కేసీఆర్ రాజీనామానా? రేవంత్‌కు కేటీఆర్ గట్టి కౌంటర్
x

కేసీఆర్ రాజీనామానా? రేవంత్‌కు కేటీఆర్ గట్టి కౌంటర్

కేసీఆర్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌పై కేటీఆర్ ఫైర్ అయ్యారు. 1000 రోజుల దగా పాలనకు నిరసనగా రేవంత్ ప్రభుత్వాన్నే బర్తరఫ్ చేసే రోజులు వస్తాయని హెచ్చరించారు.


కాంగ్రెస్ నాయకులు తిన్నది అరగక కేసీఆర్ రాజీనామా చేయాలని మాట్లాడుతున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించిన ఆయన, 1000 రోజులైనా హామీలు నెరవేర్చని సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో జరిగిన 'యువ సమరభేరి' సభలో మాట్లాడిన కేటీఆర్, రాబోయే రోజుల్లో రేవంత్ ప్రభుత్వాన్నే బర్తరఫ్ చేసే పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు.

2006లో కూడా ఇదే కరీంనగర్ వేదికగా కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ రాజీనామాను కోరారని కేటీఆర్ గుర్తుచేశారు. ఆ నాడు కరీంనగర్ గడ్డపై కేసీఆర్ రాజీనామా చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని తెలిపారు. ఇప్పుడు కూడా కేసీఆర్‌తో పెట్టుకుంటే రేవంత్ రెడ్డికి అదే పరిస్థితి ఎదురవుతుందని స్పష్టం చేశారు. ఇచ్చిన 420 హామీలను విస్మరించినందుకు కాంగ్రెస్ నాయకులు 420 సార్లు రాజీనామాలు చేయాల్సి ఉంటుందన్నారు.

కరీంనగర్ పోరాటాలకు పురిటిగడ్డ అని, కేసీఆర్ ఇక్కడి నుంచే తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించారని కేటీఆర్ పేర్కొన్నారు. ఉడుకు నెత్తురు ఉన్న యువత పిడికిలి బిగిస్తే పెద్ద పెద్ద ప్రభుత్వాలే కూలిపోతాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కనీసం ఒక దరఖాస్తు రాయడం కూడా రాదని, అక్షర దోషాలు లేకుండా ఏ భాషలోనూ రాయలేరని విమర్శించారు. నిరుద్యోగుల సమస్యలపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని గల్లా పట్టి నిలదీస్తామని తెలిపారు. ఢిల్లీలో యువత కదం తొక్కితే ప్రధాని మోదీ ప్రభుత్వమే వణికిందని, అలాంటిది రేవంత్ రెడ్డి తమకు ఒక లెక్కే కాదని వ్యాఖ్యానించారు.

కష్టపడి సాధించుకున్న రాష్ట్రాన్ని పదేళ్ల పాటు అభివృద్ధి పథంలో నడిపించామని కేటీఆర్ చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు, యూత్ కమిషన్ ఏర్పాటు, ప్రైవేట్ కంపెనీల్లో 75 శాతం రిజర్వేషన్లు, కాలేజీ అమ్మాయిలకు స్కూటీలు, ₹10 లక్షల రుణాలు, ₹4 వేల నిరుద్యోగ భృతి వంటి హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు.

రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా కేవలం లూటీలు చేస్తున్నారని, జాబ్ క్యాలెండర్ స్థానంలో స్కామ్ క్యాలెండర్ నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్బండ వర్గాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, వారి పాలనలో అభివృద్ధి లేక విధ్వంసమే జరుగుతోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో యువత తగిన గుణపాఠం చెబుతుందని పేర్కొన్నారు.

Read More
Next Story