ఇంటర్ విద్యపై కవిత ఫైర్.. ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలి!
x

ఇంటర్ విద్యపై కవిత ఫైర్.. ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలి!

ఇంటర్మీడియేట్ విద్యను తొలగించే ఆలోచనను కల్వకుంట్ల కవిత వ్యతిరేకించారు. నిర్ణయం మార్చుకునే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.


ఇంటర్మీడియేట్ విద్యను తొలగించే ఆలోచనను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రంగా వ్యతిరేకించారు. ఇంటర్ విద్యను తీసేయొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అసెంబ్లీలో దీనిపై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాంపల్లిలో తెలంగాణ ఇంటర్ విద్య జేఏసీ నిర్వహించిన సేవ్ ఇంటర్ ఎడ్యుకేషన్ సదస్సులో కవిత పాల్గొన్నారు. ఇంటర్మీడియేట్ విద్య ఎంతో బలంగా ఉందని కవిత అన్నారు. దాన్ని తొలగించడం కాకుండా మరింత బలోపేతం చేయాలని సూచించారు. సమస్య లేని వ్యవస్థను సమస్యగా మార్చవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఇంటర్ విద్య వల్లే విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. కార్పొరేట్ విద్యలో కొన్ని లోపాలు ఉండొచ్చని, కానీ ఇంటర్ వ్యవస్థ ద్వారా మంచి ప్రతిభను తయారు చేయగలుగుతున్నామని అన్నారు. ఇంటర్ విద్యను తొలగించే నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని కవిత స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనలపై కూడా కవిత విమర్శలు చేశారు. ఇంజనీరింగ్, ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశ్నించారు.

ఉద్యోగాలు వెతుక్కునే వారిని కాకుండా ఉద్యోగాలు కల్పించే వ్యాపారవేత్తలను తయారు చేయాలని అన్నారు. ఇంటర్ విద్యను కాపాడేందుకు గతంలో మధుసూదన్ రెడ్డి చేసిన పోరాటాన్ని కవిత ప్రస్తావించారు. ఆయనతో కలిసి తాను కూడా ఉద్యమంలో పనిచేశానని చెప్పారు. విద్యా కమిషన్ పనితీరుపైనా కవిత ప్రశ్నలు లేవనెత్తారు. మూడు సంవత్సరాలు గడిచినా మూడు సిఫారసులు మాత్రమే చేశారని విమర్శించారు. ఇంటర్ పాస్ శాతాన్ని 45 శాతానికి పెంచాలన్న సిఫారసును ఆమె తప్పుబట్టారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలు లేకుండా చేయాలన్న ప్రతిపాదనపైనా ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.

ప్రతి విద్యార్థికి ఒక చెక్ పాయింట్ ఉండాలని అన్నారు. కమిషన్ నివేదికను చెత్తబుట్టలో వేస్తానని ముఖ్యమంత్రి చెప్పినప్పుడు, అలాంటి కమిషన్‌ను ఏర్పాటు చేయడం ఎందుకని కవిత ప్రశ్నించారు. ఇప్పుడు మరో కమిషన్ ఏర్పాటు చేస్తే దాని నివేదిక ఎప్పుడు వస్తుందని నిలదీశారు. ఇంటర్మీడియేట్ విద్య దేశంలోనే మంచి వ్యవస్థగా ఉందని కవిత అన్నారు. దాన్ని మార్చకుండా మరింత బలోపేతం చేయాలని కోరారు. ఇంటర్ విద్యను తొలగిస్తే ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందని కవిత పేర్కొన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు కూడా విద్యార్థుల చదువుపై ప్రభావం చూపుతున్నాయని అన్నారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉచిత విద్య, వైద్యం అందించాలని కవిత కోరారు. ఇందుకు రాజకీయ సంకల్పం అవసరమని అన్నారు. ప్రజలపై విద్య, వైద్య ఖర్చుల భారం తగ్గితే వారి జీవితాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.

ఇంటర్ విద్యను తొలగించే నిర్ణయాన్ని ఈ ఏడాదికి వాయిదా వేయడం సరిపోదని కవిత అన్నారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఇంటర్ విద్యను కొనసాగిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకునే వరకు తెలంగాణ రక్షణ సేన తరఫున పోరాటం కొనసాగిస్తామని కవిత స్పష్టం చేశారు.

Read More
Next Story