బెంగాల్‌లో వికసించిన కమలం.. బీజేపీ సంబరాలు
x

బెంగాల్‌లో వికసించిన కమలం.. బీజేపీ సంబరాలు

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఆధిక్యంతో రాష్ట్రంలో సంబరాలు. నేతలు ఇండియా కూటమిపై విమర్శలు గుప్పించారు.


పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ముందంజలో నిలవడంతో “బెంగాల్‌లో కమలం వికసించింది” అనే నినాదాలతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయం వద్ద కార్యకర్తలు బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నికల ధోరణులు బీజేపీకి అనుకూలంగా ఉండటంతో నేతలు కూడా ఉత్సాహంగా స్పందించారు.

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు మాట్లాడుతూ, తాజా ఫలితాలు ఇండియా కూటమికి ప్రజలు ఇచ్చిన గట్టి సమాధానమని పేర్కొన్నారు. ఈ ఫలితాలు చూస్తే తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రావడం స్పష్టమవుతోందని అన్నారు. గతంలో 33 ఏళ్ల కమ్యూనిస్టుల పాలన, 15 ఏళ్ల తృణమూల్ పాలన ఉన్న బెంగాల్‌లో ఇప్పుడు బీజేపీ విజయం సాధించడం చారిత్రాత్మకమని ఆయన అభిప్రాయపడ్డారు. అస్సాంలో మూడోసారి బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ప్రజలు అవినీతి రహిత పాలనకు మద్దతు ఇచ్చిన సంకేతమని చెప్పారు.

ఉత్తరాది, దక్షిణాది మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నించిన ఇండియా కూటమికి ప్రజలు తగిన సమాధానం ఇచ్చారని రామచందర్‌రావు వ్యాఖ్యానించారు. తమిళనాడులో డీఎంకే పార్టీ పరిస్థితి కూడా బలహీనంగా మారుతోందని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా బెంగాల్ ఫలితాలపై స్పందించారు. అక్కడ జరిగిన అరాచకాలకు ప్రజలు ముగింపు పలికారని చెప్పారు. చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకునే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. దేశం మొత్తం బీజేపీ వైపు చూస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

అలాగే కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు చేస్తూ, సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ ప్రచారం చేసినా కాంగ్రెస్ ఓడిపోతోందని ఎద్దేవా చేశారు. కేరళలో కాంగ్రెస్‌కు వచ్చిన ఆధిక్యం కూడా అక్కడి ప్రభుత్వ వ్యతిరేకత వల్లేనని పేర్కొన్నారు.

Read More
Next Story