
తెలంగాణ దళితులను కాంగ్రెస్ దగా చేసింది: కేటీఆర్
కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. రైతులు, విద్యార్థులు, ఉద్యోగాలు, శాంతిభద్రతలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారం చేపట్టినప్పటి నుంచి తెలంగాణకు జరిగిన మంచేమీ లేదన్నారు. దళితులను ఈ ప్రభుత్వం దగా చేసిందని విమర్శించారు. అంతేకాకుండా రాష్ట్రాన్ని, ప్రజలను ఈ ప్రభుత్వం నట్టేట ముంచిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న 1000 రోజుల పాలన దినోత్సవాలను ఉద్దేశించి తెలంగాణ భవన్‌లో బుధవారం కేటీఆర్ మాట్లాడారు.
ఈ సందర్భంగానే కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై ఛార్జ్‌షీట్‌ను విడుదల చేశారు. తెలంగాణకు పీడ దినాలు పట్టి 1000 రోజులు అయ్యాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం మీద దరిద్రం దండయాత్రకు వెయ్యి రోజులని చురకలంటించారు. ‘అబద్ధం, అజ్ఞానం, అవినీతి, అరాచకం.. నాలుగు తలలతో బుసకొడుతున్న అనుముల నాగుపాము పాలన ఈ వెయ్యి రోజుల పాలన’’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ సర్కార్‌లో రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, దళితులు, గిరిజనులు తీవ్రంగా నష్టపోయారని కేటీఆర్ ఆరోపించారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని కేటీఆర్ విమర్శించారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ 1000 రోజుల్లో ఎంతో మంది రైతులు చనిపోయారని అన్నారు. రైతు బీమాను కూడా ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరి రైతులకు శాపంగా మారిందని కేటీఆర్ విమర్శించారు. నీళ్లు అడిగిన వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రైతుల ప్రయోజనాలను పట్టించుకోకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు.
నిరుద్యోగులు, ఉద్యోగులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఉద్యోగాలు అడిగిన వారిపై లాఠీలు ప్రయోగిస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీ డ్రైవర్లు హామీలు అమలు కాక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపించారు. విద్యారంగంపైనా కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. విద్యాసంస్థల భూములను ప్రభుత్వం తీసుకుంటోందని ఆరోపించారు. హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ప్రశ్నించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం అడిగే కాలేజీలను ప్రభుత్వం బెదిరిస్తోందని ఆరోపించారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వం దెబ్బతీస్తోందని కేటీఆర్ అన్నారు. స్కిల్ యూనివర్సిటీ, జీవో నంబర్ 97ను అనుసంధానం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని, విద్యార్థులకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని చెప్పారు. పెన్షన్లు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేసిన కేటీఆర్.. వాటిని ఎప్పుడు పెంచుతారని ప్రశ్నించారు.
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపైనా ప్రభుత్వం పిటిషన్లు వేయించిందని ఆరోపించారు. ప్రజలకు పథకాలు అందించకుండా మూసీ ప్రాజెక్టుకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెబుతున్నారని విమర్శించారు. దళితులు, గిరిజనులకు కాంగ్రెస్ పాలనలో అన్యాయం జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పాలన కమిషన్లు, పర్సంటేజీల పాలనగా మారిందని విమర్శించారు. ప్రభుత్వం ఢిల్లీ ముందు మోకరిల్లుతోందంటూ ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు కూడా క్షీణించాయని కేటీఆర్ ఆరోపించారు. పట్టపగలే దోపిడీలు, హత్యలు జరుగుతున్నాయని అన్నారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిన్నదని విమర్శించారు. మెట్రో విస్తరణను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పోక్సో కేసుల విషయంలోనూ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కేటీఆర్ ప్రశ్నలు లేవనెత్తారు. కొందరు నిందితులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆరోపించారు. మరోవైపు ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడంలో ప్రభుత్వం బిజీగా ఉందని విమర్శించారు.
హైదరాబాద్‌లో కొందరు అధికార పార్టీ నేతల కుటుంబ సభ్యులపై ఆరోపణలు వచ్చినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని కేటీఆర్ అన్నారు. సాధారణ ప్రజలపై దాడులు జరిగినా కేసులు నమోదు చేయడం లేదని ఆరోపించారు. బొల్లారం మిలిటరీ స్థావరంపై దాడి ఘటనను కూడా ఆయన ప్రస్తావించారు. రాష్ట్రంలో స్కామ్‌ల జాతర కొనసాగుతోందని కేటీఆర్ ఆరోపించారు. ప్రతి పనిలోనూ అవినీతి జరుగుతోందని విమర్శించారు. ప్రశ్నించే జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారని అన్నారు.
ఇదే సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి తరచూ కేసీఆర్ రాజీనామా గురించి మాట్లాడటాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. కేసీఆర్‌కు రాజీనామాలు కొత్త కాదని అన్నారు. కేసీఆర్ రాజీనామా చేసిన తర్వాతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. కేసీఆర్ లేకపోతే రేవంత్‌రెడ్డికి సీఎం పదవి వచ్చేదా అని ప్రశ్నించారు.

