కాగా కోర్టు ఆదేశాలతో జీహెచ్ఎంసీ తీసుకోవాల్సిన చర్యలపై సిఫారసుల కోసం ఐఐటీ ముంబై ని సంప్రదించింది. ఈ సిఫారసుల పై ఆధారపడి జవహర్ నగర్ యార్డులో గత కొంత కాలంగా నిల్వ ఉన్న వ్యర్థాలను రోజువారీగా వచ్చే కొత్త వ్యర్థాల నిర్వహణ చేయనున్నారు.
జవహర్ నగర్ యార్డు నిర్వహణ కష్ట సాధ్యం అవుతున్న తరుణంలో మరికొన్ని చోట్ల యార్డులు ఏర్పాటు చేయాలని అనుకున్నా అవి ప్రతిపాదనల స్థాయిలో మాత్రమే మిగిలాయి. ప్యారానగర్ (సంగారెడ్డి జిల్లా), ఖానాపూర్ (రంగా రెడ్డి జిల్లా/వివిధ ప్రాంతాలు), దుండిగల్ / పశమైలారం (మేడ్చల్ మల్కాజిగిరి / సంగారెడ్డి జిల్లా), లక్దారం (సంగారెడ్డి జిల్లా) ఈ ప్రతిపాదిత ప్రాంతాల్లో ఉన్నాయి.
డంపింగ్ యార్డులకు కొత్త రూల్స్:
ఈ డంపింగ్ యార్డు ల నిర్వహణ కోసం 2016 లో తయారు చేసిన రూల్స్ ను ఇటీవల కేంద్ర ప్రభుత్వం జనవరి 1న అప్డేట్ చేసింది. ఇవి ఈ ఏడు ఏప్రిల్ ఒకటి నుండి అమలులోకి వచ్చాయి. వీటిని 1986 ఎన్విరాన్మెంట్ (ప్రొటెక్షన్) యాక్ట్ చట్ట పరిధిలోకి తీసుకువచ్చారు. ఈ నియమాలను ఉల్లంఘించే వారికి అది జరిమానాను నిర్దేశించింది. ఇందులో చెత్తను వేరుచేయటం, దాని నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది.
చెత్తను తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ, స్పెషల్ కేర్ వేస్ట్ లను సోర్స్ లోనే వేరుచేయాలని ఈ రూల్స్ నిర్దేశిస్తున్నాయి. తడి చెత్తలో వంట గదిలో చెత్త, కూరగాయలు, పళ్ల తొక్కలు, మాంసం, పూలు భాగం అవుతాయి. వీటిని దగ్గర ప్రాంతాల్లోనే కంపొస్ట్ చేయాలి. పొడి చెత్తలో ప్లాస్టిక్, పేపర్, మెటల్, గ్లాస్, కొయ్య, రబ్బరును వేరుచేసి రీసైకిల్ చేయటానికి పంపాలి. డైపర్లు, శానిటరీ టవల్స్, కండోమ్స్ స్యానిటరి వేస్ట్ లో భాగం. వీటిని సరిగా భద్రపరిచి వేరుగా ఉంచాలి. స్పెషల్ వేస్ట్ లో భాగం అయిన పెయింట్ దబ్బాలు, బుల్బులు, మెర్క్యురీ థర్మామీటర్లు, మందులు మొదలైన వాటిని కొన్ని ఏజెన్సీస్ నిర్దేశిత ప్రాంతాల్లో నుంచి తీసుకుంటారు అని అందులో నిర్దేశించారు.
20,000 చదరపు అడుగులలో పని చేసే సంస్థలు లేదా రోజుకు 40,000 లీటర్ ల నీటిని వినియోగించేవి లేదా రోజుకు 100 కిలోల సాలిడ్ వేస్ట్ ఉత్పత్తి చేసే సంస్థలను బల్క్ వేస్ట్ జనరేటర్లు గా గుర్తించారు.
ఐదు టన్నుల పరిమితికి మించి చెత్తను ప్రాసెస్ చేసే ప్లాంట్ లకు త్వరితగతిన భూకేటాయింపుకోసం యార్డుకు తగిన సౌకర్యాలు, దాని చుట్టూ తగిన స్థలం ఉండాలి అని ఈ రూల్స్ చెబుతున్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు వీటికి సంబంధించిన మార్గానిర్దేశం చేస్తుంది. ఇవి జరిగితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భూకేటాయింపుకు మార్గం సుగమం అవుతుంది.
