కౌలు రైతుల గుర్తింపు కోసం ఉద్యమిస్తామంటున్న ప్రజా సంఘాలు, మేధావులు
x

కౌలు రైతుల గుర్తింపు కోసం ఉద్యమిస్తామంటున్న ప్రజా సంఘాలు, మేధావులు

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో చేసిన వాగ్దానం ప్రకారం 2011 భూ అధీకృత సాగుదారుల చట్టం అమలు చేయాలంటున్న సంఘాలు


తెలంగాణలో కౌలు రైతులను గుర్తిస్తామని, పథకాలన్నీ వారికి వర్తింపజేస్తామని ఎన్నికలలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని రైతు స్వరాజ్య వేదిక ఇతర ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. 2011 భూ అధీకృత సాగుదారుల చట్టాన్ని మే నెల నుండి అమలు చేయాలని వాళ్ళు కోరారు.

ఈ డిమాండ్ ల సాధనకై “తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ” పేరుతో ప్రజా సంఘాలు, మేధావులు ఉమ్మడి పోరాట కార్యాచరణను నేడు జరిగిన రౌండ్ టేబల్ సమావేశంలో రూపొందించారు. దీనికి ప్రముఖ ఆర్థిక వేత్త, జయతీ ఘోష్ కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ డి.నరసింహా రెడ్డి అధ్యక్షత వహిస్తారు. తమ ఉమ్మడి కార్యాచరణలో భాగంగా గ్రామ స్థాయిలో కౌలు రైతులతో సమావేశాలు, కౌలు రైతుల సమస్యల పై సర్వే, వాళ్ళను విస్తృతంగా గ్రూపులుగా జోడించడం, జిల్లా స్థాయిలో సాధన కమిటీ తరఫున సమావేశాలు, మీడియా చర్చలు, రాష్ట్ర ప్రభుత్వం పై వత్తిడి తెచ్చే రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించారు.

తెలంగాణలో 22 లక్షలకు పైగా ఉన్న కౌలు రైతులు, మొత్తం అన్న దాతలలో 36 శాతం - ఉన్నారని, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు అందక అత్యంత దుస్థితిలో అప్పులలో కూరుకుపోతున్నారని, రైతు ఆత్మహత్యలలో 80 శాతం కౌలు రైతులవేనని, దీనికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని సమావేశంలో పాల్గొన్న వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

2011 భూ అధీకృత సాగుదారుల చట్టం ప్రకారం కౌలు రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించి, గ్రామ సభల ద్వారా నిర్ధారణ చేసి గుర్తింపు కార్డులు (ఎల్.ఈ.సి.) ఇచ్చి అన్ని పథకాలకు, పంట ఋణాలకు అర్హత కల్పించే బాధ్యత ప్రభుత్వం మీద ఉందని సమావేశంలో వక్తలు పేర్కొన్నారు. బ్యాంకర్ల కమిటీ ద్వారా నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చి ఎల్.ఈ.సి. కార్డు ఆధారంగా పంట రుణాలు, ప్రస్తుత రబీ సీజన్లో పంట అమ్ముకోజూస్తున్న కౌలు రైతులని స్థానిక అధికారులు ధృవీకరించి వాళ్ళ అకౌంటులో డబ్బులు పడే విధంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని వాళ్ళు కోరారు.

కౌలు రైతులను గుర్తించి వారికి అన్ని పథకాలను అందించినప్పుడే తెలంగాణ రైతాంగం పరిస్థితి మెరుగుపడుతుందని, దీని కోసం ఉమ్మడి పోరాటం చేసి ప్రభుత్వం పై వత్తిడి తీసుకు వస్తామని ప్రకటించారు.

సమావేశంలో వివిధ జిల్లాల నుండి క్షేత్ర స్థాయి కార్యకర్తలు, కౌలు రైతులు పాల్గొని వారి సమస్యలను వివరించారు. యూరియా పంపిణీ నుంచి, వివిధ సబ్సిడీ పథకాలు, పంట నష్టపోతే నష్టపరిహారం, చివరికి పంట అమ్మకం వద్ద కూడా భూమి పట్టా పాస్ పుస్తకం, పట్టాదారు హాజరు అవసరం కావడంతో కౌలు రైతులు నష్టపోతున్న విధానాలను వివరించారు.

సమావేశంలో పాల్గొన్న ముఖ్యులు: ప్రొ. హరగోపాల్, ప్రొ. కోదండరామ్, జస్టిస్ చంద్రకుమార్, కొండవీటి సత్యవతి (భూమిక), పి.శంకర్ (దళిత బహుజన ఫ్రంట్), ప్రొ. అరిబండి ప్రసాదరావు (తెలంగాణ రైతు సంఘం), అంబటి నాగయ్య (తెలంగాణ విద్యావంతుల వేదిక), రవిచందర్ (తెలంగాణ పీపుల్స్ JAC), మీరా సంఘమిత్ర (NAPM), ఎం. ఆంజనేయులు (సోషల్ డెమోక్రటిక్ ఫోరం), సోమిడి శ్రీనివాస్ (తెలంగాణ రైతు సంఘం), జక్కుల వెంకటయ్య (తెలంగాణ రైతాంగ సమితి), ఎం.స్వప్న (స్వర భారతి మహిళా సంఘం, యాదాద్రి జిల్లా), ఈశ్వరమ్మ (తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్, మహబూబ్ నగర్ జిల్లా), ఎం. జనార్ధన్ (సంగెపు బొర్రన్న (RSV, ఆదిలాబాదు జిల్లా), లక్ష్మి (RSV, సంగారెడ్డి జిల్లా), చుక్కమ్మ (DDS మహిళా రైతుల సంఘం, జహీరాబాద్), శివాజీ (పర్యావరణవేత్త), సదానందం (RSV, కరీంనగర్ జిల్లా).

రైతు స్వరాజ్య వేదిక తరఫున బి. కొండల్ సమావేశాన్ని నిర్వహించారు. రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కార్యవర్గం తరఫున కన్నెగంటి రవి, ఎస్.ఆశాలత, విస్సా కిరణ్ కుమార్, శ్రీ హర్ష మాట్లాడారు.

కిసాన్ మిత్ర టీం క్షేత్రస్థాయిలో కౌలు రైతులు ప్రభుత్వ అధికారుల నుండి, భూయజమానుల నుండి ఎదుర్కొన్న సమస్యలను నాటిక రూపంలో ప్రదర్శించారు.

Read More
Next Story