కొండా సురేఖకు ఖర్గే షాక్.. రాజీనామా చేయాలని ఆదేశం
x

కొండా సురేఖకు ఖర్గే షాక్.. రాజీనామా చేయాలని ఆదేశం

మంత్రి కొండా సురేఖ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. రాజీనామా చేయాలని ఖర్గే ఆదేశించినట్లు ప్రచారం. ఆమె తదుపరి నిర్ణయంపై ఉత్కంఠ.


తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ ఎపిసోడ్ కీలక మలుపు తిరిగింది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆదేశించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాజీనామా చేయకపోతే మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశం ఉందన్న చర్చ కూడా నడుస్తోంది. దీంతో ఇప్పుడు కొండా సురేఖ ఏం చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. ఈ వివాదానికి కారణం ఆమె కూతురు కొండా సుశ్మిత చేసిన వ్యాఖ్యలు. సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి సుశ్మిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. దీంతో పార్టీ క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది.

అయితే తన కూతురు చేసిన వ్యాఖ్యలకు తాను ఎందుకు బాధ్యత వహించాలని సురేఖ ప్రశ్నించారు. నోటీసులను వెనక్కి తీసుకోవాలని కూడా కోరారు. దీంతో వ్యవహారం మరింత ముదిరింది. సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలని క్రమశిక్షణ కమిటీ సభ్యులు పార్టీ అధిష్ఠానానికి లేఖ రాశారు. ఈ క్రమంలోనే బుధవారం సురేఖ ఢిల్లీకి వెళ్లారు. పార్టీ పెద్దలను కలిసి తన వాదనను వినిపించారు.

మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌, ఇతర సీనియర్ నేతల అభిప్రాయాలను కూడా అధిష్ఠానం తీసుకున్నట్లు సమాచారం. మంగళ, బుధవారాల్లో ఢిల్లీలో జరిగిన చర్చల తర్వాత సురేఖపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఖర్గే రాజీనామా చేయాలని ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది.

తుది నిర్ణయం అధిష్ఠానందే: రాజగోపాల్ రెడ్డి

ఈ పరిణామాలపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా స్పందించారు. సురేఖ రాజీనామా చేస్తారా? లేక అధిష్ఠానం ఆమెను తొలగిస్తుందా? అన్నది పూర్తిగా కాంగ్రెస్ జాతీయ నాయకత్వం పరిధిలోని అంశమని ఆయన చెప్పారు. సంస్థాన్‌ నారాయణపురం మండలం సర్వేల్‌లో బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం రాజగోపాల్‌రెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం రాజకీయాలు చేయాల్సిన సమయం కాదని చెప్పారు.

సురేఖ వ్యవహారంలో అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికే అందరూ కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. పార్టీ పెద్దల వద్ద ఈ అంశంపై పూర్తి సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు. ఎవరికి ఏ పదవి ఇవ్వాలన్నది కూడా అధిష్ఠానమే నిర్ణయిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయమని స్పష్టం చేశారు.

కొండా వివాదానికి వాటాల్లో తేడానే కారణం: రాజాసింగ్

మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కొండా సురేఖ ఓఎస్డీ అరెస్టు ఘటన నుంచే అసలు వివాదం మొదలైందని ఆయన ఆరోపించారు. డబ్బుల వాటాకు సంబంధించి కమ్యూనికేషన్ గ్యాప్ రావడంతోనే ఈ అంశం ఢిల్లీ వరకు వెళ్లిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి జరుగుతోందని రాజాసింగ్ ఆరోపించారు. డబ్బుల వ్యవహారమే కొండా సురేఖ రాజీనామా అంశం వరకు తీసుకొచ్చిందని ఆయన అన్నారు. అయితే ఇవి రాజాసింగ్ చేసిన ఆరోపణలే.

ఇప్పుడు అందరి దృష్టి కొండా సురేఖ తదుపరి అడుగుపైనే ఉంది. ఆమె మీడియా ముందుకు వచ్చి తన వాదనను వివరిస్తారా? రాజీనామాపై ప్రకటన చేస్తారా? అన్నది ఉత్కంఠగా మారింది. ఈరోజు సాయంత్రంలోగా రాజీనామా ప్రకటన రాకపోతే సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని గవర్నర్‌కు సీఎం లేఖ రాసే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే దీనిపై తుది స్పష్టత రావాల్సి ఉంది. పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయమే ఇప్పుడు కీలకంగా మారింది.

Read More
Next Story