దేశంలోని డంపింగ్ యార్డుల నిర్వహణ, కార్యకలాపాలను నిర్దేశించేందుకు ఒక కేంద్రీకృత వెబ్సైట్ తయారు చేయనున్నారు. ఇందులో స్థానిక సంస్థలు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులు, కాలుష్య నియంత్రణ కమిటీలు ఇందులో భాగంకానున్నాయి. అవి తమ రిపోర్టులను ఈ వెబ్సైట్ లోనే పెట్టనున్నాయి. అలాగే ఈ యార్డులను ఆడిట్ చేసి ఆ నివేదికలను ఇందులో ఉంచనున్నారు.
వాస్తవిక పరిస్థితులు:
అయితే రూల్స్ ఎన్ని ఉన్నా అవి క్షేత్ర స్థాయిలో అమలు కావటం లేదని జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా పోరాడిన కేతిపల్లి పద్మాచారి తెలిపారు. “వ్యర్ధాల నిర్వహణ కోసం టన్నుకు రు. 1,250 ప్రభుత్వం రాంకీ సంస్థకు చెల్లిస్తోంది. వారితో జరిగిన ఒప్పందం ప్రకారం వ్యర్థాలను తడి, పొడి, ఇతర రకాలను వేరుచేసి వాళ్ళకు ఇచ్చిన 339 ఎకరాల్లో తమ కార్యక్రమాలు నిర్వహించాలి. ఒప్పందం ప్రకారం వాటిని నిర్వహిస్తే ఆ చెత్త గుట్టలు యార్డ్ లో ఉండకూడదు,” అని ఆయన తెలిపారు.
ఈ నిర్వహణా లోపాల వలన మురుగు నీరు భూమిలోనికి ఇంకి ఐదు కిలోమీటర్ ల వైశాల్యంలో నీరు కలుషితం అవుతున్నాయి. యార్డులో నుండి చేర్యాల చెరువు, బండ్లగూడ, రాంపల్లి, ఘట్కేసర్, ఎదులాబాద్ చెరువుల నుండి చివరికి మూసి నదిలోకి ఈ వ్యర్థ నీరు చేరుతోంది. యార్డులో జరిగే అగ్ని ప్రమాదాలు 10 కిలోమీటర్ ల పరిధిలో కాలుష్యం కలుగచేస్తున్నాయి.
నాయకులకు ఈ విషయాలపై చిత్తశుద్ధి లేదని పీసీసీ ప్రెసిడెంట్ గా ఉండగా తమతో సహకరించి జేఏసీ లో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి తగిన చర్యలు తీసుకోవాలి అని పద్మాచారి అభిప్రాయపడ్డారు. ఈ సమస్య రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, భువనగిరి, మెదక్ తదితర ప్రాంతాల్లో ఈ యార్డ్ ప్రభావం ఉంది. ప్రతిపక్షంలో ఉండగా లేవనెత్తిన సమస్యను అటకెక్కించారు. ఇందులో కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు, జాతీయ విపత్తుల నియంత్రణ సంస్థ కలుగచేసుకోవాలి. యార్డ్లో కేవలం కొద్ది మేరకే ఆర్గానిక్ వ్యర్ధాలు ఉపయోగించి పవర్ ఉత్పత్తి చేస్తున్నారు, అని ఆయన తన ఆవేదన తెలిపారు.రాంకీ మీద తగిన చర్యలు తీసుకోవాలి, అని గుర్తు చేశారు.
ఈ విషయం పై ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్’ కు చెందిన అతిన్ బిశ్వాస్ స్పందిస్తూ చెత్తను రకాన్ని బట్టి వేరుచేయకుండా దాని నిర్వహణ చేయడం సాధ్యం కాదని తెలిపారు. మన దేశంలో ఎక్కువభాగం ఆర్గానిక్ వ్యర్ధాలు ఉంటాయి. మనం ఆహారం వండుకునే తినే పద్దుతుల వలన ఈ పరిస్థితి ఉత్పన్నం అవుతుందని ఆయన తెలిపారు. పాశ్చాత్య దేశాలలో ఆహారం వేస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. ఆర్గానిక్ వ్యర్ధాలు ఓపెన్ సైటు కు రాకూడదు. ఇలాంటి వ్యర్థాలను వికేంద్రీకృత పద్దతిలో నిర్వహించాలి, అని తెలిపారు.
చెత్త నిర్వహణకు ప్రధానమైన ఖర్చు దాన్ని నిర్దేశిత ప్రాంతానికి చేర్చటం. ఈ ఖర్చులను పవర్ తయారీ తో కొంత మేరకు రాబట్టినా పూర్తిగా రాబట్టటం దాదాపు అసాధ్యం అని అభిప్రాయ పడ్డారు.

