
వరంగల్ ఎయిర్‌పోర్టుకు టెండర్ బిగ్ అప్‌డేట్!
వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి రూ.213.59 కోట్లతో ఏఏఐ టెండర్లు పిలిచింది. నవంబర్‌లో ప్రక్రియ పూర్తి చేసి డిసెంబర్‌లో శంకుస్థాపనకు సన్నాహాలు.
వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి మరో కీలక అడుగు పడింది. రూ.213.59 కోట్ల విలువైన నిర్మాణ పనులకు ఏఏఐ టెండర్లు పిలిచింది. నవంబర్‌లో టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని షెడ్యూల్ ఖరారైంది. డిసెంబర్‌లో శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. మామునూరు ఎయిర్‌పోర్టు పనులను మూడు ప్యాకేజీలుగా చేపట్టనున్నారు. ఇందులో 953 ఎకరాల ప్రాంగణానికి ప్రహరీ నిర్మాణం ఒక ప్యాకేజీగా ఉంది. మరో ప్యాకేజీలో రన్‌వే, పార్కింగ్, సీవరేజ్ పనులు ఉన్నాయి.
చివరి ప్యాకేజీలో కీలక నిర్మాణాలు చేపట్టనున్నారు. డొమెస్టిక్ టెర్మినల్ భవనం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, ఫైర్ స్టేషన్, విద్యుత్ సబ్‌స్టేషన్ వంటి పనులు ఇందులో ఉన్నాయి. ఈ ప్యాకేజీ అంచనా వ్యయం రూ.213.59 కోట్లు. తాజా టెండర్ షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 28న ప్రీ-బిడ్ సమావేశం జరగనుంది. అక్టోబర్ 6 నుంచి బిడ్ల దాఖలు ప్రారంభమవుతాయి. నవంబర్ 3 వరకు బిడ్లను స్వీకరిస్తారు. నవంబర్ 9న సాంకేతిక బిడ్లను పరిశీలిస్తారు. నవంబర్ 30న ఫైనాన్షియల్ బిడ్లను ఖరారు చేయనున్నారు.
ఇదే సమయంలో వరంగల్ ఎయిర్‌పోర్టుకు పేరు సూచించాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను కోరారు. ప్రజా ప్రభుత్వం కృషితో మామునూరు ఎయిర్‌పోర్టు కల సాకారం అవుతోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ కోసం రూ.295 కోట్లు కేటాయించిందని, అవసరమైన భూమిని సేకరించి ఏఏఐకి అప్పగించిందని తెలిపారు. మామునూరు ఎయిర్‌పోర్టు కేవలం విమాన ప్రయాణాలకే పరిమితం కాదని సీఎం పేర్కొన్నారు.
పరిశ్రమలు, పర్యాటకం, విద్య, ఉద్యోగాలు, పెట్టుబడులకు ఇది కొత్త అవకాశాలను తెస్తుందని అన్నారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు ఇది కొత్త గుర్తింపుగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం టెండర్ ప్రక్రియ కీలక దశలో ఉంది. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ప్రక్రియ పూర్తయితే డిసెంబర్‌లో శంకుస్థాపనకు మార్గం సుగమం కానుంది. దీంతో మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణంపై వరంగల్ ప్రజల్లో ఆసక్తి మరింత పెరిగింది.

