సీఈవో కార్యాలయం వద్ద సీఎం డీకే శివకుమార్‌ ధర్నా..
x

సీఈవో కార్యాలయం వద్ద సీఎం డీకే శివకుమార్‌ ధర్నా..

సీఈవో కార్యాలయం వద్ద కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ధర్నా కోర్టు ఆదేశాల ఉల్లంఘన అంటూ బీజేపీ ఎఫ్‌ఐఆర్ కోరగా, తాను కేవలం వినతిపత్రం ఇచ్చానని సీఎం స్పష్టం చేశారు.


Click the Play button to hear this message in audio format

కర్ణాటక రాజకీయాల్లో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. సీఈవో కార్యాలయం వెలుపల ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రులు చేపట్టిన ధర్నాపై భారతీయ జనతా పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి నిరసన చేపట్టారని ఆరోపిస్తూ సీఎం, మంత్రులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేసింది. ఈ డిమాండ్‌తో బీజేపీ నాయకులు బెంగళూరు పోలీస్ కమిషనర్ కార్యాలయం బయట ధర్నా చేపట్టారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర, ప్రతిపక్ష నేత ఆర్. అశోకతో పాటు పలువురు నేతలు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ముఖ్యమంత్రి, మంత్రులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అయితే ఈ ఆరోపణలను సీఎం డీకే శివకుమార్ ఖండించారు. తాను ఎన్నికల సంఘానికి కేవలం ఒక వినతిపత్రం మాత్రమే సమర్పించానని ఎలాంటి నిరసన కార్యక్రమం చేపట్టలేదని చెప్పారు. "నా పని పూర్తయ్యే వరకు అక్కడ కూర్చున్నాను అంతే. నేను ఎక్కడ నిరసన తెలిపాను?" అని ప్రశ్నించారు.

ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ సందర్భంగా ఫారం-7 దుర్వినియోగం జరిగిందని ఆరోపిస్తూ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ సీఎం తన మంత్రివర్గ సహచరులతో కలిసి సీఈఓ కార్యాలయానికి వెళ్లారు.

ఫారం-7 అనేది ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చడం లేదా తొలగింపులపై అభ్యంతరం తెలిపేందుకు ఉపయోగించే దరఖాస్తు పత్రం.

బీజేపీ ఎఫ్‌ఐఆర్ డిమాండ్‌పై స్పందించిన శివకుమార్ "వారికి కేసు పెట్టాలనిపిస్తే పెట్టండి. చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలితే చర్యలు తీసుకోండి" అని అన్నారు. తాను ఓటర్ల హక్కుల పరిరక్షణ కోసమే ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లానని తెలిపారు. "ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. నా డిమాండ్లను పరిశీలించే వరకు అక్కడే ఉన్నాను. నాతో పాటు కొందరు మంత్రులు కూడా వచ్చారు" అని శివకుమార్ వివరించారు.

మరోవైపు అక్టోబర్ 1న జరిగిన ఈ ఘటన కర్ణాటక హైకోర్టు ఆదేశాలకు విరుద్ధమని బీజేపీ ఆరోపించింది. ఫ్రీడమ్ పార్క్ మినహా ఇతర ప్రాంతాల్లో ధర్నాలు, నిరసనలను పరిమితం చేస్తూ హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చిందని పేర్కొంది. అలాంటి పరిస్థితిలో / ఎన్నికల కార్యాలయం వద్ద నిరసనకు అనుమతి ఎవరు ఇచ్చారని ప్రశ్నించింది.

"లిఖితపూర్వక అనుమతి ఉందా? ఉంటే ఆ పత్రాన్ని బహిర్గతం చేయాలి" అని బీజేపీ తన వినతిపత్రంలో పేర్కొంది. అక్టోబర్ 1 ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, పోలీసు బందోబస్తు వివరాలు, అనుమతి పత్రాలు కూడా విడుదల చేయాలని డిమాండ్ చేసింది.

ఇక ప్రతిపక్ష నేత ఆర్. అశోక ఫారం-7 దరఖాస్తులపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించాలంటూ ఎన్ని దరఖాస్తులు వచ్చాయో ఎన్నికల సంఘం వెల్లడించాలని కోరారు. ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఎన్నికల సంఘాన్ని లేదా కోర్టును ఆశ్రయించవచ్చని అన్నారు.

ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ స్వతంత్ర సంస్థ అని దాని ప్రాంగణాన్ని రాజకీయ నిరసనలకు ఉపయోగించడం సరైందా అనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఎం చర్య చట్టబద్ధమేనా? లేక కోర్టు ఆదేశాల ఉల్లంఘన జరిగిందా? అన్న అంశంపై ఇప్పుడు రాజకీయ వాదోపవాదాలు కొనసాగుతున్నాయి.

పోలీస్ కమిషనర్ బీజేపీ ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పార్టీ నేతలు తమ ధర్నాను విరమించుకున్నారు.

Read More
Next Story