
పత్తి సాగులో కొత్త ట్రెండ్.. హెచ్‌టీబీటీ వైపు రైతులు!
కలుపు తొలగింపు ఖర్చులు, కూలీల కొరతతో తెలంగాణలో అనుమతి లేని హెచ్‌టీబీటీ పత్తి సాగు పెరుగుతున్నట్లు అధ్యయనం వెల్లడించింది.
పత్తి సాగులో కలుపు తీయడం రైతులకు భారంగా మారుతోంది. కూలీల కొరత, పెరుగుతున్న ఖర్చులు రైతులను ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో అనుమతి లేని హెచ్‌టీబీటీ పత్తి సాగు పెరుగుతున్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. 2025–26 పత్తి సీజన్‌లో రాష్ట్రంలో 5.5 లక్షల నుంచి 6.1 లక్షల హెక్టార్ల వరకు హెచ్‌టీబీటీ పత్తి సాగైనట్లు అంచనా వేసింది. ఇది రాష్ట్ర పత్తి సాగు విస్తీర్ణంలో 27 నుంచి 30 శాతం. దేశవ్యాప్తంగా ఈ రకం పత్తి 26.2 లక్షల నుంచి 29 లక్షల హెక్టార్లలో సాగైనట్లు అధ్యయనం పేర్కొంది.
రైతులపై కలుపు తొలగింపు ఖర్చులు ఎంత భారం మోపుతున్నాయో గణాంకాలు చెబుతున్నాయి. సాధారణ పద్ధతిలో ఎకరాకు కలుపు తీయడానికి రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చవుతోంది. అదే గ్లైఫోసేట్ ఆధారిత కలుపు మందుల వినియోగానికి రూ.750 నుంచి రూ.850 మాత్రమే ఖర్చవుతున్నట్లు అధ్యయనం అంచనా వేసింది. ఈ వ్యత్యాసం, కూలీల కొరత కలిసి రైతులను హెచ్‌టీబీటీ విత్తనాల వైపు ఆకర్షిస్తున్నాయని తెలిపింది.
హెచ్‌టీబీటీ పత్తిలో ఉండే సీపీ4-ఈపీఎస్‌పీఎస్ జన్యువు వల్ల పత్తి మొక్కలు గ్లైఫోసేట్ ఆధారిత కలుపు మందులను తట్టుకోగలవు. అందువల్ల పత్తి మొక్కలకు పెద్దగా హాని కలగకుండా కలుపును నియంత్రించవచ్చు. అయితే, ఈ రకం పత్తి వాణిజ్య సాగుకు భారత్‌లో ఇంకా అనుమతి లేదు. పర్యావరణం, నేల ఆరోగ్యంపై ప్రభావాలుంటాయనే ఆందోళనలతో అనధికార విత్తనాల విక్రయాలు, సాగును అడ్డుకోవాలని కేంద్రం గతంలో రాష్ట్రాలకు సూచించింది.
సౌత్ ఏషియా బయోటెక్నాలజీ సెంటర్.. ఫెడరేషన్ ఆఫ్ సీడ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా, నేషనల్ సీడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో ఈ అధ్యయనం చేపట్టింది. నాలుగు రాష్ట్రాల్లోని 16 జిల్లాల్లో రైతుల అభిప్రాయాలు, విత్తన సరఫరా వ్యవస్థ, పత్తి నమూనాలను పరిశీలించింది. అధ్యయనం ప్రకారం, 2025–26లో దేశంలో అనధికార హెచ్‌టీబీటీ విత్తనాల మార్కెట్ విలువ రూ.820 కోట్ల నుంచి రూ.880 కోట్ల వరకు ఉంది. మరోవైపు, కలుపు నియంత్రణకు మెరుగైన మార్గాలు అందించేందుకు ఈ సాంకేతికతకు అనుమతి ఇవ్వాలని విత్తన పరిశ్రమ సంఘాలు కోరుతున్నాయి.

