ఒకప్పుడు మందుపాతరల పేలుళ్లు, ఎన్‌కౌంటర్లు, బంద్‌లు, మావోయిస్టుల దాడులతో వణికిపోయిన తెలంగాణ నేడు ప్రశాంతతకు ప్రతీకగా నిలిచింది. దశాబ్దాల పాటు కొనసాగిన వ్యూహాత్మక పోలీసింగ్, గ్రేహౌండ్స్ సాహసోపేత ఆపరేషన్లు, పటిష్ఠ నిఘా వ్యవస్థ, లొంగుబాటు–పునరావాస విధానాల ఫలితంగా రాష్ట్రం దాదాపు పూర్తిగా మావోయిస్టు రహితంగా మారింది. రక్తచరిత్రకు ముగింపు పలికి భద్రత, అభివృద్ధి దిశగా తెలంగాణ సాధించిన ఈ ప్రయాణం దేశానికి ఆదర్శంగా నిలిచింది.నాటి భీతావహ పరిస్థితుల నుంచి నేటి ప్రశాంత వాతావరణం వైపు తెలంగాణ సాధించిన ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు చోటుచేసుకున్నాయి.
సరిహద్దుల దిగ్బంధంతో మావోయిస్టులకు అడ్డుకట్ట
తెలంగాణలో పట్టు కోల్పోయిన మావోయిస్టులు పక్క రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్ లోని బస్తర్, దండకారణ్యం అడవులను సురక్షిత స్థావరాలుగా మార్చుకున్నారు.తెలంగాణ పోలీసులు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల వెంబడి జాయింట్ ఆపరేషన్లు నిర్వహించడం, భారీగా సాయుధ అవుట్‌పోస్టులను ఏర్పాటు చేసి,మావోయిస్టులు తిరిగి తెలంగాణలోకి ప్రవేశించకుండా పూర్తిగా అడ్డుకట్ట వేశారు.పోలీసుల ఇన్ఫార్మర్ వ్యవస్థ, సాంకేతికత,ఆధునిక సాంకేతికత, డ్రోన్ల వినియోగం, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్స్ , శాటిలైట్ ఫోన్ల ట్రాకింగ్ ద్వారా మావోయిస్టుల కదలికలను పోలీసులు ముందే పసిగట్టగలిగారు.అంతర్గత సమాచారాన్ని సేకరించే పోలీసు ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ అత్యంత పటిష్టంగా మారడంతో మావోయిస్టులు ఆత్మరక్షణలో పడ్డారు.
నిలచిన మావోయిస్టు రిక్రూట్‌మెంట్
గతంలో మావోయిస్టులకు ప్రజాదరణ ఉండటంతో అడవుల్లోకి వెళ్లి దళాల్లో చేరే యువత సంఖ్య ఎక్కువగా ఉండేది. కానీ కాలక్రమేణా ప్రభుత్వాలు చేపట్టిన విద్యా, ఉపాధి అవకాశాల వల్ల మావోయిస్టు సిద్ధాంతాల వైపు ఆకర్షితులయ్యే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది.దీంతో మావోయిస్టు రిక్రూట్‌మెంట్ దెబ్బతింది.గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలైన రోడ్లు, కరెంట్, కమ్యూనికేషన్ టవర్లు నిర్మాణంతో మావోయిస్టులకు, ప్రజలకు మధ్య ఉన్న దూరం పెరిగింది.
గ్రేహౌండ్స్ కీలక పాత్ర
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టుల అణచివేతలో,రాష్ట్రాన్ని నక్సల్స్ రహితంగా మార్చడంలో పలువురు పోలీస్ ఉన్నతాధికారులు వ్యూహాలు రచించి,నక్సలిజం నిర్మూలనలో కీలక పాత్ర పోషించారు. ఐపీఎస్ అధికారి కె.ఎస్.వ్యాస్ అడవుల్లో నక్సలైట్లను ఏరిపారేయడానికి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గ్రేహౌండ్స్ ప్రత్యేక బలగాలకు రూపకల్పన చేశారు. గెరిల్లా యుద్ధతంత్రంలో పోలీసులకు శిక్షణ ఇచ్చి, మావోయిస్టుల సామ్రాజ్యాన్ని గట్టి దెబ్బతీశారు. 1993లో మావోయిస్టుల చేతిలో వ్యాస్ హత్యకు గురయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారులు శివశంకర్, హెచ్ జె దొర, ఎస్ఏ హుడా ఇంటెలిజెన్స్, స్సెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB)ను బలోపేతం చేశారు. నక్సలైట్ల అంతర్గత నెట్‌వర్క్‌ను టెక్నాలజీ , పక్కా ఇన్ఫార్మర్ల వ్యవస్థతో ఛేదించడంలో వీరు కీలక పాత్ర పోషించారు.డి.టి. నాయక్, ఉమేష్ చంద్రలు క్షేత్రస్థాయిలో మావోయిస్టులకు సింహస్వప్నంగా మారారు. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఎస్పీగా పనిచేసిన ఉమేష్ చంద్ర ప్రజల్లోకి వెళ్లి నక్సలైట్ల పట్ల ఉన్న సానుభూతిని తగ్గించి, పోలీసులపై నమ్మకం పెంచారు. ఆయన ధైర్యసాహసాలు మావోయిస్టుల రిక్రూట్‌మెంట్‌ను భారీగా తగ్గించింది.
