Kavitha
x

వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేతపై కవిత గరమ్

ఖమ్మం జిల్లాలో నిర్వాసిత కుటుంబాలను పరామర్శించిన జాగృతి అధ్యక్షురాలు. పునరావాస కేంద్రంలో వసతులపై ఆందోళన వ్యక్తం చేసి ప్రభుత్వం స్పందించాలని డిమాండ్.


ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం ఆమె నిర్వాసిత కుటుంబాలను పరామర్శించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఇళ్ల కూల్చివేతలతో మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల పరీక్షల సమయంలో పుస్తకాలతో సహా రాత్రికి రాత్రే బుల్డోజర్లతో ఇళ్లను కూల్చివేశారని విమర్శించారు.

కొందరు రాజకీయ నాయకులు ఈ ప్రాంతాన్ని చూసి వెళ్లిపోయారని, తాను మాత్రం సమస్య పరిష్కారం కోసం వచ్చినట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు జాగృతి సంస్థతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ, ప్రజా సంఘాలు అండగా ఉంటాయని ఆమె భరోసా ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

ఇళ్లను కూల్చివేసిన తర్వాత బాధితులను ఒకేచోట ఉంచారని, అక్కడ మహిళలకు ప్రత్యేక వసతులు కూడా ఏర్పాటు చేయలేదని కవిత ఆరోపించారు. పునరావాస కేంద్రంలో కనీస సదుపాయాలు లేవని పేర్కొన్నారు. ఆరోగ్య శాఖ అధికారులు కూడా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయలేదని విమర్శించారు.

ఈ పరిస్థితిపై జిల్లా కలెక్టర్ ఇప్పటివరకు అక్కడికి రాలేదని తన దృష్టికి వచ్చిందని తెలిపారు. జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ సమస్యపై స్పందన కనిపించలేదని ప్రశ్నించారు. ఇళ్లు కూల్చివేసిన అదే ప్రదేశంలో కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని జాగృతి తరపున డిమాండ్ చేశారు. వేరే చోటుకు వెళ్లమంటే బాధితులు అంగీకరించరని చెప్పారు.

పేదల ఇళ్లపై మాత్రమే బుల్డోజర్లు నడుస్తున్నాయని, పెద్దవారి భవనాలపై చర్యలు కనిపించడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో పేదల హక్కులు దెబ్బతింటున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వెలుగుమట్ల బాధితుల సమస్య పరిష్కారం కోసం తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

Read More
Next Story