
KBR ఫార్ములా.. ఫ్లైఓవర్లకు ప్రత్యామ్నాయమా?
కేబీఆర్ పార్క్ మోడల్ ఇప్పుడు నగరానికి ఒక ప్రయోగశాలగా మారింది.
రచ్చ - రాజకీయం @ 5 పి.ఎం.
1) KBR ఫార్ములా.. ఫ్లైఓవర్లకు ప్రత్యామ్నాయమా?
2) బియ్యం బాదుడు.. కిలో రూ.100 ఖాయమేనా?
3) హైదరాబాద్‌లో వాటర్ ఎమర్జెన్సీ? డిసెంబర్‌కే సంక్షోభం తప్పదా?
1) KBR ఫార్ములా.. ఫ్లైఓవర్లకు ప్రత్యామ్నాయమా?
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం అంటే, భారీ ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లేనా? కాదు అంటోంది కేబీఆర్ పార్క్ చుట్టూ అమలు చేసిన ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ మోడల్. సరైన యూ-టర్న్, వన్‌వే, జంక్షన్ రీడిజైన్, సరైన సైన్‌బోర్డులు. ఇలాంటి చిన్న చిన్న ఇంజినీరింగ్ మార్పులతోనే ట్రాఫిక్‌ను వేగంగా, తక్కువ ఖర్చుతో క్రమబద్ధీకరించవచ్చన్న ఆలోచన ఇప్పుడు హైదరాబాద్‌లో కొత్త చర్చకు తెరతీసింది.
కేబీఆర్ పార్క్ చుట్టూ అమలు చేసిన క్లాక్‌వైజ్ వన్‌వే విధానం నేపథ్యంలో.. గతంలో ప్రతిపాదించిన భారీ నిర్మాణ ప్రణాళికలో మార్పులు చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ఆ స్థానంలో సుమారు రూ.1,090 కోట్లతో 6-లేన్ల బై డైరెక్షనల్ ఎలివేటెడ్ స్టీల్ కారిడార్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ప్రభుత్వ వాదన ప్రకారం.. ఈ మార్పులతో భారీగా ఖర్చు తగ్గడంతో పాటు, సుమారు రూ.1,200 కోట్ల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది.
అంటే.. ప్రతి ట్రాఫిక్ సమస్యకు వేల కోట్ల భారీ నిర్మాణాలు చేయకుండా, అవసరమైన చోట సరైన డిజైన్‌తో సమస్యను పరిష్కరించాలన్నది కొత్త ఆలోచన.KBR Park మోడల్ లో, కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్‌ను ఒకే దిశలో మళ్లించడం ద్వారా జంక్షన్లపై ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం జరిగింది. ఇందులో ప్రధానంగా వన్‌వే ట్రాఫిక్, యూ-టర్న్‌ల నిర్వహణ, జంక్షన్ రీడిజైన్, సిగ్నల్ మేనేజ్‌మెంట్, సైన్‌బోర్డుల ఏర్పాటు చేశారు.
అయితే, నిపుణులు ఏమంటున్నారంటే.Central Road Research Institute (CRRI) మాజీ శాస్త్రవేత్త టి. సత్యనారాయణ రెడ్డి అభిప్రాయం ప్రకారం “వన్‌వే ద్వారా ట్రాఫిక్‌ను మళ్లిస్తే.. ట్రాఫిక్ రద్దీ పరిష్కారం కాకుండా పక్క రోడ్లు, జంక్షన్లకు మారే అవకాశం ఉంది.” అందుకే ఒక రోడ్డును మాత్రమే కాకుండా, దానికి కనెక్ట్ అయ్యే మొత్తం రోడ్డు నెట్‌వర్క్‌ను అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
యూ టర్న్ నిజంగా పరిష్కారమా? అంటే, హైదరాబాద్‌లో గతంలో కూడా యూ టర్న్ ఆధారిత ట్రాఫిక్ ప్రయోగాలు జరిగాయి. రోడ్ సేఫ్టీ నిపుణుడు వినోద్ కనుమాల ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. “సిగ్నళ్లను విజయవంతంగా యూ టర్న్ లతో భర్తీ చేయాలంటే, యూ టర్న్ లు ప్రస్తుత జంక్షన్‌కు గరిష్ఠంగా 200 మీటర్ల దూరంలో ఉండాలి.” అంటే, ఎక్కడ పడితే అక్కడ యూ టర్న్ పెడితే సమస్య పరిష్కారం కాదు. ట్రాఫిక్ వాల్యూమ్, రోడ్డు వెడల్పు, జంక్షన్ డిజైన్, వాహనాల కదలిక ఇవన్నీ లెక్కలోకి తీసుకుని యూ టర్న్ ఎక్కడ ఉండాలో నిర్ణయించాలి.
