Mahesh Kumar Goud
x

దానం వ్యవహారం.. ఖైరతాబాద్‌పై కాంగ్రెస్ ధీమా!

దానం నాగేందర్ వ్యవహారంపై కోర్టు తీర్పును కాంగ్రెస్ స్వాగతిస్తోందని మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. ఖైరతాబాద్‌పై కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేశారు.


దానం నాగేందర్ వ్యవహారంలో కోర్టు తీర్పుపై టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ స్పందించారు. తీర్పును కాంగ్రెస్ స్వాగతిస్తోందని తెలిపారు. దానం నాగేందర్ విషయంలో వచ్చిన తీర్పు బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌కు గట్టి ఎదురుదెబ్బ అని ఆయన వ్యాఖ్యానించారు. దిల్లీ పర్యటనలో ఉన్న మహేశ్‌కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం కాంగ్రెస్‌దేనని ధీమా వ్యక్తం చేశారు.

పార్టీ ఫిరాయింపులపై విమర్శలు

పార్టీ ఫిరాయింపుల సంస్కృతిని కేసీఆర్ తీసుకొచ్చారని మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. టీడీపీలో గెలిచిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, కాంగ్రెస్‌లో గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేర్చుకుని మంత్రులను చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వాలను పడగొట్టడం, పార్టీలను చీల్చడం వంటి రాజకీయాలను బీజేపీ చేసిందని ఆయన విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను బీజేపీ దెబ్బతీస్తోందని ఆరోపించారు.

ఉపఎన్నికల్లో గెలుపుపై ధీమా

రాష్ట్రంలో ఎలాంటి ఉపఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని మహేశ్‌కుమార్ గౌడ్ విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. గతంలో జరిగిన రెండు ఉపఎన్నికలు, స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో నాయకులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని పీసీసీ చీఫ్ తెలిపారు. అయితే ఆ స్వేచ్ఛ పార్టీ హద్దులు దాటకూడదని స్పష్టం చేశారు. పార్టీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ఇప్పటికే జి. చిన్నారెడ్డి, కొండా సురేఖతో మాట్లాడినట్లు వెల్లడించారు. కొండా సురేఖకు కొత్త పదవి ఇస్తారన్న ప్రచారంపై కూడా స్పందించారు. అలాంటి సమాచారం తన వద్ద లేదని స్పష్టం చేశారు.

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక

రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వేగంగా సాగుతోందని మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇచ్చే నివేదిక ఆధారంగా అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ అధిష్టానానికి పంపుతామని చెప్పారు. ఆశావహుల్లో ఎక్కువ మంది యువకులు ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి పాల్గొన్న అధికారిక కార్యక్రమానికి కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హాజరుకావడం శుభపరిణామమని మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

Read More
Next Story