
జూబ్లీహిల్స్ కేసు: 25 మైనర్లు ట్రాప్, 40 లక్షలు వసూలు
సోషల్ మీడియా ద్వారా మైనర్లను లక్ష్యంగా చేసుకున్న నిందితులపై దర్యాప్తులో కీలక విషయాలు బయటపడ్డాయి. పోలీసులు మరింత విచారణ కోరారు.
హైదరాబాద్‌లో సంచలనం రేపిన జూబ్లీహిల్స్ మైనర్ బాలికల కేసులో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా దర్యాప్తులో, 25 మంది మైనర్ బాలికలను ట్రాప్ చేసి 40 లక్షలకు పైగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అర్జున్ కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అతను తన స్నేహితులైన హర్ష, జతిన్, శ్రీజిత్ ఫోన్లు, సోషల్ మీడియా అకౌంట్లు ఉపయోగించి బాలికలను టార్గెట్ చేసినట్లు సమాచారం. తనపై అనుమానం రాకుండా ఇతరుల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను వాడినట్లు పోలీసులు గుర్తించారు. అర్జున్‌తో పాటు అతని సోదరుడు రాజీవ్ కూడా ఈ వ్యవహారంలో భాగమై ఉన్నాడు.
సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుని, ధనిక కుటుంబాలకు చెందిన బాలికలను ట్రాప్ చేసినట్లు వెల్లడైంది. బాలికలు ట్రాప్ అయిన తర్వాత, వారి తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో అర్జున్ వారి వద్దకు వెళ్లి దుర్వినియోగం చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. ఈ విధంగా అనేక మందిని లక్ష్యంగా చేసుకుని డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు అర్జున్‌తో పాటు సరస్వతి, రాజీవ్, మీనాకుమారి, ప్రశాంత్‌లను అదుపులోకి తీసుకున్నారు.
అర్జున్‌పై రౌడీ షీట్ కూడా నమోదు చేశారు. ఇప్పటికే అర్జున్, ప్రవీణ్ అనే మరో నిందితుడిని నాలుగు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. విచారణలో మరిన్ని విషయాలు బయటపడటంతో, నిందితులను మళ్లీ వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

