కిడ్నీ చికిత్సకు వెళ్తే.. ప్రాణాలే పోయాయా?
x

కిడ్నీ చికిత్సకు వెళ్తే.. ప్రాణాలే పోయాయా?

మెడికవర్ ఆసుపత్రిలో యువ న్యాయవాది మృతి!


1) కిడ్నీ చికిత్సకు వెళ్తే.. ప్రాణాలే పోయాయా?

2) ట్రాఫిక్ రూల్స్‌కు తూట్లు! రోడ్డుపై మృత్యుఘోష!

3) ఉస్మానియాలో వైద్యం కరువు! రోగుల పాట్లు!

1) కిడ్నీ చికిత్సకు వెళ్తే.. ప్రాణాలే పోయాయా? మెడికవర్ ఆసుపత్రిలో యువ న్యాయవాది మృతి!

కిడ్నీలో రాళ్లకు చికిత్స చేయించుకోవడానికి ఆసుపత్రికి వెళ్లింది. కానీ, తిరిగి ఇంటికి చేరుకోలేకపోయింది. పెళ్లయి కేవలం 40 రోజులే అయింది. జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభించిన 28 ఏళ్ల యువ న్యాయవాది ఐశ్వర్య అనూహ్యంగా మృత్యువాత పడింది. హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు తీవ్ర ఆందోళనకు దారితీసింది.

మల్కాజిగిరికి చెందిన సుధీర్‌కుమార్, గాయత్రీదేవి దంపతుల కుమార్తె ఐశ్వర్య. వయసు 28 ఏళ్లు. ఇటీవల కడుపునొప్పి రావడంతో వైద్యులను సంప్రదించగా కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అక్టోబర్ 7న సికింద్రాబాద్‌లోని మెడికవర్ ఆసుపత్రిలో చేరింది. అదే రోజు శస్త్రచికిత్స నిర్వహించి, మూత్రపిండం నుంచి మూత్రం వెళ్లే మార్గంలో అడ్డుగా ఉన్న రాయిని తొలగించినట్లు ఆసుపత్రి వెల్లడించింది.

అయితే, చికిత్స అనంతరం ఐశ్వర్య ఆరోగ్య పరిస్థితి విషమించింది. రక్తంలో ప్లేట్‌లెట్లు, తెల్ల రక్తకణాల సంఖ్య గణనీయంగా తగ్గడంతో శరీరంలో వాపు ఏర్పడిందని, ఆమెను మెరుగైన పర్యవేక్షణ కోసం ఎంఐసీయూకు తరలించి చికిత్స అందించినట్లు ఆసుపత్రి హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. సీటీ స్కాన్‌లో మెదడులో రక్తస్రావం గుర్తించినట్లు తెలిపింది.

మరోవైపు, వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఐశ్వర్య పరిస్థితి విషమించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేవలం 2 మిల్లీమీటర్ల రాయి కోసం శస్త్రచికిత్స అవసరమా? చికిత్సలో ఎదురయ్యే ప్రమాదాల గురించి ముందుగానే వివరించారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. చికిత్స కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసినా తమ కుమార్తెను కాపాడలేకపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఐశ్వర్య మృతితో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, తోటి న్యాయవాదులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల భద్రతపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఈ ఘటనలో వైద్యుల నిర్లక్ష్యం ఉందా? శస్త్రచికిత్సకు ముందు, తర్వాత ఏం జరిగింది? ఐశ్వర్య ఆరోగ్య పరిస్థితి ఎందుకు విషమించింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు అధికారిక విచారణలో తేలాల్సి ఉంది.


2) ట్రాఫిక్ రూల్స్‌కు తూట్లు! రోడ్డుపై మృత్యుఘోష!

