తేలని కృష్ణా నీళ్ల లెక్క.. సెప్టెంబర్‌ 4న మరోసారి కీలక భేటీ!
x

తేలని కృష్ణా నీళ్ల లెక్క.. సెప్టెంబర్‌ 4న మరోసారి కీలక భేటీ!


ర‌చ్చ‌ - రాజ‌కీయం @ 5 పి.ఎం.

1) తేలని కృష్ణా నీళ్ల లెక్క.. సెప్టెంబర్‌ 4న మరోసారి కీలక భేటీ!

2) ఆటో సమ్మెకు బ్రేక్‌.. డిమాండ్లకు ప్రభుత్వం ఓకే!

3) మీ పక్కింటి భవనం సేఫేనా? అక్రమ నిర్మాణాలతో మీకూ ముప్పే!

1) తేలని కృష్ణా నీళ్ల లెక్క.. సెప్టెంబర్‌ 4న మరోసారి కీలక భేటీ!

కృష్ణా జలాలపై ఏపీ–తెలంగాణ మధ్య మరోసారి కీలక చర్చ జరిగింది. హైదరాబాద్‌ జలసౌధలో జరిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) త్రిసభ్య కమిటీ సమావేశం ఎలాంటి తుది నిర్ణయం తీసుకోకుండానే వాయిదా పడింది. కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీష్ కుమార్ కాంబోజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ ఈఎన్‌సీ రఘువర్ధన్, ఏపీ ఈఎన్‌సీ నరసింహమూర్తి హాజరయ్యారు.

ఈ భేటీలో ప్రధానంగా శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో ఉన్న నీటి నిల్వలు, తాగునీరు, సాగునీటి అవసరాలు, ఇరు రాష్ట్రాలకు నీటి విడుదల వంటి అంశాలపై చర్చించారు. అయితే, తుది నిర్ణయం ఏదీ తీసుకోకుండా సెప్టెంబర్‌ 4న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.

ఈ సమావేశంలో ముఖ్యంగా రాయలసీమ, పల్నాడు ప్రాంతాల తాగునీటి అవసరాలు చర్చకు వచ్చాయి. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం కృష్ణా జలాలను తాగునీటికే ప్రాధాన్యంగా వినియోగించాలనే సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడే తెలంగాణ కీలక ప్రతిపాదన చేసింది. తాగునీటి అవసరాలకు శ్రీశైలం, నాగార్జునసాగర్ నీటిని 50:50 నిష్పత్తిలో ఇరు రాష్ట్రాలు వినియోగించుకోవాలని తెలంగాణ సూచించింది. అదే సమయంలో, పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీటిని వినియోగిస్తోందని తెలంగాణ అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఏపీ మాత్రం, ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల శాశ్వత నీటి వాటాల అంశం చర్చకు రాలేదని స్పష్టం చేసింది.

ఒక రాష్ట్రానికి ప్రస్తుతం అవసరమైన నీటిని అధికారికంగా కోరుతూ KRMBకి ఇచ్చే అభ్యర్థననే ఇండెంట్ అంటారు. మేలో జరిగిన KRMB సమావేశంలో ఆంధ్రప్రదేశ్ – 10 TMC, తెలంగాణ – 18 TMC నీటిని కోరాయి. అప్పుడు KRMB ఏపీకి 10 TMC, తెలంగాణకు నాగార్జునసాగర్ నుంచి 16 TMC, శ్రీశైలం నుంచి 6 TMC కేటాయించింది. అంటే, అప్పటి చర్చ తక్షణ తాగునీటి అవసరాలపై జరిగింది. కానీ ఇప్పుడు వివాదం నీటి వాటా లెక్కలపైకి మారింది.

ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న లెక్క 70:30. ఆంధ్రప్రదేశ్, అందుబాటులో ఉన్న కృష్ణా జలాల్లో 70 శాతం ఏపీకి, 30 శాతం తెలంగాణకు కేటాయించాలని KRMBని కోరినట్లు సమాచారం. అయితే తెలంగాణ ఈ లెక్కను అంగీకరించడం లేదు. తెలంగాణ వాదన ఒక్కటే. కృష్ణా జలాల్లో తమకు న్యాయమైన వాటా దక్కాలి. మరోవైపు, ప్రస్తుతం ఏపీకి అదనంగా నీరు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలంగాణ చెబుతుండగా, ఏపీ మాత్రం తెలంగాణ వద్ద తగిన నీటి లభ్యత ఉందని వాదిస్తోంది. అంటే, ఒకే నది. కానీ రెండు రాష్ట్రాల లెక్కలు మాత్రం వేర్వేరు.

