గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణపయ్య!
x

గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణపయ్య!

69 అడుగుల ఖైరతాబాద్ గణపతి ట్యాంక్‌బండ్ వద్ద నిమజ్జనమయ్యారు. భారీ భద్రత మధ్య శోభాయాత్ర సాగగా, బాలాపూర్ లడ్డూ రూ.39 లక్షలకు అమ్ముడైంది.


తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న ఖైరతాబాద్ పంచముఖ సంకటహర మహా గణపతి గంగమ్మ ఒడికి చేరారు. 69 అడుగుల భారీ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్ వద్ద నిమజ్జనం చేశారు. భారీ క్రేన్ సాయంతో నిమజ్జన కార్యక్రమం పూర్తయింది. ఖైరతాబాద్ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర భారీ భక్తజన సందోహం మధ్య సాగింది. టెలిఫోన్ భవన్ మీదుగా గణపతి ముందుకు కదిలారు. ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ వద్ద నిమజ్జనం నిర్వహించారు. గణేశుడిని చూసేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గణపతి ఎదుట నృత్యాలు చేస్తూ వీడ్కోలు పలికారు.

మళ్లీ రావయ్యా గణేశా అంటూ నినాదాలు చేశారు. నిమజ్జనంతో భక్తుల్లో భావోద్వేగ వాతావరణం కనిపించింది. ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం కోసం భారీ భద్రత ఏర్పాటు చేశారు. 20 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. 10 వేల సీసీ కెమెరాలు, 24 డ్రోన్లతో నిఘా పెట్టారు. 100 హైరైజ్ కెమెరాలతో విగ్రహాల లెక్కింపు చేపట్టారు. అదనంగా 8,142 మంది సిబ్బందిని మోహరించారు. 42 ప్లాటూన్లు, 4 ఆర్‌ఏఎఫ్, 2 సీఆర్‌పీఎఫ్ కంపెనీలు విధుల్లో ఉన్నాయి. నాలుగు ప్రాంతాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. 26 షీ-టీమ్స్ మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించాయి.

బాలాపూర్ రికార్డ్ బ్రేక్

మరోవైపు బాలాపూర్ గణేష్ నిమజ్జనం సందర్భంగా లడ్డూ వేలం పాట ఆసక్తికరంగా సాగింది. లడ్డూ వేలం పాట కూడా హోరాహోరీగా సాగింది. చివరకు భారీ స్థాయిలో మొత్తం రూ.39 లక్షలకు లడ్డూను వేలం ముగిసింది. గ్రామంలోని బొడ్రాయి దగ్గర వేలం పాటలో వివిధ ప్రాంతాల వారు పాల్గొన్నారు. పోటీ తీవ్రంగా సాగిన ఈ వేలం పాటలో ఏకంగా 9 మంది కొత్తవారు పాల్గొన్నారు. ఉత్కంఠగా సాగిన ఈ వేలం పాటలో చివరకు సామ ప్రణీత్ రెడ్డి అనే అతను రూ.39 లక్షలకు బాలాపూర్ గణపతి లడ్డూను దక్కించుకున్నారు.

Read More
Next Story