TRS chief Kavitha
x

వడ్లు అమ్మలేక రైతులు విలవిల.. ప్రభుత్వంపై కవిత ఫైర్

ధాన్యం కొనుగోలు, రైతు భరోసా, యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని కల్వకుంట్ల కవిత ఆరోపించారు.


తెలంగాణలో రైతుల పరిస్థితి రోజురోజుకు దీనంగా మారుతోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. పంట వేయడం దగ్గర నుంచి ధాన్యం అమ్ముకునే వరకు అన్నదాతకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఘాటు విమర్శలు గుప్పించారు. ధాన్యం కొనుగోలు నుంచి రైతు భరోసా, యూరియా సరఫరా వరకు ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పెద్దపల్లిలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. బాయిబాట కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో పర్యటించిన సందర్భంగా రైతుల సమస్యలను నేరుగా తెలుసుకున్నట్లు తెలిపారు.

ఈ మూడు జిల్లాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కవిత అన్నారు. ఇప్పటికీ ధాన్యం కొనుగోలు సరిగా జరగడం లేదని, కల్లాల వద్ద రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఓ యువ రైతు తన ధాన్యాన్ని సొంతంగా మిల్లుకు తరలించగా, అక్కడ కొనుగోలు జరగకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనను ప్రస్తావించారు. ధాన్యం కుప్పల వద్దే రైతులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఏర్పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి సమయంలో ప్రభుత్వం రైతుల సమస్యలపై దృష్టి పెట్టకుండా ఇతర అంశాలకే ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు. ఎన్నికల ముందు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు కేవలం ఏడు రకాల వడ్లకే పరిమితం చేసిందని ఆరోపించారు. రైతు భరోసా అమలులో కూడా స్పష్టత లేదని, యాసంగిలో రెండు ఎకరాలకే సాయం అందించారని అన్నారు. యూరియా సరఫరా విషయంలోనూ రైతులు ఇబ్బందులు పడుతున్నారని కవిత పేర్కొన్నారు.

యూరియా యాప్ పేరుతో కొత్త సమస్యలు సృష్టించారని, ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు అవసరమైన సమయంలో ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని, ధాన్యం కొనుగోలు, రైతు భరోసా, యూరియా సరఫరాపై స్పష్టమైన చర్యలు చేపట్టాలని కవిత విజ్ఞప్తి చేశారు.

Read More
Next Story