
ఎస్‌ఐఆర్‌పై బీఆర్ఎస్ స్పెషల్ రివిజన్.. కేటీఆర్ కీలక ఆదేశాలు
తలసానికి కీలక బాధ్యతలు. ఓటర్ల నమోదు, దొంగ ఓట్ల గుర్తింపు, బూత్ స్థాయి పనితీరుపై మార్గదర్శకాలు.
తెలంగాణలో కూడా ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) నిర్వహించడానికి జాతీయ ఎన్నికల సంఘం సిద్ధమయింది. ఇప్పటికే ఎస్ఐఆర్ కోసం అధికారులను కూడా సమాయత్తం చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఎస్‌ఐఆర్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పెషల్ రివిజన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియ జరిగే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై పార్టీ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. దొంగ ఓటు ఒక్కటంటే ఒక్కటి కూడా జాబితాలోకి వెళ్లకుండా ప్రతి నాయకుడు చూసుకోవాలని, ఇది పని కాదని బాధ్యత అని అన్నారు కేటీఆర్.
హైదరాబాద్‌లో ఓటర్ల జాబితా సవరణపై కొత్త దిశానిర్దేశాలు వచ్చాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ అంశంపై పార్టీ నేతలకు కీలక సూచనలు ఇచ్చారు. ఈరోజు హైదరాబాద్ జిల్లా నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్‌ఛార్జ్‌లు మరియు సీనియర్ నేతలు పాల్గొన్నారు. సమావేశంలో ప్రధానంగా ఎన్నికల సంఘం చేపట్టిన “స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్” కార్యక్రమంపై చర్చ జరిగింది.
ఈ ప్రక్రియ ప్రతి నియోజకవర్గానికి చాలా ముఖ్యమని కేటీఆర్ తెలిపారు. పార్టీ శ్రేణులు దీనిని సీరియస్‌గా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన చెప్పారు. ఇప్పటికే నమోదైన డబుల్ ఓట్లు, అనుమానాస్పద ఓట్లు గుర్తించి తొలగించాలని సూచించారు. ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నమోదు చేసిన ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.
గత జూబ్లీహిల్స్ ఉపఎన్నికను ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో ఒక అభ్యర్థి ఇంటి వద్దే పెద్ద సంఖ్యలో ఓట్లు నమోదయ్యాయని, ఇతర నియోజకవర్గాల ఓట్లు కూడా ఉండటంతో ఫలితంపై ప్రభావం పడిందని ఆయన వివరించారు. నగరంలో ఒక్క ఓటరు కూడా తన హక్కును కోల్పోకూడదని ఆయన అన్నారు. కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియలో పార్టీ కార్యకర్తలు చురుకుగా పాల్గొనాలని సూచించారు.
హైదరాబాద్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించే బాధ్యతను తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు అప్పగించారు. ఈ సందర్భంగా తలసాని నేతలకు కొన్ని సూచనలు చేశారు. ప్రతి ఎమ్మెల్యే, ఇన్‌ఛార్జ్ ఈ పనిని ప్రాధాన్యతగా తీసుకోవాలని చెప్పారు. బూత్ స్థాయిలో చురుకైన కార్యకర్తలను గుర్తించి, వారిని బూత్ లెవల్ అసిస్టెంట్స్‌గా నియమించాలని సూచించారు. ఆ వివరాలను ప్రభుత్వ సిబ్బందికి, పార్టీ కార్యాలయానికి అందించాలని తెలిపారు.
త్వరలో బూత్ లెవల్ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా చెప్పారు. అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఓటర్ల జాబితా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుందని, అందుకే ఈ ప్రక్రియపై పూర్తి దృష్టి అవసరమని సమావేశంలో స్పష్టం చేశారు.