“కె.బి.ఆర్ పార్క్ లో వన్‌వే విధానం పనిచేయడంతో.. ఇదే తరహా స్మార్ట్ ట్రాఫిక్ ఇంజనీరింగ్ ను నగరంలోని ఇతర కీలక జంక్షన్లలోనూ ఉపయోగించే దిశగా జి.హెచ్.ఎం.సి. కసరత్తు చేస్తోంది. ఖజాగూడ, ఉప్పల్, చాంద్రాయణగుట్ట–బండ్లగూడ, మైలార్‌దేవ్‌పల్లి–కాటేదాన్, రెతిబౌలి–నానల్‌నగర్ వంటి ప్రాంతాల్లో జంక్షన్ రీడిజైన్, యూ టర్న్ మేనేజ్‌మెంట్ ప్రత్యామ్నాయ రూట్లతో ట్రాఫిక్ ఫ్లోను మెరుగుపరిచే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. GHMC కమిషనర్ ఆర్. వి. కర్ణన్ చెప్పారు.
అదే సమయంలో నగరవ్యాప్తంగా సుమారు 1,000 కిలోమీటర్ల రోడ్డు నెట్‌వర్క్‌ను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు రూ.3,145 కోట్ల ప్రణాళికను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇక్కడ అసలు టార్గెట్ ఒక్క ఫ్లైఓవర్ కట్టడం కాదు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ట్రాఫిక్ సాఫీగా వెళ్లేలా మొత్తం నెట్‌వర్క్‌ను డిజైన్ చేయడం.
నిపుణులు ఏం చెబుతున్నారంటే, IIT హైదరాబాద్‌కు చెందిన ట్రాన్స్‌పోర్టేషన్ నిపుణుడు డా. దిగ్విజయ్ పవార్ మరో కీలక అంశాన్ని చెప్పారు. “పరిష్కారాలు భారతీయ పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి. ఇతర దేశాల మోడళ్లను యథాతథంగా అనుసరించడం సరైంది కాదు.” హైదరాబాద్ ట్రాఫిక్‌కు హైదరాబాద్ పరిస్థితులకు సరిపోయే డిజైన్ కావాలన్నదే ఆయన అభిప్రాయం.
హైదరాబాద్ ట్రాఫిక్‌కు భవిష్యత్తు భారీ ఫ్లైఓవర్లా? లేక, చిన్న ఖర్చుతో పెద్ద మార్పు తీసుకొచ్చే స్మార్ట్ ట్రాఫిక్ ఇంజనీరింగ్ నా? కేబీఆర్ పార్క్ మోడల్ ఇప్పుడు నగరానికి ఒక ప్రయోగశాలగా మారింది. ఇది నిజంగా నగరవ్యాప్తంగా పనిచేస్తుందా? అది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.
2) బియ్యం బాదుడు.. కిలో రూ.100 ఖాయమేనా?
కిలో రూ.83కి చేరిన సన్నబియ్యం. ఇక సెంచరీ ఖాయమేనా? 3 నెలల క్రితం కిలో రూ.50–55 ఉన్న సన్నబియ్యం.. ఇప్పుడు ఏకంగా రూ.83కి చేరింది. తక్కువ నాణ్యత ఉన్న బియ్యం ధర కూడా కిలో రూ.60 దాటింది. గత మూడు నెలలుగా పెరుగుతున్న ధరలు చూస్తుంటే, బియ్యం ధర రూ.100 మార్క్‌ను దాటుతుందా? అనే ఆందోళన ప్రజల్లో మొదలైంది.
అసలు బియ్యం ధర ఎందుకు పెరుగుతోందంటే, మొదటి కారణం.. ధాన్యం దిగుబడి తగ్గడం. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో వర్షాలు తగ్గడం, దిగుబడులు పడిపోవడం. మరోవైపు యాసంగి సాగు విస్తీర్ణం తగ్గడం వల్ల మార్కెట్లో సన్న రకం ధాన్యానికి కొరత ఏర్పడింది. ఇక తెలంగాణలో పండే సన్న రకం ధాన్యానికి పొరుగు రాష్ట్రాల్లో భారీ డిమాండ్ ఉంది.
కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారులు తెలంగాణలోనే ధాన్యం కొనుగోలు చేసి, బెంగళూరు, ముంబై, చెన్నై వంటి నగరాలకు తరలిస్తున్నారు. దీంతో స్థానిక మార్కెట్లో సన్నధాన్యం లభ్యత తగ్గి, ధరలు పెరుగుతున్నాయి. గతంలో రిటైల్ వ్యాపారులకు అరువుపై బియ్యం ఇచ్చిన కొందరు మిల్లర్లు.. ఇప్పుడు నగదు చెల్లిస్తేనే బియ్యం ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వ్యాపారులు కూడా ధరలను పెంచాల్సి వస్తోందని చెబుతున్నారు.
