
సంతోష్ ను సిట్ పిలవడం కరెక్టే : కవిత
గంజా స్మగ్లర్ల దాడిలో గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబాన్ని నిమ్స్ లో పరామర్శించిన కవిత
భారత రాష్ట్రసమితి మాజీ రాజ్యసభ సభ్యుడు, పార్టీ అధినేత కె చంద్రశేఖర్ రావు మేనల్లుడు సంతోష్ రావు ను టెలిఫోన్ ట్యాపింగ్ మీద విచారణ చేస్తున్న ‘సిట్’ పిలవటం మంచిదే అని తెలంగాణ జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. కానీ ఆయనకు శిక్ష పడటం అనుమానమే అని అన్నారు. ఇటువంటి దుర్మార్గుడికి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎందుకు వత్తాసు పలుకుతున్నారో అర్థం కావటం లేదని అన్నారు.
మంగళవారం నాడు సంతోష్ సిట్ ముందుకు వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యాలు చేశారు. అంతేకాదు, సంతోష్ మీద చాలా తీవ్రమయిన ఆరోపణలు చేశారు. గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడిని ఎక్సైజ్ కాన్ స్టేబుల్ సౌమ్య కుటుం బాన్ని ఆమె హైదరాబాద్ నిమ్స్ లో పరామర్శించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు దూరం కావటానికి కారణం మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావే కారణమని తెలంగాణ జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
గద్దర్ లాంటి నాయకులు గంటలు గంటలు గేట్ బయట వేచి చూడటం, ఈటల లాంటి వారు బయటకు రావటానికి కూడా ఈ సంతోష్ రావే కారణమని అమె అన్నారు.
“కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో సగం ఇడ్లి తిన్నారా? పూర్తిగా ఇడ్లి తిన్నారా? అన్న సమాచారాన్ని కూడా గుంపు మేస్త్రీకి చేరవేసేది సంతోష్ రావే. గుంపుమేస్త్రికి ప్రధాన గూఢచారి సంతోష్ రావు. అందుకే ఆ గూఢచారిని శిక్షిస్తాడని నేను నమ్మటం లేదు,” అని ఆమె మంగళవారం నాడు వ్యాఖ్యానించారు.
తాను గతంలో చెప్పిన దయ్యాల్లో మొదటి దయ్యమే సంతోష్ రావు అని చెబుతూ నిజంగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే కచ్చితంగా ఈ దుర్మార్గుడికి శిక్ష పడుతుందని ఆమె అన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పోలీసులు తమ పని తాము చేయాలని నేను విజ్ఞప్తి చేశారు..
“ఒక్కోసారి మన నీడ కూడా మన కళ్లను కప్పే పరిస్థితి వస్తుంది. ఉద్యమకారులను కేసీఆర్ గారికి దూరం చేసిన పాపం కచ్చితంగా ఈ దుర్మార్గుడికి తగులుతుంది,అని కవితఅన్నారు.


