20 ఏళ్లుగా అమెరికాలో..! ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగిగానే..!
x

20 ఏళ్లుగా అమెరికాలో..! ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగిగానే..!

హైద‌రాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగం... కానీ విధులు మాత్రం అమెరికాలో..!


ర‌చ్చ‌ - రాజ‌కీయం @ 5 పి.ఎం.

1) NEET లీక్‌లపై కేటీఆర్ పంచ్..!"మేకిన్ ఇండియా కాదు... లీకిన్ ఇండియా

2) ఆర్టీసీ విలీనానికి కౌంట్‌డౌన్..! డిసెంబర్ 9న కీలక ప్రకటన?

3) 20 ఏళ్లుగా అమెరికాలో..! ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగిగానే..!

1) NEET లీక్‌లపై కేటీఆర్ పంచ్..!"మేకిన్ ఇండియా కాదు... లీకిన్ ఇండియా

కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "మేకిన్ ఇండియా అడిగితే... లీకిన్ ఇండియా ఇచ్చారు" అంటూ ఎద్దేవా చేశారు. గత 25 రోజులుగా ఢిల్లీలో రాజకీయాలకు అతీతంగా విద్యార్థులు, యువత పోరాడుతున్నారని, వారిపై జరుగుతున్న దాడులు అత్యంత దురదృష్టకరమని అన్నారు. యువత ఆకాంక్షలను ఏ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేయకూడదని కేటీఆర్ హెచ్చరించారు.

దేశ యువత ఆశయాలు ఆకాశాన్ని తాకుతున్నా పాలకులు వాటిని గుర్తించడం లేదు. ''రాజ్యమా ఉలిక్కిపడు... ఈ తరం చావుకు, ఐటీ-ఈడీ దాడులకు భయపడే తరం కాదు" అంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జెన్‌జీని విస్మరిస్తే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు తప్పవు అంటూ నిరసన సభలో మాట్లాడిన కేటీఆర్, "ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి... కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి" అంటూ నినాదాలు చేశారు. ప్రజా ఉద్యమాలకు తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, విద్యార్థుల పోరాటానికి మద్దతు ఇవ్వడం తమ బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు.

ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలు చూసి తన కళ్లలో నీళ్లు తిరిగాయని, "పిల్లలు ప్రధాని పదవి అడగలేదు... వారికి కావాల్సింది న్యాయం మాత్రమే" అని వ్యాఖ్యానించారు. సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్షను ప్రస్తావిస్తూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన ఉద్యమంలాగే ఆయన కూడా ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నారని చెప్పారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో యువతకు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మరిచిపోయారని విమర్శించారు.

ఢిల్లీలో విద్యార్థులు, యువత చేపడుతున్న ఆందోళనలకు మద్దతుగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. తన 50వ జన్మదిన వేడుకలను రద్దు చేసుకున్న కేటీఆర్, నల్లచొక్కా ధరించి నిరసనలో పాల్గొన్నారు.

బీఆర్ఎస్వీ పిలుపుతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత, పార్టీ కార్యకర్తలు ఇందిరాపార్క్‌కు తరలివచ్చారు. NEET ప్రశ్నాపత్రం వరుసగా మూడు సార్లు లీక్ అయినా బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం, అలాగే ఢిల్లీలో నిరసనలు చేపట్టిన విద్యార్థులపై పోలీసులు బలప్రయోగానికి పాల్పడ్డారనే ఆరోపణలను నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నిరసన ద్వారా ఢిల్లీలో పోరాడుతున్న విద్యార్థులకు తెలంగాణ నుంచి సంఘీభావం ప్రకటిస్తున్నామని, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.


2) ఆర్టీసీ విలీనానికి కౌంట్‌డౌన్..! డిసెంబర్ 9న కీలక ప్రకటన?

తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) ఉద్యోగుల చిరకాల డిమాండ్ అయిన ప్రభుత్వంలో విలీనం మరోసారి చర్చనీయాంశమైంది. దాదాపు 43,000 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. ముందుగా గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించి, అనంతరం విలీన ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

విలీన ప్రక్రియలో తొలి అడుగుగా ఆగస్టు మూడో వారంలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణ కోసం లేబర్ జాయింట్ కమిషనర్ సునీతను నోడల్ అధికారిగా ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే వివిధ కార్మిక సంఘాలు డిపోల వారీగా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఎన్నికల్లో గెలిచిన సంఘాన్నే విలీనానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పనలో భాగస్వామ్యం చేస్తామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.