అయితే కృష్ణా జలాల్లో అసలు ఎవరి వాటా ఎంత? గతంలో రెండు రాష్ట్రాల మధ్య తాత్కాలికంగా అంగీకరించిన లెక్కల ప్రకారం మొత్తం 811 TMC నీటిలో ఆంధ్రప్రదేశ్ 512.04 TMC, తెలంగాణ 298.96 TMC. అంటే దాదాపు 63:37 నిష్పత్తి. అయితే కొన్ని సందర్భాల్లో KRMB 66:34 నిష్పత్తి ఆధారంగా కూడా నీటిని పంపిణీ చేసింది. ఇప్పుడు ఏపీ 70:30 ప్రతిపాదన తీసుకొచ్చింది. కానీ అది తుది చట్టబద్ధ వాటా కాదు. ఎందుకంటే, కృష్ణా జలాల శాశ్వత పంపిణీ అంశం ఇంకా కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్–2 (KWDT-II) పరిధిలోనే ఉంది.

ప్రస్తుతం KRMB సమావేశంలో తుది నిర్ణయం రాకపోయినా, ఒక విషయం మాత్రం స్పష్టమైంది. ఎల్‌నినో పరిస్థితుల్లో కృష్ణా జలాలను తాగునీటికే ప్రాధాన్యంగా వినియోగించాలనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే 50:50 నిష్పత్తి, 70:30 ప్రతిపాదన, పోతిరెడ్డిపాడు ద్వారా నీటి వినియోగం వంటి కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. అందుకే, సెప్టెంబర్‌ 4న మరోసారి KRMB త్రిసభ్య కమిటీ సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో తాగునీటి అవసరాలు, నీటి విడుదలపై మరోసారి చర్చించనున్నారు. మొత్తానికి, ఇది కేవలం టీఎంసీల లెక్క కాదు. రెండు రాష్ట్రాల నీటి హక్కుల లెక్క. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ వరకు, కృష్ణా జలాలపై ఏపీ–తెలంగాణ మధ్య వాటర్ ఫైట్ ఇంకా కొనసాగుతూనే ఉంది.


2) ఆటో సమ్మెకు బ్రేక్‌.. డిమాండ్లకు ప్రభుత్వం ఓకే!

ఆటో కార్మికుల సమ్మెకు తెరపడింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించిందని చెబుతూ... ఆటో కార్మిక సంఘాలు నిరవధిక బంద్‌ను విరమించుకున్నాయి.

సమ్మె విరమించాలని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి స్పందించిన ఆటో కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. అయితే చర్చల్లో కీలకంగా ప్రస్తావనకు వచ్చిన అంశాలు ఏంటి? ఆటో కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమిటి? ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం.

ఆటో కార్మికుల ప్రధాన డిమాండ్లలో ఒకటైన ఆటో చార్జీల పెంపుపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 2012 తర్వాత ఆటో చార్జీలు పెరగలేదని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా... ఎంత పెంచాలనే అంశంపై తగిన నివేదిక తీసుకుని, సంబంధిత జీవో జారీ చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది.

అలాగే ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కూడా ప్రభుత్వం అంగీకరించింది. దీనికి సంబంధించిన విధివిధానాలపై సెప్టెంబర్ 1న కార్మిక శాఖ, రవాణా శాఖ, ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు.

