
మరోసారి పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర
రూ. 29 పెంచిన కేంద్రం, మూడు నెలలో రెండోసారి రేట్లు పెంచిన చమురు సంస్థలు
పెరిగిన చమురు ధరలతో ఇప్పటికే సామాన్యులు సతమతం అవుతుండగా తాజా వంటగ్యాస్ ధరలు సైతం పెరిగాయి. కేంద్రం ఎల్పీజీ ధరను రూ. 29 పెంచింది. మూడు నెలలో ఇలా పెంచడం ఇది రెండోసారి. ఇప్పటికే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర దాదాపు మూడు వేలకు పైగా పెంచిన చమురు సంస్థలు, గ్యాస్ ఆధారిత వాహనాలు(సీఎన్జీ) ధరను సైతం విపరీతంగా పెంచిన సంగతి తెలిసిందే.
పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ఢిల్లీలో 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర జూన్ 7 నుంచి రూ. 913 నుంచి రూ. 942కు పెరగనుంది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న సంఘర్షణ ప్రపంచ ఇంధన సరఫరాలకు అంతరాయం కలిగించి, అంతర్జాతీయ ఇంధన ధరలను పెంచిన నేపథ్యంలో మార్చి 7న సిలిండర్‌కు రూ. 60 పెంచిన తర్వాత ఈ పెంపు చోటుచేసుకుంది. దేశీయ ఎల్పీజీ అమ్మకాలపై వచ్చిన నష్టాలను ఈ పెంపు పాక్షికంగా మాత్రమే భర్తీ చేసిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. తాజా సవరణకు ముందు, ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అమ్మిన ప్రతి ఎల్పీజీ సిలిండర్‌పై సుమారు రూ. 703 నష్టపోతున్నాయని అంచనా వేసినట్లు ఆ వర్గాలు తెలిపాయి.
ఇంధన ధరల పెంపుల పరంపరలో భాగంగానే ఈ ఎల్పీజీ ధరల పెంపు చోటుచేసుకుంది. మే మధ్య నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు మొత్తం రూ. 7.50 పెంచగా, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) ధరలు కిలోకు సుమారు రూ. 6 పెరిగాయి. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ఇటీవలి పెరుగుదలలు ఉన్నప్పటికీ, చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్‌లను వాటి ఉత్పత్తి వ్యయం కంటే తక్కువకే విక్రయిస్తున్నాయి. దీనివల్ల పెట్రోల్‌పై లీటరుకు సుమారు రూ. 11, డీజిల్‌పై లీటరుకు రూ. 33.6 నష్టాలు వస్తున్నాయి.
ప్రపంచ ముడి చమురు, ఇంధన మార్కెట్లు అస్థిరంగా ఉన్నందున, ప్రభుత్వం ఇప్పటివరకు పెరిగిన అంతర్జాతీయ ఇంధన ధరల భారాన్ని పూర్తిగా వినియోగదారులకు బదిలీ చేయకుండా, ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్ల ద్వారా ఆ పెరుగుదలలో కొంత భాగాన్ని భరిస్తోంది.
Next Story