కార్మిక సంఘం ఎన్నికలు పూర్తైన తర్వాత విలీనానికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేసి, డిసెంబర్ 9న ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు చేపట్టిన సమ్మె సందర్భంగా ప్రభుత్వం ముందు 32 డిమాండ్లు ఉంచాయి. ప్రభుత్వంలో విలీనం, గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన జీతభత్యాలు ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి. వీటిలో చాలా వరకు ప్రభుత్వం అమలు చేయగా, ప్రస్తుతం విలీన ప్రక్రియ పూర్తి చేయడంపైనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్ప‌ట్టి నుంచి ఆర్టీసీ కార్మికులు బ‌లంగా కోరుకుంటున్నారు. త‌మ‌ని ప్ర‌భుత్వ ఉద్యోగులుగా గుర్తించాల‌ని. 2019లో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు అక్టోబర్ 5 నుంచి నవంబర్ 25 వరకు 52 రోజులపాటు చారిత్రాత్మక సమ్మె చేపట్టారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, పెండింగ్ బకాయిల చెల్లింపు వంటి ప్రధాన డిమాండ్లతో కార్మిక సంఘాలు ఉద్యమించాయి. అప్పటి ప్రభుత్వం సమ్మెను చట్టవిరుద్ధమని ప్రకటించి, విధులకు హాజరుకావాలని ఆదేశించింది. గడువులోగా విధుల్లో చేరని ఉద్యోగులను స్వీయ తొలగింపు (Self-Dismissal)గా పరిగణిస్తూ కఠిన చర్యలు తీసుకుంది. సమ్మె అనంతరం కార్మిక సంఘాల కార్యకలాపాలపై కూడా పరిమితులు విధించబడ్డాయి.

ఈ సమ్మె సమయంలో ఉద్యోగం కోల్పోతామన్న భయం, ఆర్థిక ఇబ్బందులు, తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా ఆత్మహత్యలు, గుండెపోట్లతో 30 మందికి పైగా ఆర్టీసీ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయినట్లు కార్మిక సంఘాలు తెలిపాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

విలీనంతో ఉద్యోగులకు ప్రయోజనాలేంటి?

విలీనం అమలైతే ఆర్టీసీ ఉద్యోగులు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ పరిధిలో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు, సేవా నిబంధనలు, పింఛన్ వంటి ప్రయోజనాలు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఆర్టీసీ ఉద్యోగుల విలీనంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా సుమారు రూ.3,000 కోట్ల వరకు అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. అయినప్పటికీ, ఉద్యోగుల దీర్ఘకాల డిమాండ్‌ను నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులందరి దృష్టి గుర్తింపు సంఘం ఎన్నికలు, ఆ తర్వాత జరగబోయే ప్రభుత్వ నిర్ణయంపైనే నిలిచింది.


3) 20 ఏళ్లుగా అమెరికాలో..! ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగిగానే..!

హైద‌రాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగం... కానీ విధులు మాత్రం అమెరికాలో..! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో బయటపడిన ఓ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఒక అధికారి దాదాపు 20 ఏళ్లుగా అమెరికాలోనే ఉంటూ, ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగిగా రికార్డుల్లో కొనసాగడం సంచలనంగా మారింది. మరోవైపు మరో శాఖలో 19 నెలలుగా విధులకు హాజరుకాని ఉద్యోగి వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. ఇన్ని సంవత్సరాలు ఉద్యోగులు గైర్హాజరైనా.. శాఖలకు ఎలా తెలియలేదు? ఎవరు పర్యవేక్షించారు? ప్రభుత్వ వ్యవస్థలో ఎక్కడ లోపం జరిగింది? ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి చర్యలకు సిద్ధమవుతోంది?