తెలంగాణ పోలీసు అధికారులకు అమిత్ షా సత్కారం (ఫొటో : ఎక్స్ పోస్టు తెలంగాణ డీజీపీ)
నలుగురు పోలీసు అధికారులకు అమిత్ షా ప్రశంసలు
తెలంగాణను నక్సల్స్ రహిత రాష్ట్రంగా మార్చడానికి కృషి చేసిన నలుగురు పోలీసు ఉన్నతాధికారులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రశంసించారు. తెలంగాణ ప్రస్థుత డీజీపీ సి.వి.ఆనంద్,రాష్ట్ర భద్రతా సలహాదారు బి శివధర్ రెడ్డి,గ్రేహౌండ్స్ డీజీపీ అనిల్ కుమార్, స్సెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఐజీ బి సుమతిలను కేంద్రమంత్రి అభినందించి సన్మానించారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల గుండా మావోయిస్టులు మళ్లీ తెలంగాణలోకి రాకుండా సరిహద్దు భద్రతను డీజీపీ సీవీ ఆనంద్ పటిష్ఠం చేశారు. బి.శివధర్ రెడ్డి డీజీపీగా ఉన్నపుడు అగ్రశ్రేణి మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యులు హింసను వీడి పోలీసుల ముందు లొంగిపోయారు. అనిల్ కుమార్ క్షేత్రస్థాయిలో గ్రేహౌండ్స్ దళాలను నడిపిస్తూ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని దట్టమైన అడవుల్లో మావోయిస్టుల కదలికలను అణచివేసిన ఆపరేషనల్ కమాండర్.మావోయిస్టుల కదలికలపై ముందస్తు సమాచారాన్ని సేకరించడంలో ఐజీ సుమతి ఆధ్వర్యంలోని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అత్యంత కీలక పాత్ర పోషించింది.
మావోయిస్టుల పరిస్థితిపై డీజీపీ సమీక్ష
తెలంగాణలో మావోయిస్టుల పరిస్థితిని డీజీపీ సీవీ ఆనంద్ సమీక్షించారు. హైదరాబాద్‌లోని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కార్యాలయంలో ఎస్ఐబీ చేపడుతున్న తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు నిఘా సంబంధిత చర్యలను అంచనా వేశారు.వామపక్ష తీవ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలోనూ, అజ్ఞాతంలో ఉన్నమావోయిస్టు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో లొంగిపోయేలా చేయడంలోనూ ఎస్ఐబీ అధికారులుచేస్తున్న నిరంతర కృషిని డీజీపీ అభినందించారు.తెలంగాణలో మొత్తం 820 మంది అజ్ఞాత మావోయిస్టు కార్యకర్తలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో కేంద్ర కమిటీ సభ్యులు - 4, రాష్ట్ర కమిటీ సభ్యులు - 22, ప్రాంతీయ కమిటీ సభ్యులు - 1, డివిజనల్ కమిటీ సభ్యులు - 45, ఏరియా కమిటీ సభ్యులు - 173 వంటి సీనియర్ స్థాయి కార్యకర్తలు కూడా ఉన్నారు.ఈ లొంగుబాట్ల ప్రక్రియలో భాగంగా అజ్ఞాత కార్యకర్తలు మొత్తం 334 తుపాకులను కూడా అప్పగించారు.లొంగిపోయిన మావోయిస్టులకు కల్పిస్తున్న పునరావాస చర్యలను కూడా డీజీపీ సమీక్షించారు.
మావోయిస్టుల పరిస్థితిపై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష (ఫొటో ఎక్స్ పోస్టు తెలంగాణ డీజీపీ)
నక్సలిజం కోరల నుంచి విముక్తి
ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో మిగిలి ఉన్న అగ్రనేతల్లో అత్యధికులు వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.కొత్త తరం నాయకులు రాకపోవడం, ఉన్న కీలక నేతలు వరుసగా ఎన్‌కౌంటర్లలో మరణించడం లేదా లొంగిపోవడంతో మావోయిస్టు సంస్థ అంతర్గతంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. గ్రేహౌండ్స్ దళాల పటిష్ఠత, నిఘా వర్గాల వ్యూహాలు ,లొంగుబాటు విధానాలు తెలంగాణను నక్సలిజం కోరల నుంచి విముక్తం చేసి, దేశంలోనే సురక్షితమైన రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణను నిలిపాయి. కేంద్ర హోం మంత్రిత్వశాఖ చేపట్టిన ఆపరేషన్ కగార్ మావోయిస్టులకు ఎండ్ కార్డు వేసింది.
ఒకప్పుడు నక్సలిజం ప్రభావంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన తెలంగాణ, నేడు అదే స్థాయిలో శాంతి–భద్రతలతో ఆదర్శ రాష్ట్రంగా నిలవడం విశేషం. పోలీసు బలగాల త్యాగాలు, ఆధునిక సాంకేతికత వినియోగం, ప్రభుత్వాల సమగ్ర వ్యూహం కలిసి సాధించిన ఈ విజయం తెలంగాణ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలిచిపోనుంది.