తెలంగాణ 12 జిల్లాల్లో నేడు తేలికపాటి వర్షాలు: ఎల్లో అలెర్ట్ జారీ
x
తెలంగాణలో ఐఎండీ విడుదల చేసిన వర్షపాతం చిత్రపటం

తెలంగాణ 12 జిల్లాల్లో నేడు తేలికపాటి వర్షాలు: ఎల్లో అలెర్ట్ జారీ

నైరుతి రుతుపవనాల ఆగమనం..తగ్గిన ఉష్ణోగ్రతలు...


తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్న ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని డైరెక్టర్ తెలిపారు. తేలిక వర్షంతోపాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఆమె పేర్కొన్నారు. తెలంగాణలోని 12 జిల్లాల్లో శుక్రవారం ఎల్లో అలెర్ట్ జారీ చేశామని ఆమె వివరించారు.

మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ వర్షాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రానున్న నాలుగు రోజుల్లో క్రమంగా రెండు నుంచి నాలుగు డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు అంచనా వేశారు.

నైరుతి రుతుపవనాల విస్తరణ

నైరుతి రుతుపవనాలు నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, పశ్చిమ-మధ్య, తూర్పు-మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ దీవులు పూర్తిగా, కేరళ , మాహే, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడు, కొమొరిన్ ప్రాంతంలోని మిగిలిన భాగాలు, ఆగ్నేయ బంగాళాఖాతం,నైరుతి, పశ్చిమ-మధ్య, తూర్పు-మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు విస్తరించాయని ఐఎండీ అధికారులు చెప్పారు. రాగల 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గోవా అంతటా, మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన భాగాలు, నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ-మధ్య, తూర్పు-మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, అలాగే ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలలోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్న తెలిపారు.సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో మరఠ్వాడా ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం నుంచి కొంకణ్ గోవా మీదుగా నైరుతి అరేబియా సముద్రం వరకు ఒక ద్రోణి కొనసాగుతోందన్నారు.
Read More
Next Story