మొదట రోడ్లు, భవనాల శాఖకు చెందిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సీహెచ్ రవి వ్యవహారాన్ని పరిశీలిస్తే... 2006లో ఆయన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సమయంలో ప్రభుత్వ అనుమతి లేకుండానే అమెరికాకు వెళ్లినట్లు విచారణలో తేలింది. ఆ తర్వాత 2011లో భారత్‌కు తిరిగి వచ్చి కొద్దికాలం విధుల్లో చేరారు. ఇదే సమయంలో పదోన్నతి పొంది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అయ్యారు. అయితే 2012లో మరోసారి అమెరికాకు వెళ్లిపోయారు. ఈసారి కూడా ప్రభుత్వ అనుమతి తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన అమెరికాలోనే ఉంటున్నట్లు సమాచారం.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఇన్ని సంవత్సరాలుగా విధులకు హాజరుకాకపోయినా అధికారిక రికార్డుల్లో మాత్రం ఉద్యోగిగా కొనసాగుతున్నారు.ప్రభుత్వ ఉద్యోగులు విదేశాలకు వెళ్లాలంటే సర్వీస్ రూల్స్ ప్రకారం ముందస్తు అనుమతి తప్పనిసరి. వ్యక్తిగత కారణాలతో లేదా ఇతర అవసరాల కోసం దీర్ఘకాలిక సెలవులు తీసుకునే అవకాశం ఉన్నా... అందుకు ప్రభుత్వ ఆమోదం అవసరం. కానీ సీహెచ్ రవి విషయంలో అలాంటి అనుమతి తీసుకున్న రికార్డులు లేవని అధికారులు గుర్తించారు. అంతేకాదు... శాఖకు సంబంధించిన డిపార్ట్‌మెంటల్ ఎలిజిబుల్ ఎంప్లాయీస్ జాబితాలో కూడా ఆయన పేరు కొనసాగడం మరిన్ని ప్రశ్నలకు దారితీస్తోంది. అంటే ఇన్ని సంవత్సరాలుగా పర్యవేక్షణలో తీవ్రమైన లోపం జరిగినట్టేనా? అనే చర్చ మొదలైంది. అసలు ప్రతి ఏడాది జరిగే సర్వీస్ వెరిఫికేషన్, హాజరు పర్యవేక్షణ వంటి ప్రక్రియలు ఎలా జరిగాయనే అంశంపై కూడా ఇప్పుడు దృష్టి పడింది.

ఇదే సమయంలో మరో శాఖలో కూడా ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. వైద్యారోగ్య శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జీఏ గిరిజ గత 19 నెలలుగా విధులకు గైర్హాజరవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై కూడా శాఖాపరమైన విచారణ ప్రారంభమైంది. ఒకేసారి రెండు శాఖల్లో ఇలాంటి ఘటనలు బయటపడటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. చాలా కాలంగా విధులకు హాజరుకాని ఉద్యోగుల వివరాలను సేకరించాలని అన్ని శాఖలకు సూచనలు వెళ్లే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అవసరమైతే సర్వీస్ రికార్డులను కూడా సమగ్రంగా పరిశీలించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఒక్కటే... ఇన్ని సంవత్సరాలుగా విధులకు హాజరుకాని ఉద్యోగులు అధికారిక రికార్డుల్లో ఎలా కొనసాగారు? సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు? పర్యవేక్షణ వ్యవస్థలో లోపమా? లేక నిర్లక్ష్యమా? అనే అంశాలపై ప్రభుత్వం సమాధానాలు వెతుకుతోంది. ప్రస్తుతం రెండు కేసుల్లోనూ శాఖాపరమైన విచారణలు కొనసాగుతున్నాయి. విచారణలో నిబంధనల ఉల్లంఘన నిర్ధారణ అయితే సస్పెన్షన్ నుంచి ఉద్యోగం తొలగింపు వరకు చర్యలు ఉంటాయి. ఈ ఘటనలు ప్రభుత్వ శాఖల్లో హాజరు పర్యవేక్షణ, సర్వీస్ రికార్డుల నిర్వహణ, బాధ్యతాయుతమైన పరిపాలనపై మరోసారి పెద్ద చర్చకు తెరలేపాయి. ఈ వ్యవహారంపై మీ అభిప్రాయం ఏమిటి? ఇలాంటి కేసుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు భావిస్తున్నారు? కామెంట్ చేయండి.

Read More
Next Story