ఇక ఓలా, ఉబెర్ తరహాలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్ తీసుకొచ్చే అంశంపైనా నిర్ణయం తీసుకున్నారు. యాప్ ప్రారంభానికి ఐటీ శాఖ ద్వారా ప్రక్రియ ప్రారంభించనున్నారు.మరోవైపు ఈవీ ఆటోల అంశంపైనా ప్రభుత్వం కీలక స్పష్టత ఇచ్చింది. ఆర్టీసీ తరఫున ఈవీ ఆటోలు కొనుగోలు చేస్తారన్న ప్రచారంలో నిజం లేదని, అది కేవలం దుష్ప్రచారం మాత్రమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

అయితే హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం లక్ష్యంగా పాత డీజిల్, పెట్రోల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వనుంది.హైదరాబాద్ క్యూర్ ఏరియా పరిధిలో పాత ఆటోలను రెట్రోఫిట్మెంట్ ద్వారా ఈవీ ఆటోలుగా మార్చేందుకు రూ.1.50 లక్షల వరకు ప్రభుత్వ సహాయం అందించనున్నట్లు మంత్రి తెలిపారు.

అదే సమయంలో కొత్త ఈవీ ఆటోలు కొనుగోలు చేసేవారికి సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అంటే... పాత ఆటోలను ఎలక్ట్రిక్‌గా మార్చుకోవడంతో పాటు, కొత్త ఈవీ ఆటోలు కొనుగోలు చేసే వారికి కూడా ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వనుంది.ఇక ఆటో కార్మికుల మరో కీలక డిమాండ్... ఎన్నికల్లో ఇచ్చిన రూ.12 వేల ఆర్థిక సహాయం హామీ. ఈ అంశంపై రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, సహచర మంత్రులతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

అలాగే రాపిడో, ఓలా, ఉబెర్ వంటి సంస్థల ద్వారా ద్విచక్ర వాహనాలపై ప్రయాణికులను తరలించే అంశంలో... ఎల్లో ప్లేట్ ఉన్న వాహనాలకే అనుమతి ఇవ్వాలా? అనే అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు.మొత్తంగా చూస్తే... ఆటో చార్జీల పెంపు, సంక్షేమ బోర్డు, ప్రభుత్వ యాప్, ఈవీ ఆటోలకు ఆర్థిక సహాయం, రూ.12 వేల హామీ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో ఆటో కార్మికుల సమ్మె తాత్కాలికంగా విరమించింది.

అయితే ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎప్పుడు అమల్లోకి వస్తాయి? ఆటో చార్జీలు ఎంత పెరుగుతాయి? రూ.12 వేల ఆర్థిక సహాయంపై తుది నిర్ణయం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఆటో కార్మికుల దృష్టి అంతా ఈ అంశాలపైనే ఉంది.


3) మీ పక్కింటి భవనం సేఫేనా? అక్రమ నిర్మాణాలతో మీకూ ముప్పే!

మీరు ఉంటున్న ఇంటి పక్కనే ఓ కొత్త భవనం నిర్మిస్తున్నారు. అది నిజంగా సేఫేనా? ఆ భవనానికి అనుమతులు ఉన్నాయా? నిర్మాణం జరిగిన విధానం నిబంధనలకు అనుగుణంగానే ఉందా? అనుమతి తీసుకున్న అంతస్తుల కంటే ఎక్కువ అంతస్తులు నిర్మిస్తున్నారా? మీ ఇంటి గోడకు, ఆ భవనానికి మధ్య సరైన దూరం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియకుండానే మనం పక్కింట్లో జరుగుతున్న నిర్మాణాలను చూస్తుంటాం. గచ్చిబౌలిలోని కొండాపూర్‌ అంజయ్యనగర్‌లో జరిగిన ఘటన, పక్కింటి భవనం విషయంలో నిర్లక్ష్యం ఎంత పెద్ద ప్రమాదానికి దారితీస్తుందో హెచ్చరించింది. 50 గజాల స్థలంలో నిర్మిస్తున్న ఏడంతస్తుల భవనం కుప్పకూలింది.

శిథిలాలు పక్కనున్న అపార్ట్‌మెంట్‌తో పాటు మరో భవనాన్ని దెబ్బతీశాయి. దాదాపు 25 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక అసలు ప్రశ్న... ఇలాంటి భవనాలను ముందే గుర్తించలేమా? సాధారణ ప్రజలు తమ చుట్టుపక్కల నిర్మాణం సురక్షితమో కాదో ఎలా తెలుసుకోవాలి? అంజయ్యనగర్‌లో కూలిన భవనం విషయంలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆ నిర్మాణానికి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ CMC నుంచి అనుమతి లేదని అధికారులు చెబుతున్నారు. అంటే, కేవలం నిర్మాణ నాణ్యతపైనే కాదు, అసలు ఆ భవనానికి నిర్మాణ అనుమతి ఉందా లేదా? అనే ప్రశ్న కూడా కీలకంగా మారింది. మరో ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, భవనం నిర్మాణం దాదాపు పూర్తయ్యే దశకు చేరుకున్న తర్వాతే కూలిపోయింది. ఇక్కడే పర్యవేక్షణ వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఒక భవనం నిర్మాణం మొదలుపెట్టిన దగ్గర నుంచి, పిల్లర్లు వేయడం, స్లాబులు నిర్మించడం, అంతస్తులు పెంచడం, ఇలా ఒక్కో దశలో నిర్మాణ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అన్నది పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. కానీ అనుమతి లేకుండా ఓ ఏడంతస్తుల నిర్మాణం అంతదూరం వెళ్లిందంటే, అధికారుల పర్యవేక్షణ ఎక్కడ జరిగింది? ఇలాంటి నిర్మాణాలను ముందే గుర్తించే వ్యవస్థ ఎందుకు పనిచేయలేదు?

అక్రమ నిర్మాణం అంటే, అనుమతి లేకుండా నిర్మించిన భవనం మాత్రమే కాదు. అనుమతి తీసుకున్న భవనంలో కూడా నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేస్తే అది ఉల్లంఘన కిందకు రావచ్చు. ఉదాహరణకు...ఒక భవనానికి నాలుగు అంతస్తులకు అనుమతి తీసుకుని, ఆ తర్వాత ఐదో, ఆరో అంతస్తులను అదనంగా నిర్మించడం. భవనానికి చుట్టూ ఉండాల్సిన setback అంటే ఖాళీ స్థలాన్ని వదలకుండా నిర్మించడం. రోడ్డుకు ఉండాల్సిన దూరాన్ని తగ్గించడం. పార్కింగ్ కోసం కేటాయించిన ప్రదేశాన్ని మరో అవసరానికి ఉపయోగించడం. అనుమతించిన building use‌ను మార్చడం.

ఉదాహరణకు, నివాస భవనంగా అనుమతి తీసుకుని వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడం. లేదా, నిర్మాణ అనుమతిలో ఉన్న ప్లాన్‌కు భిన్నంగా గదులు, అంతస్తులు, నిర్మాణ విస్తీర్ణం పెంచడం. ఇవన్నీ కూడా building violationsగా మారవచ్చు. ముఖ్యంగా అదనపు అంతస్తులు, setback ఉల్లంఘనలు కేవలం నిబంధనల సమస్య కాదు. అవి భవనం భద్రత, అగ్నిప్రమాద సమయంలో బయటపడే మార్గాలు, అత్యవసర వాహనాల రాకపోకలు, పక్క భవనాలపై ప్రభావం వంటి అనేక అంశాలతో ముడిపడి ఉంటాయి.

హైదరాబాద్‌లో అనధికార నిర్మాణాల సమస్య చిన్నది కాదు. అధికారుల గుర్తింపు ప్రకారం, GHMC పరిధిలో 1,538, CMC పరిధిలో 800కు పైగా అనధికార నిర్మాణాలను గుర్తించారు. ఈ సంఖ్యలు ఒక్కో భవనం వెనుక ఉన్న ప్రమాదాన్ని పూర్తిగా చెప్పక పోయినా, నగరంలో నిర్మాణ నియంత్రణ ఎంత కీలకమైన అంశమో మాత్రం స్పష్టం చేస్తున్నాయి. ఎందుకంటే ఒక భవనం సమస్య కేవలం ఆ భవనంలో నివసించే కుటుంబాలకే పరిమితం కాదు. అది పక్కనున్న భవనాలను కూడా ప్రభావితం చేయొచ్చు. అంజయ్యనగర్ ఘటనలో ఇదే జరిగింది. ఒక భవనం కూలింది. కానీ దాని ప్రభావం పక్కనున్న కుటుంబాల వరకు వెళ్లింది. ఇప్పుడు అసలు ప్రశ్న, మీ పక్కన నిర్మిస్తున్న భవనం అనుమతులతో ఉందో లేదో మీరు ఎలా తెలుసుకోవాలి?

