క్వశ్చన్ పేపర్ లీకేజీ కేంద్రం చేతగానితనమే: కేటీఆర్
x

క్వశ్చన్ పేపర్ లీకేజీ కేంద్రం చేతగానితనమే: కేటీఆర్

నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు.


ప్రశ్నాపత్రం లీక్ కారణంగా నీట్ పరీక్షనే రద్దు చేయాల్సిన పరిస్థితి రావడం కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న నీట్ పరీక్షను క్వశ్చన్ పేపర్ లీకేజీ ఆరోపణలు అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా మే 3వ తేదీన జరిగిన నీట్ పరీక్షను రద్దు కూడా చేశారు అధికారులు. తాజాగా ఈ అంశంపై స్పందించిన కేటీఆర్.. కేంద్రంపై విమర్శలు గుపప్పించారు. పగలు రాత్రి కష్టపడి చదివిన లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడిందని కేటీఆర్ అన్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడంలో ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు.

2024లో కూడా నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటన వెలుగుచూసినా, అప్పటి ఘటన నుంచి కేంద్రం ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. అదే నిర్లక్ష్యం కారణంగా మళ్లీ ఈ ఘటన పునరావృతమైందన్నారు. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నిర్వహణలో వరుసగా బయటపడుతున్న లోపాలు విద్యార్థులకు శాపంగా మారాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షకు ముందురోజే వందకు పైగా ప్రశ్నలు లీక్ కావడం వ్యవస్థలో ఉన్న తీవ్రమైన లోపాలను బయటపెట్టిందన్నారు.

ఈ ఏడాది దేశవ్యాప్తంగా దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారని, ఇప్పుడు వాళ్లు మరియు వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ ఘటన వెనుక ఎంత పెద్దవాళ్ల హస్తం ఉన్నా వారందరినీ గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. అలాగే పూర్తి నిజాలను ప్రజల ముందుకు తీసుకురావాలని అన్నారు.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, సాధ్యమైనంత త్వరగా మళ్లీ నీట్ పరీక్షను కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించాలని కేటీఆర్ సూచించారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర ప్రభుత్వం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Read More
Next Story