
తెలంగాణ రైతుల కష్టాలు ఇక రెండేళ్లే: కేటీఆర్
సిరిసిల్లలో వడ్ల కొనుగోలు ఆలస్యం పై కేటీఆర్ స్పందించారు. రైతుల ఇబ్బందులు, మద్దతు ధర, అధికారుల నిర్లక్ష్యం అంశాలు ప్రస్తావించారు.
తెలంగాణ రైతులకు ఇంకో రెండేళ్లు కష్టాలు తప్పవని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, రైతులకు కష్టాలు తీరుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శనివారం సిరిసిల్లలో పర్యటించిన కేటీఆర్.. రైతుల సమస్యలను పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా బద్దెనపల్లిలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అక్కడ రైతులు పడుతున్న అవస్థలు చూసి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రైతు ప్రభుత్వమని రాహుల్ గాంధీ చెప్తున్నారు కానీ, నిజానికి రాష్ట్రంలో ఉన్నది దౌర్భాగ్య ప్రభుత్వం అంటూ విమర్శలు గుప్పించారు. వడ్లను ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. బోనస్‌లు, మద్దతు ధర ఇవ్వాల్సి వస్తుందని రైతులను ఇలా ఇబ్బందులు పెడుతున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నెల రోజులుగా ధాన్యం తీసుకొస్తున్నా ఇప్పటివరకు ఒక్క గింజ కూడా కొనలేదని రైతులు చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. రైస్ మిల్లులు కేటాయించకపోవడం వల్ల కొనుగోలు ప్రక్రియ నిలిచిపోయిందని ఆయన తెలిపారు. ధాన్యం కొంటే మద్దతు ధర, బోనస్ ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం దూరంగా ఉంటోందని విమర్శించారు. దళారులకు అప్పగిస్తే కమీషన్ వస్తుందని భావించి ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. రైతుబంధు ఇస్తామని చెప్పినా అమలు కావడం లేదని కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో అధికారులను అడిగితే కనీసం కొద్ది పరిమాణం కూడా కొనుగోలు జరగలేదని వివరించారు.
అకాల వర్షాలతో రైతులు మరింత ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. తడిసిపోతున్న ధాన్యాన్ని కాపాడేందుకు రైతులు తమ ఖర్చుతో కవర్లు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుత పాలనపై కూడా ఆయన విమర్శలు చేశారు. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్నా, పరిస్థితి అలాంటిదిగా కనిపించడం లేదని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితి చూడలేదని పేర్కొన్నారు. తాను వచ్చిన సమయంలో ఒక్క అధికారి కూడా అందుబాటులో లేడని కేటీఆర్ తెలిపారు. రైతుల ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతులతో కలిసి రోడ్డెక్కుతామని హెచ్చరించారు.

