కేసీఆర్ ప్రభుత్వం కూలడానికి కారణం చెప్పిన కవిత
x

కేసీఆర్ ప్రభుత్వం కూలడానికి కారణం చెప్పిన కవిత

ప్రభుత్వాల పని తీరు, ప్రజల సమస్యలపై కవిత తీవ్ర విమర్శలు చేశారు. హైడ్రా చర్యలు, సీఎం హాజరు అంశాలపై ప్రశ్నలు లేవనెత్తారు.


తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరిగింది. తాజాగా ప్రభుత్వాల పనితీరుపై కవిత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. లెక్కలేనితనం వల్లే గత ప్రభుత్వం కూలిపోయిందని, అదే పరిస్థితి ఇప్పుడు కూడా కనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు. మొదటగా, గత కేసీఆర్ ప్రభుత్వంపై స్పందిస్తూ కవిత లెక్కలు పట్టించుకోకపోవడం వల్లే ఆ ప్రభుత్వం పడిపోయిందని అన్నారు. అదే విధానం ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అనుసరిస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలతో సీఎం అందుబాటులో ఉండటం లేదని కవిత విమర్శించారు. ప్రజావాణి కార్యక్రమానికి సీఎం ఒక్కసారి మాత్రమే హాజరయ్యారని, ప్రజలను కలిసే సమయం కూడా లేదని ఆమె అన్నారు. సచివాలయానికి కూడా సీఎం రావడం లేదని పేర్కొన్నారు. అదే సమయంలో, ముఖ్యమైన సమావేశాలు కమాండ్ కంట్రోల్ రూమ్ లేదా ఎంసీహెచ్‌ఆర్‌డీలో నిర్వహిస్తున్నారని చెప్పారు. అలా చేస్తుంటే సచివాలయం ఎందుకు నిర్మించారని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో సమస్యలు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు.

హైడ్రా చర్యలపై కూడా కవిత తీవ్రంగా స్పందించారు. పేదల ఇళ్లను కూల్చేస్తున్నారని, కానీ మంత్రులు లేదా వారి బంధువుల ఇళ్లకు మాత్రం ఆ చర్యలు చేరడం లేదని విమర్శించారు. బతుకమ్మ కుంట విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. సీఎం స్వయంగా ప్రారంభించిన ఆ ప్రాజెక్ట్‌పై ఇప్పుడు కోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో, దానిని ఎలా కాపాడతారని ఆమె ప్రశ్నించారు. న్యాయం చూసుకోకుండా కూల్చివేతలు చేసి ప్రచారం చేసుకోవాలనే ప్రయత్నం జరుగుతోందని ఆమె అన్నారు.

ఇలాంటి లెక్కలేనితనం కొనసాగితే ప్రభుత్వం కూడా ఇబ్బందులు ఎదుర్కొంటుందని కవిత పేర్కొన్నారు. ఎన్నికలలో ప్రజలు నిర్ణయం తీసుకుంటారని, అప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా తిరిగి పోరాటం చేస్తామని ఆమె తెలిపారు. ఈ సందర్బంగానే కేంద్రం చెప్తున్న గుజరాత్ మోడల్‌పై కూడా కవిత స్పందించారు. గుజరాత్ మోడల్‌ను అనుసరించాల్సిన అవసరం ఉందని వివరించారు.

ఆ విషయంలో గుజరాత్ సూపర్: కవిత

గుజరాత్‌ మోడల్‌ను తెలంగాణలో ఒకే ఒక్క విషయంలో అనుసరించాల్సిన అవసరం ఉందని కవిత అన్నారు. అది ముస్లింలకు రిజర్వేషన్ అంశమని, గుజరాత్‌లో బీసీ-ఈ కేటగిరీ కింద ముస్లింలకు రిజర్వేషన్లు అందిస్తే తెలంగాణలో అది లేదని కవిత అన్నారు. ఆ ఒక్క విషయంలో మాత్రం గుజరాత్ మోడల్‌ను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సందర్భంగానే రేవంత్ ప్రభుత్వం ముస్లింలను అనేక అంశాల్లో మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత. అధికారంలోకి రావడానికి ముందు వరకు ముస్లింలకు నిలిచిపోయిన ఉన్న 4శాతం రిజర్వేషన్లను కేంద్రంతో కొట్లాడి తీసుకొస్తామని కాంగ్రెస్ చెప్పిందని, కానీ అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించిందని అన్నారు.

Read More
Next Story