జూబ్లీహిల్స్ హనీట్రాప్ కేసు: అన్నదమ్ముల గ్యాంగ్ అరెస్ట్
x

జూబ్లీహిల్స్ హనీట్రాప్ కేసు: అన్నదమ్ముల గ్యాంగ్ అరెస్ట్

ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మైనర్లను టార్గెట్ చేసిన గ్యాంగ్ పై పోలీసుల దర్యాప్తు వేగం. కొత్త నిందితులు అరెస్ట్, సంచలన విషయాలు బయటకు.


జూబ్లీహిల్స్‌లో బయటపడిన హనీట్రాప్ కేసు నగరాన్ని కుదిపేస్తోంది. తాజాగా ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరగడం కలకలం రేపింది. ఈ ఘటనలో గుంటూరుకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు ప్రధాన నిందితులుగా పోలీసులు గుర్తించారు. అర్జున్, ప్రవీణ్ పేర్లతో ఉన్న వీరు ఇన్‌స్టాగ్రామ్‌ను వేదికగా చేసుకుని మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం, అర్జున్ సోషల్ మీడియాలో ఎస్కార్ట్‌గా నటిస్తూ వీడియోలు పోస్ట్ చేసేవాడు.

రిచ్ కిడ్స్‌ను ఆకర్షించేలా కంటెంట్ తయారు చేసి, వారిని నమ్మించేవాడు. ఖరీదైన కార్లు, విలాసవంతమైన జీవితం చూపిస్తూ బాలికలను వలలో వేసేవారు. వారిని బయటకు తీసుకెళ్లిన తర్వాత కార్లలోనే లైంగిక దాడులకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఘటనలను రహస్యంగా చిత్రీకరించి, ఆ వీడియోలతో బాధితులను బెదిరించి డబ్బులు వసూలు చేసేవారు. ఒక మైనర్ బాలిక నుంచి రూ.13 లక్షలు తీసుకున్న విషయం బయటపడింది.

ఇప్పటివరకు సుమారు 19 మంది బాలికలను ఈ గ్యాంగ్ ట్రాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సీపీ సజ్జనార్ స్వయంగా పోలీస్ స్టేషన్‌లో నిందితులను గంటల పాటు విచారించారు. ఇప్పటికే అన్నదమ్ములు అరెస్టు కాగా, తాజాగా మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో అర్జున్ తల్లి, మేనమామ, ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఈ నలుగురు కూడా ట్రాప్ చేయడంలో సహకరించినట్లు పోలీసులు తెలిపారు.

అరెస్ట్ చేసిన నిందితులను కోర్టుకు తరలించారు. అర్జున్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను కూడా పోలీసులు నిలిపివేశారు. ఇప్పటికే పలువురు బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తును మరింత వేగంగా కొనసాగిస్తున్నారు.

Read More
Next Story