1. నిర్మాణ అనుమతి ఉందా లేదా అని తెలుసుకోండి. మీరు GHMC లేదా సంబంధిత మున్సిపల్ అధికారులను సంప్రదించి ఆ నిర్మాణానికి సంబంధించిన అనుమతుల వివరాలు తెలుసుకోవచ్చు.

2. అనుమతి తీసుకున్న అంతస్తుల సంఖ్యను గమనించండి. ఉదాహరణకు... గ్రౌండ్ ప్లస్ మూడు అంతస్తులకు అనుమతి ఉన్న భవనంలో అకస్మాత్తుగా మరో రెండు అంతస్తులు నిర్మిస్తున్నారా? అయితే అది సాధారణ విషయం అని భావించకండి.

3. Setback‌ను గమనించండి. భవనం పూర్తిగా సరిహద్దు వరకు వచ్చేసిందా? పక్క భవనానికి అసాధారణంగా దగ్గరగా నిర్మిస్తున్నారా? ఇలాంటి అంశాలు కనిపిస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి.

4. భవనం ఉపయోగం మారుతోందా? ఇల్లు అని నిర్మించి, తర్వాత దాన్ని గోడౌన్‌గా, వాణిజ్య సంస్థగా లేదా మరో భారీ వినియోగానికి మార్చుతున్నారా? అది కూడా పరిశీలించాల్సిన అంశమే.

5. నిర్మాణ సమయంలో కనిపించే ప్రమాద సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. పక్క భవనాల్లో అకస్మాత్తుగా పగుళ్లు రావడం, గోడలు కదలడం, నేలలో అసాధారణ మార్పులు కనిపించడం, నిర్మాణం వల్ల మీ భవనానికి నష్టం కలగడం వంటి పరిస్థితుల్లో వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి.

పక్కింటి భవనం చట్టబద్ధమా కాదా అన్నది తెలుసుకోవడం మాత్రమే కాదు... మీ భవనానికి అది ప్రమాదం కలిగిస్తుందా లేదా అన్నదీ ముఖ్యం. భారీ నిర్మాణం కోసం లోతుగా తవ్వకాలు చేయడం వల్ల పక్క భవనాల foundation‌పై ప్రభావం పడొచ్చు. నిబంధనలకు విరుద్ధంగా అదనపు అంతస్తులు నిర్మిస్తే structural load పెరగొచ్చు.సరైన setback లేకపోతే అత్యవసర పరిస్థితుల్లో రాకపోకలకు ఇబ్బంది కలగొచ్చు. అందుకే... “వాళ్ల భవనం... వాళ్ల సమస్య” అని వదిలేయడం సరైనది కాదు. మీ ఇంటి భద్రతకు సంబంధించిన అంశం అయితే స్పందించడం అవసరం.

అంజయ్యనగర్ ఘటన మనకు ఒక ముఖ్యమైన ప్రశ్నను మిగిల్చింది. ఒక భవనం కూలిపోయిన తర్వాత చర్యలు తీసుకోవడమేనా? లేక నిర్మాణం మొదలైనప్పుడే నిబంధనలు అమలవుతున్నాయా లేదా అని పర్యవేక్షించాలా? అనుమతి లేని భవనం అయితే అది మొదటి ఇటుక పడినప్పుడే గుర్తించాలి. అనుమతి ఉన్న భవనంలో ఉల్లంఘనలు జరిగితే...అవి ఏడంతస్తులకు చేరుకునే వరకు వేచి చూడకూడదు. అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. మీ పక్కింట్లో నిర్మాణం జరుగుతోంది అంటే... అది కేవలం వాళ్ల విషయం కాదు. అది మీ ఇల్లు, మీ కుటుంబం, మీ భద్రతకు కూడా సంబంధించిన విషయం. అందుకే, “మీ పక్కింటి భవనం సేఫేనా?”ఈ ప్రశ్నను భవనం కూలిన తర్వాత కాదు, భవనం నిర్మాణం మొదలైనప్పుడే అడగాలి.

Read More
Next Story