TRS ను లాగేసుకున్న కవిత
x

TRS ను లాగేసుకున్న కవిత

తండ్రి కెసిఆర్ మీద మరొక దెబ్బ


కల్వకుంట్ల కవిత తండ్రి కెసిఆర్ మీద మరొక దెబ్బ వేసింది. ఆమె తన కొత్త పార్టీకి TRS అని పేరు పెట్టి బిఆర్ ఎస్ నాయకత్వాన్ని బాగా ఇరుకున పెట్టింది. కవిత కొత్త పార్టీ టిఆర్ ఎస్ యే అయినా అది కొత్త అవతారం. కొత్త పార్టీ పేరును ఆమె చాలా తెలివిగా ఎంపిక చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరును నేరుగా వాడుకుంటే నైతికంగా ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే 2001 లో తండ్రి తెలంగాణ రాష్ట్రసాధన కోసం పెట్టిన పార్టీ. దానిని ఉన్నదున్నట్లు లాగేసుకోవడం అంత మంచిది కాదు. అందుకే ఆమె తెలివిగా TRS అనే మూడు సూపర్ హిట్ ఇంగ్లీష్ అక్షరాలు వచ్చేలా పేరు సెలెక్టు చేసుకుని తన కొత్త పార్టీ ‘తెలంగాణ రాష్ట్ర సేన’ అని ప్రకటించారు. దీనితో మళ్లీ టిఆర్ ఎస్ కు వెళ్లే అవకాశం బిఆర్ ఎస్ కు లేకుండా చేశారు.

తన కొత్త TRS అక్షరాలు స్పష్టంగా కనిపించేలా జెండానురూపొందించారు. కవిత కొత్త TRS జెండా మధ్యలో నీలిరంగులో తెలంగాణ మ్యాప్.. దాని మధ్యలో ఇంగ్లీష్ అక్షరాల్లో TRS పేరు నిగనిగలాడుతూ కనిపిస్తుంది.

బిఆర్ ఎస్ (భారత రాష్ట్ర సమితి) అనే పేరు అచ్చిరాలేదని పార్టీ అధినేత కెసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కె టి రామారావు తో పాటు పార్టీ లో కింది నుంచి పైదాకా ఏకాభిప్రాయంతో ఉన్నారు. అంతేకాదు, బిఆర్ ఎస్ పేరు ను మూసిలో పడేసి తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)కే వెళ్లాలనే చర్చ చాలా రోజులుగా పార్టీ లో నడుస్తూ ఉంది. ఇటీవల ఇదే అభిప్రాయాన్ని కెటిఆర్ కూడా వ్యక్తం చేశారు.

అదే సమయంలో టిఆర్ ఎస్ పార్టీ టైటిల్ అందుబాటులో ఉంటుంది కాబట్టి దానినే కవిత తన కొత్త పార్టీగా ప్రకటించవచ్చనే చర్చ మొదలయింది. ఇదే విశ్వాసాన్ని కవిత కూడా వెల్లడించారు. తండ్రి పెట్టిన పేరు తీసుకోరాదని ఆమె నిర్ణయించుకున్నారు. ఇది నైతకంగా మంచి విధానం కాదని ఆమె కొంతమంది సలహా ఇచ్చారని అమె సన్నిహిత వర్గంలోని ఒక వ్యక్తి ఫెడరల్ తెలంగాణకు చెప్పారు. దీనితో ఆమె కొత్త పేరు అన్వేషనలో పడ్డారు. అయినప్పటికి " ఆమెకు టిఆర్ ఎస్ (TRS) మీద ఉన్న అభిమానం చావలేదు. అందుకే మరో రూటో లో ఆమె TRS దగ్గిరకు వచ్చారు. తన పార్టీ పేరును తెలంగాాణ రాష్ట్ర సేన అని ప్రకటించారు. దీనితో నైతిక సమస్య పరిష్కారమయింది. ఆమెకు టిఆర్ ఎస్ దక్కింది," అని ఆయన చెప్పారు.

