‘నాటి కేసీఆర్ వేరు.. నేటి కేసీఆర్ వేరు’
x

‘నాటి కేసీఆర్ వేరు.. నేటి కేసీఆర్ వేరు’

కొత్త పార్టీ ప్రకటించిన కవిత, కేసీఆర్‌పై ఘాటు విమర్శలు చేశారు. రాజకీయ మార్పులు, అవినీతి ఆరోపణలు, నేతలపై వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.


తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై దేవునపల్లి కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పూర్తిగా మారిపోయారని ఆమె అన్నారు. తమ పార్టీ ప్రకటన కార్యక్రమంలో మాట్లాడిన కవిత.. నాటి కేసీఆర్ వేరు.. నేటి కేసీఆర్ వేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగానే కేటీఆర్‌కు ఏమీ తెలియదని కూడా చురకలంటించారు. ఆమె వ్యాఖ్యలతో హైదరాబాద్‌లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కొత్త పార్టీ ప్రకటనతో పాటు, కవిత తన తండ్రి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి. ప్రస్తుతం ఆయన పూర్తిగా మారిపోయారని ఆమె ఆరోపించారు.

శనివారం టీఆర్‌ఎస్ పేరుతో కొత్త పార్టీని ప్రకటించిన కవిత, గతంలో ఉన్న కేసీఆర్ ఇప్పుడు లేరని అన్నారు. ఒకప్పుడు ప్రజల కోసం పోరాడిన నాయకుడు, ఇప్పుడు ప్రజల మనిషి కాదని వ్యాఖ్యానించారు. ఆయన చెడు ప్రభావంలో ఉన్నారని, సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదని చెప్పారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఆయన పాలనలో లోపాలు ఉన్నాయని కవిత గుర్తు చేశారు. పేదల ఇళ్లు కూల్చినా స్పందించలేదని అన్నారు.

ఉద్యమ సమయంలో పనిచేసిన కార్యకర్తలకు న్యాయం జరగలేదని చెప్పారు. ఆ సమయంలోనే తాను ప్రశ్నించాల్సిందని, అది తన తప్పుగా భావిస్తున్నానని పేర్కొన్నారు. తాను అవినీతి అంశాలపై మాట్లాడటంతోనే పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు ఆమె చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందని చెప్పడం తప్పేనా అని ప్రశ్నించారు. తప్పు చేయని వారిని బయటకు పంపించి, తప్పు చేసిన వారిని దగ్గర పెట్టుకున్నారని ఆరోపించారు.

ఈ పోరాటం ఇప్పుడే ప్రారంభమైందని, ముందూ కొనసాగుతుందని సూచించారు. ఇక ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పై కూడా కవిత విమర్శలు చేశారు. గురుకులాల్లో పిల్లలు మరణిస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. బీజేపీపై కూడా ఆమె మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటుకు ఆ పార్టీ నిజంగా మద్దతివ్వలేదని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ నేతలు కృషి చేయాలని సవాల్ విసిరారు.

Read More
Next Story