ఇక విజిలెన్స్ తనిఖీల్లో బయటపడుతున్న అక్రమాలు పరిస్థితిని మరింత తీవ్రం చేస్తున్నాయి. ప్రభుత్వ ధాన్యం మాయం. రేషన్ బియ్యం రీసైక్లింగ్, వంటి అక్రమాలు మార్కెట్లో కృత్రిమ కొరతకు కారణమవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.మరి.. రూ.100 దాటుతుందా అంటే, ఇప్పటికే సన్నబియ్యం కిలో రూ.83కి చేరింది. ధాన్యం లభ్యత పెంచకపోతే.. అక్రమ నిల్వలు, అక్రమ రవాణాపై నియంత్రణ లేకపోతే.. ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ప్రశ్న ఒక్కటే, బియ్యం ధర సెంచరీ కొట్టకముందే, మార్కెట్‌ను నియంత్రించగలదా?
“తెలంగాణలో మొత్తం వరి ఉత్పత్తి దాదాపు 1.87 కోట్ల టన్నుల స్థాయిలో ఉంది. ఇందులో సన్న రకం ధాన్యానికి డిమాండ్ పెరుగుతోంది. 2025–26 వానాకాలంలోనే ప్రభుత్వం 39 లక్షల టన్నులకు పైగా సన్న ధాన్యాన్ని సేకరించింది.”
3) హైదరాబాద్‌లో వాటర్ ఎమర్జెన్సీ? డిసెంబర్‌కే సంక్షోభం తప్పదా?
హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలు ముందుగానే మొదలయ్యే పరిస్థితి కనిపిస్తోందా? ప్రధాన జలాశయాల్లో నీటిమట్టాలు వేగంగా పడిపోతుండటంతో.. డిసెంబర్ నుంచే నగరంలో నీటి ఎద్దడి మొదలయ్యే అవకాశాలపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌కు కీలకమైన నీటి వనరు సింగూర్ జలాశయం. 29.9 టీఎంసీల పూర్తి సామర్థ్యం ఉన్న సింగూర్‌లో ప్రస్తుతం కేవలం 3.9 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అంటే సామర్థ్యంలో దాదాపు 13 శాతం నీరే మిగిలింది. ఇదే పరిస్థితి కొనసాగితే.. మరో 60 రోజుల్లో సింగూర్ పూర్తిగా అడుగంటిపోయే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలా జరిగితే ఐటీ కారిడార్‌తో పాటు నగరంలోని పశ్చిమ ప్రాంతాలపై నీటి సరఫరా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.
సింగూర్ మాత్రమే కాదు, పాతబస్తీ, పరిసర ప్రాంతాలకు కీలకమైన ఉస్మాన్‌సాగర్‌లోనూ నీటిమట్టం తగ్గుతోంది. గతంలో సుమారు 3.5 టీఎంసీలుగా ఉన్న నిల్వ.. ఇప్పుడు 2.2 టీఎంసీలకు పడిపోయింది. ఇక ఇతర ప్రధాన జలాశయాల్లోకి కూడా ఇన్‌ఫ్లోలు తగ్గిపోవడంతో.. నగర తాగునీటి అవసరాలపై ఆందోళన పెరుగుతోంది.
ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు, తక్కువ వర్షపాతం ప్రధాన కారణాలు. రాష్ట్రంలో ఇప్పటికే 17 శాతం వర్షపాతం లోటు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జలాశయాల్లోకి చేరాల్సిన నీరు ఆశించిన స్థాయిలో చేరలేదు.
పరిస్థితిని ముందుగానే గుర్తించిన జలమండలి.. సింగూర్, మంజీరాపై ఆధారపడిన ప్రాంతాలకు ప్రత్యామ్నాయ నీటి వనరులు, సరఫరా మార్గాలను గుర్తించాలని అధికారులను ఆదేశించింది. అత్యవసర కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించింది. అంతేకాదు.. నీటి లభ్యత తగ్గితే వ్యవసాయం కంటే తాగునీటికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గ్రేటర్ పరిధిలో “13.8 లక్షల కనెక్షన్లు వున్నాయి. రోజుకు 560 MGD సరఫరా అవుతోంది. ప్రస్తుతం వున్న డిమాండ్ కు 150 ఎం.జి.డి.ల నీరు తక్కువ సరఫరా అవుతుంది. ఇక సింగూరు నుంచి రావాల్సిన 110 ఎం.జి.డి.లు కూడా తగ్గితే, డిశంబర్ నాటికి కేవలం 300 ఎం.జి.డి.ల నీరు మాత్రమే అందుబాటులో వుంటుంది. మరి డిసెంబర్ నాటికే రానున్న నీటి గండం నుంచి ఎలా బయటపడుతారో పెద్ద ప్రశ్నగా మారింది. మొత్తానికి, సాధారణంగా వేసవిలో కనిపించే నీటి ఎద్దడి, ఈసారి డిసెంబర్ నుంచే మొదలయ్యే పరిస్థితి ఉంది. సింగూర్‌లో మిగిలింది 3.9 టీఎంసీలు. వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోతే, భాగ్యనగరానికి నీటి కష్టాలు ఎంత త్వరగా మొదలవుతాయన్నదే చూడాలి.

