తెలంగాణలో వివాదాస్పదమవుతున్న భూ సేకరణ
బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటి పేరుతో చేసిన భూ సేకరణ, రేవంత్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పేరుతో చేస్తున్న భూసేకరణను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు
పారిశ్రామిక అవసరాల పేరుతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న భూ సేకరణ వివాదాస్పదమవుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటి పేరుతో చేసిన భూ సేకరణ, రేవంత్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పేరుతో చేస్తున్న భూసేకరణను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఫ్యూచర్ సిటీ, డేటాసెంటర్ల అవసరాల కోసం రేవంత్ ప్రభుత్వం 27,500 ఎకరాలను సేకరించాలని డిసైడ్ అయ్యింది. టీజీఐఐసీ పేరుతో చేయబోతున్న సేకరణలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాల్లోనే మెజారిటి భూములు ఉండబోతున్నాయి.
కేసీఆర్ హయాంలో జరిగిన భూసేకరణకు వ్యతిరేకంగా చాలామంది రైతులు కోర్టుల్లో కేసులు వేశారు. ఇపుడు రేవంత్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు మరికొందరు రైతులు కోర్టుల్లో కేసులు వేయటంతో భూసేకరణ మొత్తం వివాదాస్పదమవుతోంది. 27,500 ఎకరాలను సేకరించాలని టీజీఐఐసీ టార్గెట్ గా అవసరమైన భూమి కోసం టీజీఐఐసీ రెవిన్యుశాఖకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి తమ దగ్గర ఇప్పటికే ఉన్న 8 వేల ఎకరాలకు అదనంగా 27,500 ఎకరాలు అవసరమని రెవిన్యుశాఖకు పంపిన ప్రతిపాదనల్లో టీజీఐఐసీ స్పష్టంగా చెప్పింది.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో భూములు కోట్ల రూపాయలు ఖరీదు పలుకుతున్నా ఈప్రాంతాల్లోనే భూములుకావాలని పారిశ్రామికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. ఐటి, ఫార్మా, ప్లాస్టిక్, డేటాసెంటర్లు, విదేశీ యూనివర్సిటీలకు చెందిన క్యాంపస్ ల ఏర్పాటుకు అధిక డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. తరతరాలుగా వస్తున్న తమ భూమిని వదులుకోవటానికి రైతులు అంగీకరించకపోవటంతోనే భూసేకరణ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది.

