
కారెక్కేసిన జీవన్.. కండువా కప్పి స్వాగతించిన కేసీఆర్..
కండువా కప్పి పార్టీలోకి జీవన్ రెడ్డిని ఆహ్వానించిన సీఎం. భారీ సంఖ్యలో కార్యకర్తలు సైతం గులాబీ దళంలోకి చేరారు.
మాజీ మంత్రి జీవన్ రెడ్డి.. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జగిత్యాల జిల్లా వేదికగా జరుగుతున్న భారీ బహిరంగ సభలో జీవన్ రెడ్డిని కేసీఆర్.. పార్టీలోకి ఆహ్వానించారు. జీవన్ రెడ్డితో పాటు పలువురు కార్యకర్తలు కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. మరికాసేపట్లో ఈ సభలో జీవన్ రెడ్డి, కేసీఆర్ ప్రసంగించనున్నారు. కాగా వారు కాంగ్రెస్ పాలన టార్గెట్‌గా విమర్శలు గుప్పించే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తమైన రాష్ట్ర పరిస్థితి వివరిస్తామని జీవన్ రెడ్డి వెల్లడించారు. ఇక నుంచి జగిత్యాలలో ప్రజాపోరాటం మొదలవుతుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ జెండాను మోసిన సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జగిత్యాలలో నిర్వహించిన భారీ ప్రజా ఆశీర్వాద సభలో పార్టీ అధినేత కేసీఆర్ ఆయనకు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, తాను పదవుల కోసం కాకుండా కేవలం ఆత్మాభిమానం కాపాడుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
గత 20 నెలలుగా కాంగ్రెస్ పార్టీలో తాను నరకం అనుభవించానని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో పార్టీ తనకు అండగా ఉండాల్సింది పోయి, నిరంతరం వివక్షకు గురిచేసిందని ఆయన పేర్కొన్నారు. నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేసిన తనకు చివరకు అవమానాలే మిగిలాయని, ఆ మానసిక క్షోభ భరించలేకే కారు ఎక్కాల్సి వచ్చిందని ఆయన వివరించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీరుపై జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎస్ ఎల్ బీసీ టన్నెల్ ప్రమాదంలో కూలీలు మరణిస్తే ప్రభుత్వం కనీసం మృతదేహాలను కూడా బయటకు తీయలేకపోయిందని ధ్వజమెత్తారు. రైతుబంధును నిలిపివేసి, తులం బంగారం పేరుతో కల్యాణలక్ష్మి పథకాన్ని అటకెక్కించి పేదల పొట్ట కొట్టారని మండిపడ్డారు.
విద్యార్థి దశ నుండి కేసీఆర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న జీవన్ రెడ్డి, జగిత్యాల అభివృద్ధికి ఆయనే కారణమని కొనియాడారు. జిల్లా ఏర్పాటు, మెడికల్ కాలేజీ, బ్రిడ్జిలు, గురుకుల పాఠశాలల నిర్మాణం కేసీఆర్ కృషితోనే సాధ్యమయ్యాయని ప్రశంసించారు. గిరిజన రిజర్వేషన్ల పెంపు వంటి నిర్ణయాలను ఆయన గుర్తు చేశారు.

