CECపై నిరసన.. శివాజీ పార్క్‌లో పోలీసుల అనుమతి లేకుండానే భారీ ఆందోళన
x

CECపై నిరసన.. శివాజీ పార్క్‌లో పోలీసుల అనుమతి లేకుండానే భారీ ఆందోళన

CEC జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ముంబై శివాజీ పార్క్‌లో భారీ నిరసన చేపట్టారు. ఢిల్లీలోనూ ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Click the Play button to hear this message in audio format

భారత ప్రధాన ఎన్నికల అధికారి (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసనలు ఉధృతమయ్యాయి. ముంబైలోని శివాజీ పార్క్‌లో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిర్వహించిన ఆందోళనకు వేలాది మంది తరలివచ్చారు. పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ / నిరసనకారులు భారీగా అక్కడికి చేరుకున్నారు. సీజేపీ కన్వీనర్ అభిజీత్ దీప్కే కూడా నిరసనకారులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. ఈ నిరసన నేపథ్యంలో శివాజీ పార్క్ పరిసరాల్లో పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు.

ఇక ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కూడా సీఈసీకి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగాయి. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ.. అంటే SIRలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ నిరసనకారులు ఆందోళన చేపట్టారు. ఓటర్లను పెద్ద సంఖ్యలో జాబితాల నుంచి తొలగించారన్న ఆరోపణలపై సీఈసీ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఎన్నికల నిర్వహణపై కూడా నిరసనకారులు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. జంతర్ మంతర్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్‌తో పాటు సంజీవ్ ఝా, అతిషి తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌ను నార్త్ అవెన్యూ వద్దే అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు.

శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చినప్పటికీ తనను, సంజీవ్ ఝాను అదుపులోకి తీసుకున్నారని సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. అయినా ఆందోళనను కొనసాగించాలని పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులకు ఆయన పిలుపునిచ్చారు.

మరోవైపు జంతర్ మంతర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థి సంఘాల కార్యకర్తలను కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఎస్ఎఫ్ఐకి చెందిన వందలాది మంది అశోకా రోడ్ వైపు నుంచి రావడంతో వారిని మార్గమధ్యంలోనే నిలిపివేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. జంతర్ మంతర్, దాని పరిసరాల్లో కలిపి సుమారు 500 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు.

అయితే అంతకుముందు ఈ సంఖ్య సుమారు 150గా చెప్పినట్లు అధికారులు పేర్కొన్నారు. AISA, SFI, NSUI, DYFI తదితర విద్యార్థి, యువజన సంఘాల కార్యకర్తలు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని SFI ప్రధాన కార్యదర్శి ఐషే ఘోష్ తెలిపారు. నిరసనలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను దెబ్బతీయడమేనని విమర్శించారు. కొన్ని ప్రాంతాల్లో నిరసనకారులు బారికేడ్లను దాటి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన దృశ్యాలు కనిపించాయి. దీంతో జంతర్ మంతర్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

మరోవైపు నిరసనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఆంక్షలు విధించారు. భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని సెక్షన్ 163 కింద ముందస్తు లిఖితపూర్వక అనుమతి లేకుండా బహిరంగ సమావేశాలు, ఊరేగింపులు, ప్రదర్శనలు, ధర్నాలను నిషేధించారు. జంతర్ మంతర్, పార్లమెంట్ స్ట్రీట్, అశోకా రోడ్ తదితర ప్రాంతాల వైపు వెళ్లకుండా ప్రయాణికులకు ట్రాఫిక్ పోలీసులు సూచనలు చేశారు.

పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. దీంతో కన్నాట్ ప్లేస్, పటేల్ చౌక్, జీపీఓ, టాల్‌స్టాయ్ మార్గ్ పరిసరాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిరసన ప్రదేశం చుట్టుపక్కల భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

ఇలా సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ముంబైలో సీజేపీ ఆందోళన.. ఢిల్లీలో రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల నిరసనలతో ఈ అంశం మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే SIRపై వస్తున్న ఆరోపణలను ఎన్నికల సంఘం ఏ విధంగా వివరిస్తుంది? నిరసనకారుల డిమాండ్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Read More
Next Story