కేసీఆర్‌ను కవిత ఎంత మాటనేశారు !
x

కేసీఆర్‌ను కవిత ఎంత మాటనేశారు !

కేసీఆర్ ప్రస్తుతం మరమనిషి అయియారన్న కవిత. ఆ కుటుంబంలో భాగమైనందుకు బాధపడుతున్నానని ఘాటు వ్యాఖ్యలు.


కేసీఆర్‌ను ఉద్దేశించి కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ రాజకీయ పరిణితి కోల్పోయారని అన్నారు. తనను గెలిపించకపోవడంతో ప్రజలు ఏదో అపరాధం చేశారన్న భావనలోకి ఆయన వెళ్లిపోయారని, ఎక్కడ మాట్లాడిన అదే భావనతో మాట్లాడుతున్నారంటూ కవిత.. కేసీఆర్‌ను విమర్శించారు. శనివారం తన నూతన పార్టీ ‘తెలంగాణ రాష్ట్ర సేన’ను కవిత అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగానే కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఒకానొక సమయంలో రాష్ట్రం, రైతులు, ప్రజలకు అండగా నిలిచిన వ్యక్తి ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదని, కొందరి సావాసాల వల్ల ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారని చురకలంటించారు. ఆనాటి కేసీఆర్ మానవత్వం ఉన్న మనిషి, నాయకుడు అయితే నేటి కేసీఆర్ కేవలం మరమనిషిలా అయిపోయారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

గతంలో ప్రజల కోసం పోరాడిన నాయకుడు ఇప్పుడు మారిపోయారని అన్నారు. ఒకప్పుడు చేనేత కార్మికుల కోసం బిక్షాటన చేసిన వ్యక్తి, ఇప్పుడు ప్రజల సమస్యలకు దూరంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయనలో మార్పు వచ్చిందని కవిత పేర్కొన్నారు. ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు స్పందించడం లేదని విమర్శించారు. పేదల ఇళ్లు కూల్చినా, రైతులు నష్టపోయినా ఆయన కనిపించడం లేదని అన్నారు.

పదేళ్ల అధికారంలో కీలక ప్రాజెక్టులు పూర్తికాలేదని కూడా ఆమె ప్రస్తావించారు. రాష్ట్ర సమస్యల కంటే ఇతర రాష్ట్రాల రాజకీయాలపై దృష్టి పెట్టారని విమర్శించారు. కేంద్రంతో పోరాటం చేయాల్సిన సమయంలో అది జరగలేదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి సమయంలో నాయకత్వం ఎక్కడ ఉందని కవిత ప్రశ్నించారు. ప్రజల బాధలపై స్పందించకపోవడం నాయకత్వానికి తగదని అన్నారు.

ఏమేమి కలలతో తెలంగాణ తెచ్చుకున్నాము ఆ కలలను ఇంకా నిజం కాలేదన్నారు కవిత. అంతేకాకుండా కేసీఆర్ సారథ్యంలో ఆనాటి తెలంగాణ ఉద్యమ రథం ఎక్కడో గాడి తప్పిందని చురకలంటించారు. తెలంగాణ ప్రజల ఆర్తిని అది అర్థం చేసుకోలేకపోయిందని, కచ్ఛితంగా సామాజిక తెలంగాణ రథ చక్రం అనేది విరిగి ముక్కలై పోయిందని వ్యాఖ్యానించారు. ఒక కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ తరహా అయితే పని జరగాలో ఏ తరహా పనులు ప్రారంభించుకోవాలో అవి జరగలేదని విమర్శించారు. ఈ విషయం చెప్పడానికి తాను ఎంతో బాధపడుతున్నానని కవిత అన్నారు.

తెలంగాణ రాష్ట్రం వస్తే మన బానిస సంకెళ్లు పోతాయని అనుకున్నామని, కానీ స్వరాష్ట్రంలోనే రైతుల చేతులకు బేడీలు పడ్డాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఒకరిద్దరు కలిసి మాట్లాడుకోవాలంటే ఎవరు ఫోన్ ఎక్కడ మానిటర్ చేస్తున్నారో అని భయపడ్డారని, కనీస వ్యక్తిగత స్వేచ్ఛ లేదని అన్నారు. దారుణమైనటువంటి నిఘా నీడలో తెలంగాణ బతికిందని చెప్పుకొచ్చారు. ఇది వాస్తవమని, అందులో సందేశం లేదని పేర్కొన్నారు.

ఆనాడు పరిపాలించిన కుటుంబంలో తాను కూడా ఒక భాగమని, కానీ ఆ కుటుంబంలో ఒక భాగమైనందుకు కొన్ని విషయాలకు తాను సిగ్గు పడుతున్నానని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగానే రాష్ట్ర ప్రజలకు ఆమె క్షమాపణలు కూడా చెప్పారు. కానీ తెలంగాణ సాధించినందుకు గర్వపడుతున్నానని, అందులో పాల్గొనడంతో తన జన్మ ధన్యమైందిగా భావిస్తానని చెప్పారు.

Read More
Next Story