చిన్న‌ నిర్లక్ష్యం, ఒక కుటుంబాన్ని జీవితాంతం విషాదంలోకి నెట్టేస్తుంది. హెల్మెట్ పెట్టుకోకపోవడం, రాంగ్ రూట్‌లో దూసుకెళ్లడం, పరిమితికి మించిన వేగంతో ప్రయాణించడం, మద్యం మత్తులో వాహనం నడపడం ఇవన్నీ చిన్న తప్పులుగా కనిపించవచ్చు. కానీ, రోడ్డుపై ఇవే ప్రాణాలు తీస్తున్నాయి. తెలంగాణలో ట్రాఫిక్ ఉల్లంఘనల గణాంకాలు చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. 2024 నుంచి 2026 ఆగస్టు 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 3 కోట్ల 77 లక్షలకుపైగా ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా హెల్మెట్ ధరించని కేసులే ఉన్నాయి.

1. హెల్మెట్ మొత్తం 3,77,65,997 ట్రాఫిక్ ఉల్లంఘనల్లో దాదాపు 2 కోట్ల 48 లక్షల కేసులు హెల్మెట్ ధరించకపోవడంతో నమోదయ్యాయి. అంటే మొత్తం ఉల్లంఘనల్లో సుమారు 65 శాతం ఇవే. ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ తలకు రక్షణగా నిలుస్తుందని తెలిసినా చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ, ప్రమాద సమయంలో తలకు బలమైన గాయం అయితే ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది.

2. రాంగ్ రూట్ డ్రైవింగ్తక్కువ దూరం ప్రయాణించేందుకు ఎదురుగా వచ్చే వాహనాల మార్గంలోకి దూసుకెళ్తున్నారు. ఇలా రాంగ్ రూట్‌లో ప్రయాణించినందుకు 42.10 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించుకునే అవకాశం లేకపోతే, క్షణాల్లోనే ఘోర ప్రమాదం జరగవచ్చు.

3. అతివేగంవాహనం ఎంత వేగంగా వెళ్తే ప్రమాదం జరిగినప్పుడు దాన్ని అదుపు చేయడం అంత కష్టమవుతుంది. నిర్ణీత వేగ పరిమితులను పట్టించుకోకపోవడంతో 25.28 లక్షలకు పైగా ఓవర్ స్పీడ్ కేసులు నమోదయ్యాయి. వేగం మీద నియంత్రణ లేకపోతే.. ప్రాణాల మీద నియంత్రణ కూడా కోల్పోవాల్సి వస్తుంది.

4. మద్యం మత్తులో డ్రైవింగ్మద్యం సేవించిన తర్వాత వాహనం నడపడం వల్ల నిర్ణయ సామర్థ్యం, స్పందించే వేగం, వాహనంపై నియంత్రణ దెబ్బతింటాయి. అయినా ఈ నిర్లక్ష్యం ఆగడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షలకు పైగా డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి.

5. డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వినియోగంవాహనం నడుపుతున్నప్పుడు ఒక్క క్షణం ఫోన్ వైపు చూసినా ముందున్న రహదారిపై దృష్టి తప్పుతుంది. ఆ కొద్ది క్షణాలే ప్రమాదానికి కారణమవుతాయి. డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వినియోగించినందుకు 7.25 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.

ఈ గణాంకాలు కేవలం చలాన్ల సంఖ్యను మాత్రమే చూపించడం లేదు. రహదారులపై పెరుగుతున్న నిర్లక్ష్యాన్ని కూడా బయటపెడుతున్నాయి. తెలంగాణలో నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా ఏటా సగటున 7,500 మంది ప్రాణాలు కోల్పోతుండగా, 32 వేల మందికిపైగా గాయపడుతున్నట్లు అందించిన గణాంకాలు చెబుతున్నాయి. ప్రమాద బాధితుల్లో 48 శాతం మంది వాహనాలు నడుపుతున్నవారు కాగా, మిగతా 52 శాతం మంది ఇతరుల నిర్లక్ష్యానికి బలవుతున్నారు. అంటే రోడ్డుపై మనం చేసే తప్పు మనకే కాకుండా, ఎలాంటి తప్పూ చేయని మరో వ్యక్తి ప్రాణాలకూ ముప్పుగా మారుతోంది.

సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని హైవేలు, నగర శివారు ప్రాంతాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నవారిలో 18–34 ఏళ్ల యువత ఎక్కువగా ప్రభావితమవుతున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు అధికారులు చెబుతున్నారు. 2024 నుంచి 2026 ఆగస్టు 15 వరకు నమోదైన ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి రూ.1,332.42 కోట్ల జరిమానాలు విధించగా, సుమారు రూ.407 కోట్లే వసూలయ్యాయి. ఇంకా రూ.925 కోట్లకుపైగా బకాయిలు ఉన్నాయి.

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చలాన్ కట్టి బయటపడవచ్చు. కానీ, ప్రమాదంలో ప్రాణం పోతే తిరిగి తీసుకురాలేం. గాయపడితే చికిత్స కోసం కుటుంబం ఆర్థికంగా కుంగిపోవచ్చు. సంపాదించే వ్యక్తిని కోల్పోతే ఆ కుటుంబం భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతుంది.


3) ఉస్మానియాలో వైద్యం కరువు! రోగుల పాట్లు!

ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన జూనియర్ డాక్టర్లు విధులకు హాజరయ్యారు. మంగ‌ళ‌వారం రాత్రి ఆరోగ్య‌శాఖ మంత్రితో జ‌రిగిన స‌మావేశంలో సమస్యలను పరిష్కరించేందుకు 10 రోజుల గడువు కోరుతూ హామీ ఇచ్చారు. అయితే, జూడాలు తమ డిమాండ్లను ఉపసంహరించుకోలేదు. ఆందోళనను తాత్కాలికంగా మాత్రమే నిలిపివేమ‌ని ఉస్మానియా ఆసుప‌త్రి జూడాల అధ్య‌క్షుడు డా. Narahari Chandrakanth Reddy ఫెడ‌ర‌ల్‌తో చెప్పారు.

1. ప్రభుత్వం నుంచి హామీ: ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలు, మందుల కొరత వంటి సమస్యలను 10 రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.

2. రోగులకు వైద్య సేవలు అందించేందుకు: నిరసన కారణంగా నిలిచిపోయిన సాధారణ ఓపీ సేవలు, ముందస్తుగా నిర్ణయించిన ఆపరేషన్లకు అంతరాయం ఏర్పడింది. అత్యవసర సేవలు మాత్రం కొనసాగాయి.

3. ప్రభుత్వానికి గడువు ఇచ్చారు: హామీల అమలును పర్యవేక్షించి, క్షేత్రస్థాయిలో మార్పులు వచ్చాయా లేదా పరిశీలిస్తామని జూడాలు ప్రకటించారు. ఇది సమ్మెకు శాశ్వత ముగింపు కాదని స్పష్టం చేశారు. ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సమస్యలపై వైద్య విద్యార్థులు, ఇంటర్న్లు, పీజీ రెసిడెంట్ డాక్టర్లు నిరసనకు దిగారు.

ఆసుపత్రిలో అవసరమైన మందులు, వైద్య పరికరాల కొరత, కొన్ని కీలక వైద్య విభాగాల సేవల్లో సమస్యలు ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపుల్లో జాప్యం, వైద్య విద్యార్థుల క్లినికల్ శిక్షణకు ఎదురవుతున్న ఇబ్బందులు కూడా నిరసనకు కారణాలుగా చెబుతున్నారు. ఈ పరిణామాలతో ఓపీ సేవలు, గుండె సంబంధిత చికిత్సలకు అవసరమైన క్యాథ్ ల్యాబ్, కార్డియోథొరాసిక్ అండ్ వాస్క్యులర్ సర్జరీ, కంటిన్యూయస్ రీనల్ రీప్లేస్‌మెంట్ థెరపీ సేవలు కొన్ని నెలలుగా పనిచేయడం లేదని నిరసన తెలిపిన వైద్యులు ఆరోపించారు.

యూరాలజీ, న్యూరోసర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాలకు అవసరమైన కొన్ని పరికరాలు, ఆర్థోపెడిక్ ఇంప్లాంట్లు, CT/MRI పరీక్షలకు ఉపయోగించే కాంట్రాస్ట్ మెటీరియల్ కొరత కూడా ఉందని వారు చెప్పారు. ఈ సమస్యలు ఉస్మానియాకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ బోధనా ఆసుపత్రుల్లోనూ ఉన్నాయని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది.

Read More
Next Story