
కొండా సుష్మిత జనసేనలోకి? పవన్ కల్యాణ్‌తో చర్చలు
మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత జనసేనలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ నేతలతో ఆమె చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత జనసేనలో చేరే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన నాయకత్వం ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సుష్మిత ఇప్పటికే జనసేన నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని జనసేన వర్గాలు తెలిపాయి.
ఈ పరిణామానికి ముందు సుష్మిత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేస్తానని కూడా ఆమె ప్రకటించారు. సుష్మిత వ్యాఖ్యలతో ఆమె తల్లి కొండా సురేఖ కూడా ఇబ్బందుల్లో పడ్డారు. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణ కమిటీ సురేఖను వివరణ కోరింది.
తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని, వాటికి తనకు లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని సురేఖ క్రమశిక్షణ కమిటీకి వివరించినట్లు సమాచారం. ఇదే సమయంలో సురేఖపై చర్యలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ కూడా మొదలైంది. ఆమెను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తొలగించే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపించాయి. ఈ పరిణామాల మధ్య సుష్మిత జనసేన నాయకత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలనే ప్రయత్నాల్లో భాగంగా ఆమెను పార్టీలోకి తీసుకోవడంపై జనసేన నాయకత్వం ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. తెలంగాణలో పార్టీ విస్తరణపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల మాట్లాడారు. ఈ నేపథ్యంలో సుష్మిత చేరికపై పార్టీ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించి, కాంగ్రెస్ నుంచి బహిష్కరిస్తే పరిస్థితులు మరింత మారే అవకాశం ఉందని జనసేన నేతలు భావిస్తున్నట్లు సమాచారం.

