కనకగిరిలో చిరుతల కదలికలు:వైరల్ అవుతున్న వీడియోలు
x
కనకగిరి అడవుల్లో చిరుతపులులు (ఫొటో : ఎక్స్ పోస్టు/ ఖమ్మం డిఎఫ్ఓ)

కనకగిరిలో చిరుతల కదలికలు:వైరల్ అవుతున్న వీడియోలు

పిల్లలతో చిరుత దర్శనం… కనకగిరి అడవుల జీవ వైవిధ్యం వెల్లడి


ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిధిలోని కనకగిరి అడవులు మరోసారి వన్యప్రాణుల సంచారంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. అటవీశాఖ ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్‌లలో రెండు చిరుతపులులతో పాటు పలు వన్యప్రాణులు చిక్కిన దృశ్యాలు వెలుగుచూశాయి. పచ్చని చెట్లు, కొండలు, సరస్సులతో నిండి ఉన్న ఈ అడవులు జీవవైవిధ్యానికి నిలయంగా మారుతున్నట్టు ఈ కెమెరా ట్రాప్ వీడియోల ఫుటేజ్ స్పష్టంగా తెలియజేస్తోంది.

కెమెరా ట్రాప్ చిత్రాలు వెలుగులోకి...

కనకగిరి అడవుల్లో రెండు చిరుత పులులతో పాటు పలు వన్యప్రాణుల సంచారం అటవీశాఖ కెమెరా ట్రాప్ చిత్రాలు, వీడియోలు వెలుగుచూశాయి. ఖమ్మం ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని సత్తుపల్లి ప్రాంత పులిగుండాల కనకగిరి అడవుల్లో ఎకో టూరిజం, సఫారీ యాత్రలను ఏప్రిల్ నెల 15వతేదీన తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఖమ్మం జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ప్రారంభించారు. పచ్చని చెట్లు, సరస్సులు, కొండలు, గుట్టలతో అలరారుతున్న కనకగిరి అడవుల్లో ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్‌లలో ఒక చిరుతపులులు, జింకలు, సాంబార్ జింకల సమూహాన్ని బంధించాయి.కెమెరా ట్రాప్‌లలో చిరుతపులులు తాము వేటాడిన జంతువులను భక్షిస్తూ కనిపించాయి.
తాజాగా విడుదలైన ఫుటేజ్‌లో ఆ రెండు జంతువులు ఒక వన్యప్రాణి కళేబరం దగ్గర కనిపించాయి.

వన్యప్రాణులకు నిలయం

దట్టమైన కనకగిరి అడవులు పక్షులతో పాటు పలు వన్యప్రాణుల జీవవైవిధ్యానికి, ఆరోగ్యకరమైన పర్యావరణానికి ఒక అత్యంత సానుకూల సూచికగా నిలిచింది. కనకగిరి అడవిలో రెండు చిరుతపులులు కనిపించాయి. చిరుతలు కనిపించిన వీడియో ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కనకగిరి అడవిని చిరుతపులి నివాసంగా మార్చుకుందని అటవీశాఖ అధికారులు గుర్తించారు.ఒక చిరుతపులి తన పిల్లలతో ఉన్న క్లిప్‌ను అటవీ శాఖ కొన్ని వారాల క్రితం విడుదల చేశారు. వన్యప్రాణుల పర్యవేక్షణలో భాగంగా అటవీ శాఖ ఈ ప్రాంతమంతటా ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసింది.
సత్తుపల్లి అటవీ డివిజన్ పరిధిలోకి వచ్చే, తల్లాడ, కల్లూరు, చంద్రోగొండ, పెనుబల్లి మండలాల్లోని పులి గుండాల పర్యావరణ పర్యాటక జోన్‌లో ఈ చిరుతపులులు కనిపించాయి.

పర్యావరణ పరిరక్షణకు శుభ సూచిక

కనకగిరిలో చిరుతపులుల జాడలు కనిపించడం ఒక ప్రోత్సాహకరమైన సంకేతమని సత్తుపల్లి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ చెప్పారు. మానవ మనుగడకు అడవులు, వన్యప్రాణులను సంరక్షించడం అత్యవసరం అని ఆయన పేర్కొన్నారు.కనకగిరి అడవుల్లో చిరుతపులుల జాడలు కనిపించడం పర్యావరణ పరిరక్షణకు ఒక శుభ సూచికగా అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అడవుల్లో సహజ జీవవ్యవస్థ బలోపేతం అవుతున్నదానికి ఇది నిదర్శనమని, వన్యప్రాణులను సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు ప్రకృతి సంపదను కాపాడవచ్చని వారు స్పష్టం చేస్తున్నారు. ఎకో టూరిజం అభివృద్ధి చెందుతున్న ఈ నేపథ్యంలో, ప్రకృతి సమతుల్యతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతగా మారింది.
Read More
Next Story