బిఆర్ ఎస్ కు తానే ప్రత్యామ్నాయమవుతానని కవిత భావిస్తున్నారు. టిఆర్ ఎస్ అంటే ప్రజల్లో బాగా గౌరవం ఉంది. టిఆర్ ఎస్ కు ఆదరణ బిఆర్ ఎస్ కు లేదు.దేశాన్ని కూడా ఎలాలాని కెసిఆర్ ఆత్యాశతో బిఆర్ ఎస్ ప్రకటించినపుడు తెలంగాణ మేధావలెవరూ సంతోషించలేదు. బిఆర్ఎస్ సక్సెస్ కాదు అని అంతా భావించారు. ఎన్ని పూజలు, యాగాలు, వ్రతాలు చేసినా బిఆర్ ఎస్ ఎగరలేదు. ఎగరకపోవడమే పార్టీ కొంప ముంచింది. కెసిఆర్ పరువు తీసింది. ఎన్ని తాయిలాలు పంచినా, కామారెడ్డిలో ఆయన్నే ప్రజలు ఓడించారు. అంటే ఆపేరుకు ప్రజల్లో ఎంత విముఖత ఉందో అర్థమవుతుంది. అందుకే మళ్లీ వెనక్కు వచ్చి టిఆర్ ఎస్ కుబుసంలోకి దూరాలని చూస్తున్నారు. పాము వదిలేసిన కుబుసంలోకి దూరడం కష్టం.

కెసిఆర్ తెలంగాణ కలలను భగ్నం చేశారు

"కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ రథం దారి తప్పింది. సామాజిక రథ చక్రం విరిగి ముక్కలైంది ఏ తరహాలో పనిచేయాలో అలా జరగలేదని చెప్పటానికి బాధగా ఉంది. ఇసుక దందా మీద ప్రేమతో దళితుల చావులు అయ్యాయి. ఫోన్ మాట్లాడాలంటే భయం. దారుణమైన నిఘా నీడలో మనం బతికాం. మనం అనుకున్న తెలంగాణ రాలేదని మీకు చెబుతున్నా. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో భాగమైనందుకు సిగ్గుపడుతున్నా. తెలంగాణ సాధించటంలో భాగమైనందుకు నా జన్మ ధన్యమైంది. నా తప్పులకు భాగస్వామ్యం ఉందన్న దానికి కేవలం క్షమాపణ చెబితే సరిపోదు. ఆ తప్పులను దిద్దుకోవటానికి కష్టపడి పనిచేయాలి అందుకోసమే మేము ‘తెలంగాణ రాష్ట్ర సేన’ గా వస్తున్నాం," అని కవిత TRS పేరు ప్రకటిస్తూ తన లక్ష్యం ఏమిటో చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర సేన ఉత్తుత్తి పార్టీ కాదు

బీఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణ ఆత్మ కోల్పోయిందని అందుకే తెలంగాణ రాష్ట్ర సేన వచ్చిందని కవిత సభలో ప్రకటించారు.

"తెలంగాణలోని మూడు కోట్ల మందికి ఒక అమ్మలాగా పరిణితి చెందాలని అనుకుంటున్నా.అమ్మతనంతో, ఆర్ధితో పాలన జరిగినప్పుడే కష్టాలు తీరుతాయి. రైతాంగ పోరాటం, ముల్కీ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఇలా సాగుతూనే ఉంది. చాకలి ఐలమ్మ, గద్దరన్న, మారోజు వీరన్న సహా అనేక మంది పోరాటం చేస్తేనే ఇలా మార్పులు వచ్చాయి. అమర వీరులు, కేసీఆర్ గారు అనేక మంది కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. సమ్మక్క సారక్క నాటి నుంచే సామాజిక పోరాటం జరిగింది. కొండ లక్ష్మణ్ బాపూజీ, పాపన్న గౌడ్, పంతు నాయక్ గారు, జనార్ధన్ రావు గారి స్ఫూర్తిని తీసుకుంటాం. రాజ్యాంగ బద్దంగా రాజకీయ శక్తితో ప్రజాపోరాటాలు మిళితం చేసి సామాజిక న్యాయ తెలంగాణను సాధిస్తాం. తెలంగాణ రాష్ట్ర సేన మీ ముందుకు ఊరికే రాలేదు,"అంటూ ‘సామాజిక తెలంగాణ’ తన లక్ష్యంగా ప్రకటించారు. సామాజిక తెలంగాణ అనేది తెలంగాణ బిసి కులాల కోరిక. కెసిఆర్ ఎపుడూ బిసిలను దగ్గరకు రానీయలేదు. ఆయన్ని బిసిలంతా బిసి వ్యతిరేకిగా చెబుతుంటారు. ఈ బిసిల మీద కవిత గురిపెట్టి ‘సామాజిక తెలంగాణ’ అంటున్నారు.

ఎందుకు తెలంగాణ రాష్ట్ర సమితి పేరు తీసుకోలేదు?

