సీనియర్ జర్నలిస్ట్ తెలిదేవర భాను మూర్తి ఇకలేరు..
x

సీనియర్ జర్నలిస్ట్ తెలిదేవర భాను మూర్తి ఇకలేరు..

తెలంగాణ మాండళికానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన జర్నలిస్ట్.


తెలంగాణ మాండళిక శోభను అక్షరాల్లో నింపిన ప్రముఖ పాత్రికేయుడు తెలిదేవర భానుమూర్తి ఇక లేరు. ఆయన మరణ వార్త తాజాగా తెలిసి సాహిత్య, మీడియా వర్గాల్లో విషాదాన్ని మిగిల్చింది. వ్యంగ్య రచనలు, తెలంగాణ నుడికారాలు రాయడంలో దిట్ట. ఆయన రాసిన పుస్తకాలు కూడా అంతే ఫేమస్. అటువంటి రచయిత, పాత్రకేయుడి మరణం తీరని లోటుగా జర్నలిస్ట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన దాదాపు ఏడాదిగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. కొన్ని రోజులుగా పరిస్థితి మరింత విషమించింది. బుధవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలియడంతో ఆయన సహకరులతో సహా పాత్రికేయ లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

తెలిదేవర భానుమూర్తి తన రచనలతో మాత్రమే కాదు, తన వ్యక్తిత్వంతో కూడా ఎంతోమందికి దగ్గరయ్యారు. ఆయన మాటల్లో, నవ్వులో, నడవడికలో తెలంగాణ స్ఫూర్తి కనిపించేదని సహచరులు గుర్తు చేసుకున్నారు. ఉదయం నడక చేస్తూ స్నేహితుల ఇళ్లకు వెళ్లి చాయ్ తాగుతూ స్నేహంగా మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయని తెలిపారు.

1953 జనవరి 16న భువనగిరిలో జన్మించిన భానుమూర్తి చిన్నప్పటి నుంచే చదువులో ఆసక్తి చూపించారు. యాదగిరిగుట్ట, ఆర్మూర్, భువనగిరిలో చదువుకుని, ఒస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేశారు. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుకుగా పాల్గొన్నారు. ఆ సమయంలో నల్లగొండ జైలులో కూడా ఉండాల్సి వచ్చింది. అదే కాలంలో ఆయన తెలంగాణ మాండలికంలో కవితలు రాయడం ప్రారంభించారు.

ఆ కవితలను ‘ఊరోలు’ అనే పేరుతో సంకలనంగా తీసుకొచ్చారు. తరువాత జర్నలిజం వైపు అడుగుపెట్టి తెలంగాణ బాసలో రాజకీయ వ్యంగ్య రచనలు ప్రారంభించారు. తన వ్యంగ్య రచనలతో అప్పటి ప్రభుత్వాలపై కూడా విమర్శలు చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వాలపై రాసిన వ్యంగ్య రచనలు తర్వాత ‘పలుకుబడి’ పేరుతో పుస్తకంగా వచ్చాయి. అలాగే ‘చల్నేదో బాల్ కిషన్’ అనే శీర్షికతో రాసిన హాస్య రచనలు పుస్తక రూపంలో వెలువడ్డాయి. ‘గిల్లిదండ’ వంటి రచనలు కూడా పాఠకులను ఆకట్టుకున్నాయి. కథలుగా ‘ఆక్సిజన్ బార్’, ‘నెమీక’, ‘గులేర్’ వంటి సంపుటాలు కూడా ఆయన సాహిత్య సంపదలో భాగమయ్యాయి.

తెలంగాణ మాండళికాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన పాత్ర ప్రత్యేకంగా నిలిచింది. ఉద్యమ కాలం నుంచి చివరి వరకు అదే భాషలో రచనలు కొనసాగించడం ఆయన ప్రత్యేకతగా నిలిచింది. భానుమూర్తి మరణంతో తెలంగాణ సాహిత్య రంగం ఒక అనుభవజ్ఞుడిని కోల్పోయిందని సాహిత్య వర్గాలు భావిస్తున్నాయి. ఆయన రచనలు, జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ నిలిచిపోతాయని సహచరులు పేర్కొన్నారు.

Read More
Next Story