2001 నుంచి 2024 దాకా తెలంగాణ రాజకీయాలను శాసించిన వ్యక్తి ఒకసారితీసుకున్న నిర్ణయాన్ని మార్చుకుని వెనక్కురావడం చాలా కష్టం. ఆత్మాభిమానంతో కూడుకున్న వ్యవహారం. తాను పట్టిందంతా బంగారమే అని భావించే కెసిఆర్ ఒక్క సారి మళ్లీ తాను అక్టోబర్ 5, 2022న తీసుకున్న నిర్ణయం తప్పుఅని ప్రకటించి టిఆర్ ఎస్ పాతచొక్క తొడుక్కోవడం అత్మాభిమానంతో కూడా కున్న పని. అందువల్లే బిఆర్ ఎస్ నుంచి టిఆర్ ఎస్ కే వెళ్లిపోదామని 2023 ఎన్నికల దెబ్బతగిలినప్పటి నుంచి పార్టీ నాయకులంతా చెబుతున్నా కెసిఆర్ వెంటనే ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.

ఇపుడు టిఆర్ ఎస్ అనేది పర్మనెంటుగా చేజారి పోయింది. కూతురు కవిత TRS అనే ముచ్చటైన మూడక్షరాలను, మూడుకోట్ల తెలంగాణ ప్రజల్లో బాగానాని ఒక శక్తిగామారిన మూడక్షరాలను మళ్లీ తండ్రికి దక్కకుండా చేసింది.

కవిత రాజకీయ ప్రస్థానం

కవితకు ఒక విధంగా ముందుచూపు ఎక్కువే అని చెప్పాలి. తెలంగాణ ఉద్యమం జోరుగాసాగుతున్న ముందు 2014 కు ‘తెలంగాణ జాగృతి’ అనే సాంస్కృతిక సంస్థను నడిపారు. ఉవ్వెత్తున లేస్తున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొంటే తను గుంపులో కలిసి పోతానని, గుర్తింపురాదని ఆమె గుర్తించారు. అందుకే తన నాయకత్వంలో సాగేలా తెలంగాణ జాగృతిని ఏర్పాటుచేశారు. తెలంగాణ వచ్చాక ఈ సంస్థకు ప్రభుత్వ అండ దొరిగింది. ప్రపంచంలో తెలంగాణ ప్రజలున్న దేశాలన్నీ తిరిగారు. ఇలా ఆమె తెలంగాణలో ఒక విశిష్టమయిన గుర్తింపు వచ్చింది. ఈ గుర్తింపుతో 2014లో నిజామాబాద్ నుంచి టీఆర్ఎస్ తరఫున లోక్సభకు ఎన్నికయ్యారు. అయితే, ఎంపిగా ఉన్నపుడు ఆమె వ్యాపకాలు ఎటో వెళ్లిపోయాయి. నియోజకవర్గం లో వ్యతిరేకత పెరిగింది. తెలంగాణలో మహిళా నాయకురాలు అంటే కవితయే అని గుర్తింపు వచ్చేందుకు పార్టీలో మరొక పవర్ సెంటర్ ఎదగకుండా కెసిఆర్ క్యాబినెట్ లోకి ఒక్క మహిళను కూడా తీసుకోలేదు. అయినా సరే, 2018లో ఓటమి పాలయ్యారు. అనంతరం రెండు దఫాలు నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా గెలిపించాల్సిన వచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయి, చాలా కాలం తీహార్ జైల్లో ఉండిన తర్వాత ఆమెకు బెయిల్ దక్కింది. లిక్కర్ స్కాం వల్ల కుటుంబంలో కలతలు వచ్చాయి. తండ్రికెసిఆర్, సోదరుడు కెటిఆర్, బావ హరీష్ రావు, మరొక కజిన్ సంతోష్ రావు పార్టీపై బహిరంగ విమర్శలు చేయడం మొదలుపెట్టారు. వాళ్లంతా అవినీతి అన్నారు. దోపిడి అన్నారు. పార్టీని బిజెపికి అమ్ముకునేందుకు కెటిఆర్ ప్రయత్నించారు అన్నారు. ఇది 2025 సెప్టెంబర్ 2న ఆమెను పార్టీ సస్పెండ్ చేసే దాకా వచ్చింది. ఆ మరుసటి రోజే బీఆర్ఎస్ పార్టీకి, శాసన మండలి సభ్యత్వానికి కవిత రాజీనామా చేసి స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు.

ఈ కొత్త TRS ని ప్రజలు ఆదరిస్తారో, లేక చవకబారు రాజకీయంగా తిరస్కరిస్తారా. వేచి చూడాలి.


Read More
Next Story